Mount Kailash: మంచుకొండల్లో మహాద్భుతం.. కైలాసంలో నమ్మలేని నిజాలు..!

శ్మశానవాసి.. నిరాడంబరుడు.. బూడిదపూసుకుని తిరుగుతుంటాడు.. అనుకుంటాం కానీ.. కొన్ని శివ మహాత్మ్యాలు వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అలాంటిదే హిమగిరుల్లో కొలువైన కైలాస పర్వతం. సత్యలోకం.. బ్రహ్మ నివాస స్థలం. విష్ణువు కొలువైఉండేది వైకుంఠంలో. కైలాసమే శంకరుని గృహం. మేరు పర్వతంపై ఉన్న బ్రహ్మలోకానికి 2కోట్ల 62లక్షల యోజనాల దూరంలో ఉంది విష్ణులోకం. మరి పరమేశ్వరుని కైలాసం..? బ్రహ్మ, విష్ణువులకు భిన్నంగా భూమ్మిదే ఈశ్వరుడు నివసిస్తున్నాడా..? మనం సజీవంగా కైలాసానికి చేరుకోగలమా? మానవ శరీరంతో త్రినేత్రుని చూసే భాగ్యం దక్కుతుందా?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 19, 2023 | 01:02 PMLast Updated on: Mar 19, 2023 | 1:02 PM

Mount Kailash Special Story

మంచుకొండల్లో వెండివెన్నెల.. అతీంద్రీయ శక్తులు, అంతుపట్టని వెలుగుదివ్వెలు. సముద్రమట్టానికి 21వేల 778 అడుగుల ఎత్తు, టిబెట్ భూభాగం, హిమాలయ పర్వత శ్రేణుల్లోని కైలాస పర్వతాన్నే ఇప్పుడు మీరు చూస్తున్నది. మౌంట్ కైలాస్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా అందరికీ సుపరిచితం. ఈ కొండపైనే శివపార్వతులు కొలువైఉన్నారని ప్రసిద్ధి. అంతేకాదు మొత్తం శివపరివారమే ఇక్కడ నివసిస్తున్నారని కొండ ఆకారాల్ని బట్టి చెప్తుంటారు. ఆసియాలో పొడవైన నదులుగా పేరుగాంచిన బ్రహ్మపుత్ర, సింధు, సట్లేజ్, కర్ణాలి మూలాలు ఈ ప్రాంతంలోనే కనిపిస్తాయి. కైలాసం నుంచి మొదలయ్యే ఈ నాలుగు నదులే నాలుగువైపులా ప్రవహించి ప్రపంచాన్ని నాలుగు భాగాలుగా విభజిస్తున్నాయనేది పురాణ సారాంశం. ఎందరో రుషులకు తపోభూమిగా నిలిచింది ఈ సుందర ప్రదేశం. ఇప్పటికీ ఎన్నో ఏళ్లుగా తపస్సు చేస్తున్న అఘోరాల దర్శనం మనకీ ప్రదేశంలో లభిస్తుంది.

నలువైపులా నాలుగు రూపాలు, నాలుగు రంగులతో అద్భుతంగా దర్శనమిస్తుంది కైలాసపర్వతం. ఇక్కడికి చేరుకున్న ప్రతీ యాత్రికుడిది ఓ విచిత్రమైన అనుభూతి. ఏదో ఒక రూపంలో ఉమాశంకరుల దర్శనం ప్రాప్తిస్తుందనేది భక్తుల నమ్మకం. విష్ణుపురాణం ప్రకారం ప్రపంచానికే పునాది ఈ కైలాస శిఖరం. తామరపువ్వు రెక్కలలా విస్తరించిన ఆరు పర్వత శ్రేణులు కలిసే కేంద్ర స్థానంలో ఈ పర్వతం నిక్షిప్తమైఉంది. స్ఫటిక, బంగారం, రూబీ, నీలం రాళ్లతో ఈ పర్వతాన్ని నిర్మించినట్టు విష్ణుపురాణం స్పష్టం చేసింది. అందుకే ఇది నలువైపులా నాలుగు రంగుల్లో కనిపిస్తుంది.

భారతప్రభుత్వం జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో కైలాస మానససరోవర యాత్ర నిర్వహిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులకి మాత్రమే యాత్ర చేసే అవకాశం లభిస్తుంది. ఢిల్లీ నుంచి మొదలయ్యే ఈ యాత్ర మార్గంలో నవీడాగ్ చేరుకున్నాక కైలాస ప్రాంత సముదాయంలోని ఓం పర్వతం దర్శనమిస్తుంది. మంచుకొండలపై ప్రతిరోజూ సూర్యస్తమయ వేళ ఓంకార స్వరూపం ప్రస్ఫూటంగా కనిపించడం శివానుగ్రహమే అంటారు భక్తులు.

mount kailash

Mount Kailash

కైలాస పర్వతానికి సమీపంలోనే అతిసుందరప్రదేశం మానససరోవరం. తెల్లవారుజామున ఓ కాంతిపుంజం.. కైలాస శిఖరం నుంచి మానస సరోవరంలోకి ప్రవహిస్తుండటం చూసామని చాలామంది భక్తులు చెప్తుంటారు. బ్రాహ్మీముహూర్తంలో దేవతలు స్నానమాచరించేందుకు సరోవరానికి వస్తారని పురాణ వచనం. అసలు కైలాసపర్వతాన్ని, మానస సరోవరాన్ని వేరువేరుగా చూడలేం. ఈ ప్రపంచానికి కైలాసం తండ్రయితే.. మానససరోవరం తల్లివంటిదని అభివర్ణిస్తుంటారు. గడ్డకట్టే చలి, చుట్టూ మంచు పర్వతాలు.. అయినాసరే ఎప్పుడూ స్వచ్ఛమైన నీటితో తళతళలాడే మానససరోవరం. బ్రహ్మ మనసు నుంచి ఉద్భవించిందని ప్రస్తావించే మానససరోవరం.. ఓ అంతుపట్టని మిస్టరీ.

మొత్తం యాత్రలో అత్యంత క్లిష్టమైనది కైలాసశిఖర పరిక్రమ. మానససరోవర పరిక్రమ అనంతరం పరమేశ్వరుని నివాసానికి ప్రదక్షిణ చేయడమే కైలాస పరిక్రమ. ఇక్కడికి చేరుకున్న ప్రతీ భక్తునిది ఓ విచిత్ర అనుభూతి. 52 కిలోమీటర్ల చుట్టుకొలత కలిగిన కైలాస పరిక్రమ సమయంలో యాత్రికుల గోర్లు, వెంట్రుకలు అసాధారణంగా పెరుతుంటాయట. వాతావరణం త్వరత్వరగా మారిపోతుందని.. దానికి తగ్గట్టు వెంటవెంటనే కైలాసం రంగులు మారుస్తుంటుందని అంటుంటారు. ఆక్సిజన్ సరిగా అందదు. శివనామస్మరణే భక్తులను ముందుకు నడిపిస్తుంది.

కైలస పర్వతాన్ని ఎవరూ అధిరోహించలేదు. హిందువులకది పవిత్రం.. మాక్కందంటూ చైనా ఎన్నో ప్రయోగాలు చేపట్టింది. కానీ ఏమీ సాధించలేకపోయింది. అయితే గతంలో కొందరు పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. యోగశాస్త్రంలో సాహసచక్రంగా పేర్కొన్న మౌంట్ కైలాస్ అంతుచూడటం సాధ్యం కాదంటారు. కైలాస మానస సరోవరంలోని వింతలన్నీ శివలీలలే అనేది భక్తుల మాట. కాదు అక్కడున్న ప్రత్యేక పరిస్థితులే కారణమని సైన్స్ చెబుతుంది. అవును ఆ ప్రత్యేక పరిస్థితులని ఏర్పరుస్తుంది ఈశ్వరుడే అంటారు భక్తులు.

క్రమశిక్షణ, నిబద్ధత ఈ రెండూ ఉన్నవారికి మాత్రమే కైలాస వీక్షణం సొంతం. ఎన్నో కఠిన పరిస్థితులను ఎదుర్కొని ఇక్కడికి వచ్చే సమయానికి నేను అనే అహం చచ్చిపోతుంది. అహం లేనప్పుడే కదా మానవుడు విజ్ఞానాన్ని సంపాదించేది. అందుకే నిష్ఠగా, ఏకాగ్రతతో కైలాసగిరిని చేరుకున్నవారికి అనేక అలౌకిక ఆథ్యాత్మిక అనుభూతులు సొంతమవుతాయి. కైలాసం గురించి ప్రశ్న నమ్మకానికి చెందింది కాదు, మతానికి చెందింది కాదు. మనం మామూలుగా నివసించే చోటుకంటే మాత్రం ఖచ్చితంగా ఉన్నతమైనదే.