ISRO SCIENTISTS: చంద్రయాన్ సైంటిస్టులు, ఇంజనీర్లకు 17 నెలలుగా జీతాల్లేవా..?

చంద్రయాన్-3 మిషన్‌లో కీలకమైన లాంచ్‌ప్యాడ్‌ నిర్మించిన హెవీ ఇంజినీరింగ్‌ కార్పొరేషన్‌ (హెచ్‌ఈసీ) ఇంజినీర్లకు కొన్ని నెలలుగా వేతనాలు అందట్లేదన్న విషయం ఓ వార్తా సంస్థ కథనంతో తొలుత వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాతే దానిపై రాజకీయ పార్టీలు ఒక్కటొక్కటిగా మాట్లాడటం మొదలుపెట్టాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 25, 2023 | 01:06 PMLast Updated on: Aug 25, 2023 | 1:06 PM

No Salary To Isro Scientists Says Congress Leader Digvijaya Singh

ISRO SCIENTISTS: చందమామను ముద్దాడే అరుదైన అవకాశాన్ని భారతావనికి కల్పించిన వేలాది మంది ఇస్త్రో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు వేతన వెతలతో కష్టంగా జీవితాలను వెళ్లదీస్తున్నారు. చంద్రయాన్‌-3 ప్రాజెక్టు సక్సెస్ అయిన నేపథ్యంలో వారు మౌనంగా అనుభవిస్తున్న బాధలపై మరోసారి చర్చ మొదలైంది. చంద్రయాన్-3 మిషన్‌లో పనిచేసిన నిపుణులకు జీతాల చెల్లింపులో గత ఏడాదిన్నర కాలంగా ఎందుకు జాప్యం చేస్తున్నారని కేంద్ర సర్కారును కాంగ్రెస్ పార్టీ నిలదీసింది. అంతరిక్ష యాత్రల బడ్జెట్‌లో 32 శాతం కోత ఎందుకు పెట్టారని ప్రశ్నించింది.

చంద్రయాన్-3 మిషన్‌లో కీలకమైన లాంచ్‌ప్యాడ్‌ నిర్మించిన హెవీ ఇంజినీరింగ్‌ కార్పొరేషన్‌ (హెచ్‌ఈసీ) ఇంజినీర్లకు కొన్ని నెలలుగా వేతనాలు అందట్లేదన్న విషయం ఓ వార్తా సంస్థ కథనంతో తొలుత వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాతే దానిపై రాజకీయ పార్టీలు ఒక్కటొక్కటిగా మాట్లాడటం మొదలుపెట్టాయి. ఇస్రోకు సంబంధించిన 2,700 వర్క్‌మెన్‌, 450 మంది ఎగ్జిక్యూటివ్‌లకు గత 14 నెలలుగా జీతాలు అందలేదని, ఈ ఏడాది మేలో మరో మీడియా సంస్థ కూడా న్యూస్ రిపోర్ట్‌ను పబ్లిష్ చేసింది. అయినా కేంద్ర సర్కారు నుంచి హెచ్‌ఈసీకి ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది.
హెచ్‌ఈసీని నిర్వీర్యం చేసేలా..
హెవీ ఇంజినీరింగ్‌ కార్పొరేషన్‌ (హెచ్‌ఈసీ) అనేది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే పబ్లిక్ సెక్టార్ సంస్థ. ఇది జార్ఖండ్‌లోని రాంచీ కేంద్రంగా పనిచేస్తోంది. చంద్రయాన్-3 మిషన్ కోసం షెడ్యూల్‌ కంటే ముందే (2022 డిసెంబర్‌లోనే) మొబైల్‌ లాంచ్‌ ప్యాడ్‌, ఇతర పరికరాలను అందించినా.. హెచ్‌ఈసీకి ప్రభుత్వం నుంచి సకాలంలో వర్కింగ్‌ క్యాపిటల్‌ రిలీజ్ కాలేదని మీడియాలో పబ్లిష్ అయిన వార్తా కథనాలు చెబుతున్నాయి. దీనిపై కేంద్ర సర్కారును హెచ్‌ఈసీ అభ్యర్థించినా పట్టించుకోలేదని సమాచారం. ఈ నేపథ్యంలో హెచ్‌ఈసీ ఆర్థిక ఇబ్బందుల్లో నడుస్తున్నట్లు తెలుస్తోంది. తమ ద్వారా ఇస్రో లాంచ్ ప్యాడ్ నిర్మాణం కోసం పనిచేసిన ఇంజనీర్లకు జీతాలు ఇవ్వలేక సంస్థ ఆగమాగం అవుతోంది. రక్షణ శాఖ, రైల్వే, కోల్‌ ఇండియా, స్టీల్‌ రంగ కంపెనీల నుంచి హెచ్‌ఈసీకి రూ.1,500 కోట్ల విలువైన ఆర్డర్లు ఉన్నప్పటికీ, నిధుల కొరత కారణంగా ఆ పనులను చేయలేని స్థితికి చేరిందని న్యూస్ స్టోరీస్‌లో పేర్కొన్నారు. గత రెండున్నర ఏండ్లుగా హెచ్‌ఈసీకి శాశ్వత ప్రాతిపదికన చీఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ) నియామకంపైనా కేంద్ర సర్కారు ఫోకస్ పెట్టకపోవడం గమనార్హం.
‘ఇండియా విత్ ఇస్రో సైంటిస్ట్స్’
ఇస్రో సైంటిస్టుల జీతంపై ఇటీవల ఇస్రో మాజీ ఛైర్మన్‌ జి.మాధవన్ నాయర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇస్రో శాస్త్రవేత్తల జీతం అభివృద్ధి చెందిన దేశాల శాస్త్రవేత్తల ప్యాకేజీ కంటే ఐదు రెట్లు తక్కువని తెలిపారు. తక్కువ డబ్బుతో ప్రతి మిషన్‌ను నిర్వహించాలని ఇస్రో ప్లాన్ చేస్తుందని, అందుకే శాస్త్రవేత్తలు తక్కువ జీతాలతో సరిపెట్టుకోవాల్సి వస్తోందని చెప్పారు. ‘ఇస్రోలో మీకు కోటీశ్వరులు దొరకరు. అందరూ సాదాసీదాగా జీవిస్తుంటారు. అక్కడ ఎవరూ డబ్బు గురించి ఆందోళన చెందరు. ప్రతి ఒక్కరూ దేశానికి తమవంతు సహకారం అందించాలన్న తపనతో ఉంటారు’ అని ఇస్రో మాజీ ఛైర్మన్ వివరించారు. ఈ వ్యాఖ్యలను బట్టి ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు వేతనాలు పెంచాల్సిన ఆవశ్యకతను మనం అర్థంచేసుకోవచ్చు. అంతకంటే ముందే.. పెండింగ్‌లో ఉన్న వేతనాలను కేంద్ర సర్కారు రిలీజ్ చేయాలి. దీనిపై ప్రజలు కూడా ‘ఇండియా విత్ ఇస్రో సైంటిస్ట్స్’ (INDIA WITH ISRO SCIENTISTS) ట్యాగ్‌తో సోషల్ మీడియా వేదికగా గళం వినిపించాలి.