Netherlands: అలాంటి చిన్నారులకు చనిపోయే అవకాశం.. నెదర్లాండ్స్ సంచలన నిర్ణయం

అనారోగ్యం కలిగి ఉన్న పన్నెండేళ్ల లోపు చిన్నారులు కోరుకుంటే, వైద్య పరంగా మరణించేలా కొత్త చట్టం తీసుకొచ్చింది. ఇలాంటి చట్టం చేసిన రెండో దేశంగా నిలిచింది నెదర్లాండ్స్. ఇంతకుముందు బెల్జియం మాత్రమే ఈ తరహా చట్టాన్ని అమలు చేస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 16, 2023 | 03:48 PMLast Updated on: Apr 16, 2023 | 3:48 PM

Netherlands To Allow Euthanasia For Children Below 12

Netherlands: తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారుల విషయంలో నెదర్లాండ్స్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అనారోగ్యం కలిగి ఉన్న పన్నెండేళ్ల లోపు చిన్నారులు కోరుకుంటే, వైద్య పరంగా మరణించేలా కొత్త చట్టం తీసుకొచ్చింది. ఇలాంటి చట్టం చేసిన రెండో దేశంగా నిలిచింది నెదర్లాండ్స్. ఇంతకుముందు బెల్జియం మాత్రమే ఈ తరహా చట్టాన్ని అమలు చేస్తోంది.

తాజా చట్టం ప్రకారం.. ఏడాది వయసు నుంచి పన్నెండేళ్ల లోపు చిన్నారులు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు.. ఇక ఎప్పటికీ ఆ జబ్బుకు చికిత్స లేనప్పుడు.. వాళ్లు ఆ జబ్బు వల్ల భరించలేని బాధల్ని ఎదర్కొంటున్నప్పుడు.. వారికి చికిత్స లేదా సపర్యలు చేయడంలో వైద్యులు, కుటుంబ సభ్యులు కృషి ఫలించే అవకాశం లేనప్పుడు.. ఇన్ని ఇబ్బందుల మధ్య బతకడం కంటే చావడమే మేలు అనిపించే చిన్నారులకు ప్రభుత్వం చనిపోయే అవకాశం కల్పిస్తుంది. దీని ప్రకారం.. అలాంటి వాళ్ల కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి. ఒకవేళ పిల్లల తరఫున వాళ్లు లేదా ఇంకెవరైనా దరఖాస్తు చేయాలంటే తల్లిదండ్రుల అంగీకారం కావాలి. ఒక వైద్య నిపుణులు బృందం ఈ దరఖాస్తును పరిశీలించి దీనిపై నిర్ణయం తీసుకుంటుంది.

దీని ప్రకారం ఏడాదికి ఐదు నుంచి పది మంది ఈ పద్ధతిలో మరణించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక పన్నెండు నుంచి పదహారేళ్ల వయసు వారిలో గత ఏడాది ఈ చట్టాన్ని ఉపయోగించుకుని ఒక్కరు మాత్రమే మరణించారు. ఒకవేళ పిల్లలు మరణించేందుకు వైద్య బృందం అవకాశం కల్పిస్తే, ఎలాంటి బాధ, నొప్పి వంటివి లేకుండా పిల్లలు మరణించేలా చేయొచ్చు. ఇందుకు నిపుణులైన వైద్యులు సాయపడతారు. వైద్య పరమైన చర్యల ద్వారా పిల్లలు సులభంగా మరణించేలా చూస్తారు. దీనికి మూడు రకాల పద్ధతులు ఉన్నాయి. ఒక దానిలో రోగుల సూచనల ప్రకారం వైద్యులే పిల్లలు చనిపోయేలా చేస్తారు.

రెండో పద్ధతి ప్రకారం.. రోగికి అవసరమైన మెడికల్ సపోర్ట్ అందకుండా ప్రాణం పోయేలా చేస్తారు. అంటే వారికి కావాల్సిన మందులు, ఆక్సిజన్ వంటివి నిలిపివేస్తారు. మూడో పద్ధతి మెర్సీ కిల్లింగ్. ఇందులో రోగి కోరికమేరకు తనకుతాను మరణించేలా చూస్తారు. ఈ చట్టం రోగులు, వారి కుటుంబ సభ్యుల పూర్తి విచక్షణ మీదే జరుగుతుంది. ఎలాంటి ఒత్తిడికి తావుండదు.