Naltrexone Chip: మందు మానేయాలనుకుంటున్నారా… అయితే ఈ ఒక్కటి చేయండి చాలు..!?

మద్యం తాగడం అలవాటైతే మానుకోవడం కష్టం. మొదట్లో అప్పుడప్పుడూ తీసుకునే మద్యం తర్వాత రోజువారీ అలవాటుగా మారుతుంది. ప్రస్తుతం ఈ అలవాటు మాన్పించే సరైన చికిత్స అంటూ ఏదీ లేదు. అయితే, ఇప్పుడు దీనికో పరిష్కారం దొరికినట్లే కనిపిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 28, 2023 | 02:06 PMLast Updated on: Apr 28, 2023 | 2:47 PM

Naltrexone Chip Can Help End Alcoholism

Naltrexone Chip: ఆల్కహాల్ అలవాటు ఆరోగ్యానికి ఎంత హాని చేస్తుందో తెలిసిందే. దీనివల్ల అనేక కుటుంబాలు నాశనమవుతుంటాయి. ఈ అలవాటు మానుకుందామని చాలా మంది ప్రయత్నించి విఫలమవుతుంటారు. ప్రస్తుతం ఈ అలవాటు మాన్పించే సరైన చికిత్స అంటూ ఏదీ లేదు. కొన్ని మందులు, కౌన్సెలింగ్, థెరపీ వంటి సదుపాయాలు ఉన్నా అవి పూర్తి స్థాయిలో పని చేసిన దాఖలాలు లేవు. అయితే, ఇప్పుడు దీనికో పరిష్కారం దొరికినట్లే కనిపిస్తోంది. మెదడులో ఒక చిప్ అమర్చడం ద్వారా ఆల్కహాల్ తాగే అలవాటు మాన్పించవచ్చు అంటున్నారు పరిశోధకులు. ప్రస్తుతం దీనిపై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇటీవల జరిపిన ప్రయోగం విజయవంతమైంది కూడా. నిజంగా ఇది సాధ్యమేనా? దీంతో మందుబాబుల అలవాట్లకు చెక్ పడుతుందా?
మద్యం తాగడం అలవాటైతే మానుకోవడం కష్టం. మొదట్లో అప్పుడప్పుడూ తీసుకునే మద్యం తర్వాత రోజువారీ అలవాటుగా మారుతుంది. రోజూ టైమ్‌కు మందు తాగకపోతే పిచ్చెక్కినట్లవుతుంది. మద్యం తాగితే మెదడు రిలాక్స్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. మద్యానికి మెదడు అలవాటు పడుతుంది. అది లేకపోతే ఒత్తిడికి గురవుతుంది. మద్యం తాగగానే రిలాక్సింగ్ హార్మోన్లు రిలీజ్ చేసి, రిలీఫ్ ఇస్తుంది. మెదడులోని ఈ చర్య వల్లే మద్యం తాగకుండా ఉండలేరు. మందుబాబులు మద్యం మానేందుకు ప్రయత్నించినా మెదడు పనితీరు వల్ల ఇది సాధ్యం కాదు. ఇప్పుడు దీనికి చెక్ పెట్టబోతున్నారు శాస్త్రవేత్తలు. మద్యం సేవించే అలవాటు మానుకోవాలని ప్రయత్నించే వారి కలలు త్వరలోనే ఫలించే అవకాశం ఉంది. ఈ దిశగా శాస్త్రవేత్తలు జరుపుతున్న ప్రయోగాలు సత్ఫలితాల్నిస్తున్నాయి. ఇటీవల చైనాకు చెందిన కొందరు పరిశోధకులు ఈ విషయంలో విజయం సాధించారు.

Naltrexone Chip
నాల్ట్రోక్సిన్ చిప్
మద్యం సేవించడం ద్వారా మెదడు పొందే అనుభూతిని దూరం చేస్తే ఈ అలవాటును పోగొట్టుకోవచ్చు. ప్రతి రోజూ అలవాటుగా మద్యం సేవించడం ద్వారా మెదడు ఇచ్చే రివార్డును అడ్డుకుంటే ఇది సాధ్యం అవుతుంది. అంటే మద్యం తాగిన తర్వాత మెదడులో కలిగే చర్యలను అడ్డుకోవాలి. దీనికోసమే ఐక్యరాజ్యసమితికి చెందిన నార్కోటిక్ కంట్రోల్ బోర్డుకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు చైనాలో ఒక చిప్ రూపొందించారు. దీని పేరు నాల్ట్రెక్సోన్ చిప్. దీన్ని మెదడులో అమర్చడం ద్వారా మద్యం సేవించడం వల్ల కలిగే అనుభూతి, చర్యలను అడ్డుకుంటారు. మద్యం కోసం మెదడు ఎదురు చూడకుండా చేస్తుంది ఈ చిప్. దీంతో మందుబాబులు కూడా సాధారణ వ్యక్తుల్లాగే మందు కోసం ఆరాటపడకుండా ఉంటారు. ఎంతగా మద్యం సేవించే అలవాటు ఉన్నా.. వారిలో మళ్లీ మద్యం తాగాలనే కోరిక కలగదు. క్రమంగా ఈ అలవాటు దూరమవుతుంది.
ప్రయోగం సక్సెస్
చైనాకు చెందిన 36 ఏళ్ల ఒక వ్యక్తి మెదడులో ఈ చిప్ అమర్చారు. ఐద నిమిషాల చిన్న సర్జరీ ద్వారా అతడి మెదడులో చిప్ ప్రవేశపెట్టారు. ఇది ఆల్కహాల్ తీసుకోవాలన్న కోరికను అడ్డుకుంటుంది. మద్యం ఎంత అలవాటున్నప్పటికీ, చిప్ అమర్చకున్న వారిలో ఆ కోరిక కలగదు. నాల్ట్రెక్సోన్ చిప్ అమర్చిన వ్యక్తిలో ఆ రోజు నుంచి మద్యం తాగే అలవాటు దూరమైంది. అంతకుముందు అతడు ప్రతి రోజూ మద్యం సేవించేవాడు. బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి ముందు కూడా మందు తాగాల్సిందే. రోజూ అర లీటర్ చైనా ఆల్కహాల్ తాగేవాడు. పని చేసే టైంలో కూడా అతడు మద్యం మత్తులోనే ఉండేవాడు. ఇది తప్పని తెలిసి మందు మానేసేందుకు ప్రయత్నించాడు. కానీ, సక్సెస్ కాలేదు. అయితే, అతడి మెదడులో నాల్ట్రెక్సోన్ చిప్ అమర్చిన తర్వాత నుంచి అతడు మద్యం సేవించడం చాలా వరకు తగ్గించేశాడు.

Naltrexone Chip
ఎంతకాలం పని చేస్తుంది?
ప్రస్తుతం ఈ ప్రయోగం ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. చైనా వ్యక్తిపై జరిపిన ప్రయోగం విజయవంతమైంది. అయితే, ఈ చిప్ ఐదారు నెలలు మాత్రమే పని చేస్తుంది. అంతకాలంపాటు చిప్ అమర్చిన వ్యక్తిలో ఆల్కహాల్ గురించిన ఆలోచన రాదు. మద్యం సేవించాలని అనిపించదు. మందు తాగాలనే కోరిక కలిగేందుకు కారణమయ్యే రసాయనాల విడుదలని ఇది అడ్డుకుంటుంది. చాలా తక్కువగా మాత్రమే మద్యం సేవిస్తారు. ఒకవేళ మందు తాగినా గతంలోలాగా పెద్దగా సంతోషంగా అనిపించదు. దీన్ని మరింత అభివృద్ధి చేసేందుకు పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ చిప్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగానే ఉన్నాయి. కానీ, సర్జరీ చేయాల్సి ఉంటుంది కాబట్టి కొన్ని ఇబ్బందులుంటాయి. నొప్పి, ఇన్ఫెక్షన్స్ వంటివి రావొచ్చు. చైనాలో ఆల్కహాల్ సంబంధిత మరణాలు ఎక్కువ. ఈ కారణంతో అత్యధిక మంది చనిపోతున్నది చైనాలోనే. అందుకే ఒకవైపు మద్యం అమ్మకాలు జరుపుతూనే.. మరోవైపు మద్యపానానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంటుంది. అందులో భాగంగానే ఈ దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ చిప్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే మందుబాబుల అలవాటు మాన్పించవచ్చని చైనా భావిస్తోంది.