Maldives Tourism Effect : మాల్దీవులకు రోజుకి 9 కోట్లు నష్టం ! భారత్ తో పెట్టుకుంటే అంతే !!
చింత చచ్చినా పులుపు చావలేదు అని మన సామెత మాల్దీవులకు సరిగ్గా సరిపోతోంది. భారత్ తో గొడవ పెట్టుకుంటే తమ టూరిజం పరిశ్రమ పూర్తిగా దెబ్బతింటుందని తెలిసినా... ఆ దేశాధ్యక్షుడు మయిజ్జు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దాంతో మాల్దీవుల జనంలో వ్యతిరేకత అంతకంతకూ పెరిగిపోతోంది. మన టూరిజం మీద ఆధారపడి రోజుకు 9 కోట్ల రూపాయల నష్టం వస్తోంది.
ప్రధాని నరేంద్రమోడీ (PM Narendra Modi) లక్షద్వీప్ పర్యటనను ఎద్దేవా చేసి… భారతీయులు టార్గెట్ గా ముగ్గురు మాల్దీవుల మంత్రులు చేసిన రచ్చ ఇప్పుడు ఆ దేశ టూరిజం పరిశ్రమను కోలుకోలేని దెబ్బ తీసింది. బాయ్ కాట్ మాల్దీవ్స్ పేరుతో భారతీయ పర్యాటకులు ఆ దేశానికి పోవడమే మానేశారు. వేలల్లో టూర్స్ క్యాన్సిల్ అయ్యాయి. విమానాల్లో సీట్లు రద్దు చేసుకున్నారు. కొన్ని ట్రావెలింగ్ ఏజెన్సీలు మాల్దీవులకు బుకింగ్స్ నిలిపివేసి… లక్షద్వీప్ (Lakshadweep) కు మొదలుపెట్టాయి. దాంతో లక్షద్వీప్ కి వెళ్ళడానికి మార్చి నెల దాకా బుకింగ్స్ ఖాళీ లేని పరిస్థితి ఏర్పడింది.
భారతీయ పర్యాటకులతోనే అత్యధికంగా ఆదాయం పొందుతున్న మాల్దీవుల టూరిజానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. రోజుకి 9 కోట్ల రూపాయలను నష్టపోతున్నట్టు అక్కడి ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి. అంతేకాదు… ఈ పరిశ్రమపై ఆధారపడ్డ 44 వేల మాల్దీవుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని అంటున్నాయి. అక్కడి ట్రావెల్ ఏజెన్సీలు భారత్ కు మద్దతు తెలుపుతున్నాయి. తమను క్షమించాలనీ… మళ్ళీ పర్యాటకానికి రావాలని కోరుతున్నాయి. ప్రతి యేటా భారత్ నుంచి రెండు లక్షల మందికి పైగా మాల్దీవుల్లో పర్యాటకానికి వెళ్తుంటారు. కానీ చైనా పక్షపాతి అయిన మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జీ (Mohamed Muizzu) మాత్రం… భారత్ కు వార్నింగ్స్ ఇస్తున్నాడు. ఆ దేశంలో ఉన్న దాదాపు 77 మంది భారతీయ సైనికులను మార్చి15 లోగా వెళ్ళిపోవాలని అల్టిమేటం జారీ చేశాడు. ఈ మధ్యే చైనా వెళ్ళి వచ్చిన ఆయన ఆ దేశం అండ చూసుకొని రెచ్చిపోతున్నట్టు అర్థమవుతోంది.
Sania delete Shoib Photos:సానియా-షోయబ్ విడాకులేనా ? అందుకే ఆ ఫోటోలు తీసేసిందా ?
మాల్దీవుల్లో మన దేశం దశాబ్దం క్రితం ఇచ్చిన ధృవ్ హెలికాప్టర్స్, డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్, అక్కడే ఉన్నాయి. వీటి నిర్వహణ, బాగోగులను చూడటంతోపాటు… మాల్దీవుల సైనికులకు శిక్షణ ఇవ్వడానికి అక్కడ మన జవాన్లు పనిచేస్తున్నారు. భారత్ తో పెట్టుకున్నందుకు అధ్యక్షుడు మొయిజ్జీకి మొదటి షాక్ తగిలింది. మాల్దీవుల రాజధాని మాలేలో జరిగిన మేయర్ ఎన్నికల్లో ఆయన పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఇండియాకు అనుకూలమైన ఆదాం ఆజీం పార్టీకి మెజారిటీ స్థానాలు దక్కాయి. ఈ పార్టీకి 45శాతం ఓట్లు దక్కితే… మెయిజ్జీ పార్టీ 27శాతమే గెలుచుకుంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే అక్కడి నుంచి రావడానికి సైనికులు సిద్ధంగా ఉన్నారు. మోడీ ప్రభుత్వం దౌత్యపరంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుది అన్నది చూడాలి.