Maha Sivaratri: శివరాత్రి మహాత్యాన్ని తెలిపే కాశీఖండంలోని యజ్ఞదత్తు, గుణనిధి కథ
శివరాత్రి.. ఇది ప్రతినెలా అమావాస్య ముందు వచ్చే చతుర్ధశి రోజున వస్తుంది. దానిని మాసశివరాత్రి అంటారు. అదే మాఘమాస కృష్ణ పక్షంలో వచ్చే చతుర్థశిని మహా శివరాత్రి అంటారు. శివరాత్రి అంటే యోగులకు మహా శక్తివంతమైన రోజు. సాధువులు తపస్సును తీసుకొని ఆ మహాశక్తి ద్వారా యోగాన్ని పోందేరోజు. పరమేశ్వరుని దివ్యశక్తి అందరికీ అందుబాటులో ఉండే రోజు.
శివరాత్రి మహాత్యం గురించి వేదవ్యాస మహర్షి రచించిన స్కందపురాణంలోని కాశీ ఖండంలో ఒక కథ ఉంటుంది. యజ్ఞ దత్తుడు అనే బ్రాహ్మణుడు నిత్యం దైవనిష్టాంగతుడై జీవించేవాడు. వేదాలను వల్లెవేసి, సదాచారాన్ని పాటిస్తూ ఉండేవాడు. ఇతనికి ఒక కుమారుడు జన్మించాడు. అతని పేరు గుణనిధి. అంటే అన్ని గుణాల్లో ఉత్తముడిగా ఉండాలని నామకరణం చేశాడు. బాల్యంలోనే ఉపనయనాది క్రతువులను చేయించాడు. అయితే ఇతనికి దైవ భక్తి, నిష్ట, అనుష్టానం పట్ల శ్రద్ద ఉండేది కాదు. తండ్రి రాజు ఆస్తానానికి పనికి వెళితే కుమారుడు జూదం ఆడేందుకు, వైశ్యా సాంగమ్యం కొరకు భ్రమిస్తూ ఉండేవాడు.
ఒకరోజు తల్లి కుమారుని రహస్యక్రీడలను గుర్తించి అలా చేయకు అని గారాబంగా బుజ్జగించేది. తండ్రికి తెలీయనివ్వకుండా దాచిపెట్టేది. దీంతో ఇంట్లోని వస్తువులన్నీ వైశ్యాగృహాల్లోకి చేరుతూ వచ్చాయి. ఇకరోజు రాజావారి సభా మందిరంలో నాట్యప్రదర్శనను చేసేందుకు ఆజ్ఞాపించి కొందరు స్త్రీలను పిలిపించారు. అక్కడ నృత్యం చేసే స్త్రీ చేతి వేలికి ఉన్న మణి అంగుళీకాన్ని చూస్తాడు మహారాజు. వెంటనే ఆగ్రహించిన వాడై విటువును ప్రశ్నిస్తాడు. దీంతో ఆమె తనవద్దకు వచ్చి సుఖించిన వారు ఇచ్చారని బదులిస్తుంది. దీంతో యజ్ఞదత్తుదిని ప్రశ్నిస్తాడు మహారాజు. ఆ ఉంగరం ఆమె వద్దకు ఎలా చేరిందో తెలుసుకుంటాను కొద్దిగా సమయం ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు ఇంటికి వెళ్లి భార్యను అడుగుతాడు ఈ ఉంగరం ఎవరిచ్చారు అని. భార్య తనకు తెలియదని అబద్దం చెబుతుంది. తండ్రి.. కొడుకు గురించి కనుగొనే ప్రయత్నంలో పడతాడు. ఇందులో భాగంగా కుమారుని స్నేహితులను అడుగగా వేశ్యుల వద్దకు వెళ్తాడన్న విషయం తెలుసుకుంటాడు.
తన కుమారున్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో గుణనిధికి ఇష్టమైన ఆహారాన్ని ఓ మహిళ తీసుకెళ్లడం కనిపిస్తుంది. దానిని తినడం కోసం ఆమె వెనకాలే వెళతాడు. రాత్రి గడిచిపోతుంది. ఒకవైపు ఆకలి. చివరకు గుడి గర్భాలయంలో పాత్ర ఉందని తెలుసుకొని ఆ చీకటిని తొలగించేందుకు తన పంచ అంచును కత్తిరించి దీపం వత్తిలా నలిపి దీపం వెలిగిస్తాడు. దీపం కాంతిలో దేవుని విగ్రహం కనిపిస్తుంది. లింగమూర్తిని దర్శించుకుంటాడు. చివరకి ఆహారపాత్రను గుర్తించి చేతిలో పట్టుకొని తినేందుకు తీసుకుపోయేక్రమంలో ఆలయం బయట పడుకున్న వారి చేతిని తొక్కుతాడు. దీంతో అతని చేతిలో పాత్రను చూసి దొంగగా భావించి చితకబాదుతారు. అక్కడికక్కడే గుణనిధి ప్రాణాలు కొల్పోతాడు.
అతని పాపానికి ప్రతీకారంగా నరకానికి తీసుకెళ్లేందుకు యమభటులు ప్రత్యక్షమవుతారు. మరోవైపు శివదూతలు కూడా ప్రత్యక్షమవుతారు. వీరిద్దరికీ కొంత వాదన జరుగుతుంది. ఇతడు చేయని పాపంలేదని యమభటులు చెబుతారు. ఇతను శివరాత్రి రోజు ఆకలితో అలమటించి ఉపవాసం చేశాడు. చీకటిలోగా ఉండే గర్భాలయంలో దీపం వెలిగించి ఈశ్వరుని దర్శనం చేసుకున్నాడు. చివరగా ప్రసాదం పాత్రతో మరణించాడు. ఇలాంటి పుణ్య మూర్తికి నేరుగా శివానుగ్రహం కలుగుతుందని కైలాసానికి తీసుకెళ్లేందుకు వచ్చామని చెబుతారు.
ఇక చేసేదేమి లేక నిరుత్సాహంతో యమభటుటు వెనుదిరుగుతారు. ఇక్కడ గుర్తించ వలసిన అంశం ఏమిటంటే ఈశ్వరుని ఆరాధన శివరాత్రి రోజు చేస్తే అది తెలిసి చేసినా తెలియక చేసినా మహా కోటి పుణ్య రాశి వచ్చి చేరి మన పాపాలను హరిస్తుందని కాశీఖండంలోని ఈ కథ చెబుతుంది. అందుకే మనం కూడా గుణనిధిలా కాకపోయినా ఎంతో కొంత పాపం అయితే చేస్తూనే ఉంటాము. అందుకే శివానుగ్రహం కోసం ఒక్క శివరాత్రి రోజైనా అభిషేకప్రియుడికి చంబుడు నీళ‌్లు భక్తిగా పోసి, చిటికెడు విభూదిని తలపై పూసి ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించినట్లయితే మహా పుణ్యం ప్రాప్తిస్తుందని కోరుకుందాం.