Heavy Rains: రెండు నెలల్లో తెలుగు రాష్ట్రాలకు వర్షాలు తక్కువేనా..? వాతావరణ శాఖ ఏం చెప్పింది
తెలంగాణకు సంబంధించి రాబోయే మూడు రోజులపాటు కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు అవకాశం ఉంది. ఏపీకి సంబంధించి అక్కడక్కడ రెండు రోజులపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Heavy Rains:జులైలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు ఇప్పుడు కాస్త నెమ్మదించాయి. ఏపీతోపాటు తెలంగాణలోనూ ఓ మోస్తరు వర్షాలే కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వర్షాలపై వాతావరణ శాఖ తాజాగా ప్రకటించింది. హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తెలంగాణకు సంబంధించి రాబోయే మూడు రోజులపాటు కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు అవకాశం ఉంది. అన్ని జిల్లాల్లోనూ ఒకట్రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు లేకపోవడంతో వాతావరణ శాఖ ఆగస్టు 13 వరకూ ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.
హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఏపీకి సంబంధించి అక్కడక్కడ రెండు రోజులపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉంది. తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో స్వల్పంగా వర్షాలు నమోదయ్యే ఛాన్స్ ఉంది. పలు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా వర్షాలు ఉంటాయి. అవి సాధారణ వర్షాలే. ఏపీలో ఉష్ణోగ్రతలు సాధారణంకంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా ఉంటాయి.
రెండు నెలలు వర్షాలు తక్కువేనా..?
ఏపీ, తెలంగాణలో రుతుపవనాలు బలహీనంగా మారాయి. పసిఫిక్ సముద్రంలో వేగాన్ని పుంజుకుంటున్న ఎల్-నినో ప్రభావం మన దేశంలో ఉన్న వర్షాలు తగ్గేందుకు కారణమవుతుంది. పసిఫిక్‌లో సముద్రపు ఉపరితల ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా సౌత్ అమెరికా తీరం వైపుగా ఉంటే దాన్ని ఎల్-నినో అంటారు. మన దేశంలో అక్టోబర్‌లో బలమైన ఎల్‌నినో ప్రభావం కనిపిస్తుంది. అందువల్ల అప్పటిదాకా.. అంటే ఆగష్టు, సెప్టెంబర్‌లో వర్షాలు తక్కువగానే ఉంటాయి. వర్షాలు పడతాయి కానీ.. భారీ వర్షాలు కావు. ఈ వర్షాల వల్ల పెద్దగా వరదల ప్రభావం కూడా ఉండవు. సాధారణం నుంచి ఒక మోస్తరు వర్షాలు మాత్రమే పడుతాయి.