Medigadda Barrage: మేడిగడ్డ బ్రిడ్జ్ ఎందుకు కుంగిందంటే.. కేంద్ర కమిటీ రిపోర్ట్‌లో సంచలన నిజాలు..
మేడిగడ్డ బ్రిడ్జ్ కుంగడంవెనుక ఉన్న కారణాలను పరిశీలించేందుకు కేంద్ర జలసంఘం ఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ ఇప్పటికే మేడిగడ్డను పరిశీలించి ఓ రిపోర్ట్ కూడా తయారు చేసింది. ఆ రిపోర్ట్‌లో బ్రిడ్జ్ కుంగడానికి గల కారణాలను క్లియర్‌గా ప్రస్తావించారు అధికారులు.
Medigadda Barrage: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన మేడిగడ్డ బ్రిడ్జ్ కుంగడం తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌లో లోపాలు బయటపడటం బీఆర్‌ఎస్ గవర్నమెంట్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ ప్రమాదాన్ని, దాని వెనుక ఉన్న కారణాలను పరిశీలించేందుకు కేంద్ర జలసంఘం ఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ ఇప్పటికే మేడిగడ్డను పరిశీలించి ఓ రిపోర్ట్ కూడా తయారు చేసింది.
ఆ రిపోర్ట్‌లో బ్రిడ్జ్ కుంగడానికి గల కారణాలను క్లియర్‌గా ప్రస్తావించారు అధికారులు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న కారణంగా పియర్స్ వద్ద ఇసుక కొట్టుకుపోవడంతో బ్రిడ్జ్ కూలినట్టు నిర్ధారించారు. ఇసుక భారీ మొత్తంలో మైగ్రేట్ అవడం కారణంగానే ప్రమాదం జరిగిదని రిపోర్ట్ ఇచ్చారు. నిటి ప్రవాహం తగ్గిన తరువాత దెబ్బతిన్న పియర్స్ ఉన్న బ్లాక్‌కు కాఫర్ డ్యామ్ నిర్మించి మరింత లోతుగా పరిశీలిస్తామన్నారు. అప్పుడు సేకరించిన డేటాను బట్టి చర్యలు తీసుకుంటామంటూ చెప్పారు. ప్రాజెక్ట్‌కు సంబంధించిన డిజైన్స్ డ్రాయింగ్స్ అన్నీ పంపితే.. వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామంటూ తెలంగాణ ఇరిగేషన్ అధికారులను కోరారు కేంద్ర కమిటీ సభ్యులు.
కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్, తెలంగాణ డ్యాం సేఫ్టీ కమిటీ చైర్మన్ ఏబీ పాండ్యా కూడా త్వరలోనే డ్యాంను పరిశీలించబోతున్నారు. తన టీంతో మరోసారి మేడిగడ్డను పరిశీలించేందుకు ఆయన వస్తున్నట్టు తెలంగాణ నీటిపారుదల అధికారులు చెప్తున్నారు. ఈ పరిశీలన తరువాత పూర్తిస్థాయిలో కేంద్ర కమిటీకి వివరాలు అందిస్తారని.. ఆ తరువాత తగిన చర్యలు తీసుకుంటారని చెప్తున్నారు.