డియర్ పుతిన్.. మా బలమేంటో చూస్తావా..! రష్యా దిమ్మతిరిగేలా నాటో దేశాల బల ప్రదర్శన
25 దేశాలు.. 250కి పైగా అత్యాధునిక ఎయిర్‌క్రాఫ్ట్‌లు..10వేల మందికి పైగా వాయుసేన సిబ్బంది.. అందరూ కలిసి ఒకేసారి ప్రత్యర్థులపై ఆయుధాలు ఎక్కుపెడితే ఎలా ఉంటుంది..! అవతలివాడు ఎంత బలవంతుడైనా తోకముడవాల్సిందే.

Nato Countrys Ready to War on Russia
అమెరికా సహా నాటో సభ్యదేశాలు జర్మనీ వేదికగా ఇప్పుడు ఇలాంటి బలప్రదర్శనే చేపట్టాయి. ఉక్రెయిన్‌పై 475 రోజులుగా నాన్‌స్టాప్‌గా యుద్ధాన్ని కొనసాగిస్తున్న రష్యాకు నాటో దేశాలు తొలిసారిగా తమ సత్తా ఏంటో చూపించే ప్రయత్నం చేశాయి. నాటో సభ్యదేశాల జోలికి వచ్చినా.. తమ భూభాగాన్ని అంగుళం ఆక్రమించుకున్నా ఎలాంటి యుద్ధానికైనా తాము సిద్ధంగా ఉంటామన్న సందేశాన్ని రష్యాకు పంపేందుకే అన్నట్టు నాటో సభ్య దేశాలు భారీ మిలటరీ ఎక్సర్‌సైజ్ చేపట్టాయి.
ఉన్నట్టుండి ఈ బలప్రదర్శన ఎందుకు?
ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను అమెరికా సహా దాని మిత్ర దేశాలు ఆరంభంలో చాలా లైట్ తీసుకున్నాయి. ఉక్రెయిన్‌కు మద్దతుగా గంభీరమైన ప్రకటనలు చేస్తేనో.. ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తేనో… పుతిన్ వెనకడుగు వేస్తారని అంతా భావించారు. కానీ ఒక్కసారి కమిట్ అయితే తన మాత తానే వినను అన్నట్టు రష్యా ఉగ్రరూపం దాల్చింది. గతేడాది ఫిబ్రవరి 24న మొదలైన యుద్ధం ఇప్పటికీ భీకరంగా కొనసాగుతూనే ఉంది. పశ్చిమ దేశాలన్నీ కలిసి రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించి అంతర్జాతీయ వాణిజ్యం విషయంలో ఒంటరి చేసే ప్రయత్నం చేసినా రష్యా యుద్ధాన్ని ఆపలేదు. అటు ఉక్రెయిన్ కూడా ప్రతిదాడులతో ఇవాళ్టికి విరుచుకుపడుతూనే ఉంది. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా విజయం సాధిస్తే.. అది అమెరికా సహా దాని మిత్ర దేశాలకు ఘోర అవమానమే అని చెప్పాలి. ముఖ్యంగా 25 సభ్య దేశాలు ఉండి కూడా నాటో తన సత్తాను చూపలేకపోతే… అది నాటో అస్తిత్వాన్ని దెప్పకొట్టడమే. పైగా రష్యాతో పాటు ఇతర ప్రపంచదేశాలకు కూడా నాటో దేశాల జోలికి రావొద్దు అన్న సందేశం ఇవ్వొచ్చు. అందుకే నాటో దేశాలు మూకుమ్మడిగా బల ప్రదర్శనకు దిగాయి.
ఎయిర్ డిఫెండర్…చరిత్రలో తొలిసారిగా
మిత్ర దేశాలు తమ ఆయుధ సంపత్తిని ప్రపంచానికి తెలిపేందుకు తమ బలమేంటో చూపించేందుకు ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహిస్తూనే ఉన్నాయి. ప్రపంచంలో ఏదో ఒక మూల మిలటరీ ఎక్సర్‌సైజ్ జరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం జర్మనీలో జరుగుతున్నది మాత్రం అలాంటిది కాదు. నాటో చరిత్రలోనే ఇంత పెద్ద స్థాయిలో ఎయిర్ డ్రిల్ ఎప్పుడూ జరగలేదు. 1949 నాటి ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత నాటో సభ్య దేశాలు ఈ స్ధాయిలో బలప్రదర్శన దిగడం కూడా ఇదే తొలిసారి. ఎయిర్ డిఫెండర్ పేరుతో నిర్వహిస్తున్న ఈ బలప్రదర్శనకు నాటో దేశాల నుంచి పెద్ద ఎత్తున ఆయుధ సంపత్తిని జర్మనీకి తరలించారు. ఈ ఎయిర్ డ్రిల్ కోసం అమెరికా ఏకంగా 100 నేషనల్ గార్డ్స్ తో పాటు నావీ ఎయిర్ క్రాఫ్టులను అమెరికా జర్మనీ తరలించింది. ఇటీవలే నాటోలో సభ్యత్వం తీసుకున్న ఫిన్‌లాండ్ కూడా ఈ డ్రిల్స్ లో పాల్గొంటోంది.
ఎయిర్ డ్రిల్‌లో ఏం ప్రదర్శిస్తున్నారు ?
కీలకమైన యుద్ధంలో పాల్గొనే అన్ని రకాల మిలటరీ ఎక్విప్‌మెంట్‌ను ఎయిర్‌డ్రిల్‌లో భాగస్వామ్యం చేశారు. 12 రోజుల పాటు జరిగే ఈ మిలటరీ ఎక్సర్‌సైజ్‌లో కార్గోతో పాటు రీఫ్యూయలింగ్ ప్లేన్స్, వర్క్ హార్స్ ఎయిర్ క్రాఫ్ట్ లు పాల్గొంటున్నాయి. నాటో దేశాల నుంచి ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేసేందుకు ఉపయోగించే కీలకమైన యుద్ధ విమానాలను కూడా ఈ బలప్రదర్శనలో ఉంటారు. ఉక్రెయిన్ సైన్యానికి ఇక్కడ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. ఇటీవలే ఉక్రెయిన్‌కు F 16 యుద్ధ విమానాలు అందించిన అమెరికా… జర్మనీలో జరుగుతున్న ఎయిర్ డిఫెండర్‌లో కీలక పాత్ర పోషిస్తోంది.
ఎప్పుడో జరగాల్సింది.. ఇప్పుడు జరుగుతోంది ?
నాటో సభ్యదేశాలన్నీ ఉమ్మడిగా ఎయిర్ డ్రిల్ నిర్వహించడంలో తాత్సారం చేశాయనే చెప్పాలి. వాస్తవానికి ఈ తరహా ఎయిర్ డ్రిల్ 2018లోనే జరగాలి. 2014లోనే రష్యా… ఉక్రెయిన్‌పై దాడి చేసి.. ఆ దేశంలో అంతర్భాగంగా ఉన్న క్రిమియాను ఆక్రమించుకుంది. ఉక్రెయిన్ సైనికులకు.. రష్యా మద్దతుతో రెచ్చిపోయిన వేర్పాటవాదులకు అప్పట్లో పెద్ద యుద్ధమే జరిగింది. ఆ తర్వాత రష్యా దురాక్రమణకు బ్రేక్ వేసేందుకు నాటో కూడా శక్తివంతంగా మారుతూ వచ్చింది. నాటోలో సభ్య దేశాల సంఖ్య గణనీయంగా పెరిగిన తర్వాత 2018లో అతిపెద్ద ఎయిర్ షో నిర్వహించాలని భావించారు. కానీ అది జరగలేదు. మరోసారి రష్యా నుంచే ఉక్రెయిన్‌కు ముప్పు పొంచి ఉండటం… దాదాపు సంవత్సరంన్నరకు పైగా యుద్దం సాగుతుండటంతో పశ్చిమ దేశాలన్నీ మరోసారి తమ సత్తా ఏంటో చూపించాల్సిన అవసరాన్ని గుర్తించాయి. అందులో భాగంగానే ఎయిర్ డ్రిల్ నిర్వహిస్తున్నాయి. దీని ద్వారా రష్యా వెనకడుగు వేయదన్న సంగతి అమెరికాకు కూడా తెలుసు. అయినా నాటో దేశాలను పరిరక్షించుకోవడంలో భాగంగా తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కు పని చెప్పాయి ఆయా దేశాలు.