Nobel Prize: రూ.11 లక్షల నుంచి రూ.8 కోట్ల దాకా.. నోబెల్ ప్రైజ్ మనీ ప్రస్థానం..
నోబెల్ పురస్కారం అందుకునే వారికి ఇప్పటివరకు రూ.7.41 కోట్లు చొప్పున ప్రైజ్ మనీ ఇస్తుండగా.. ఇకపై రూ.8.16 కోట్లు చొప్పున ప్రైజ్ మనీ ఇస్తామని అనౌన్స్ చేసింది. ప్రస్తుతం ఫౌండేషన్ ఆర్థిక స్థితి బలంగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
Nobel Prize: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైజ్.. నోబెల్!! వివిధ రంగాల్లో ప్రపంచ వికాసం కోసం విశేష కృషి చేసిన వారికి ఏటా నోబెల్ ప్రైజ్‌లను ప్రకటిస్తుంటారు. ఈ ఏడాదికి సంబంధించిన నోబెల్ అవార్డులను వచ్చే నెలలో ప్రదానం చేయనున్నారు. ఈ తరుణంలో నోబెల్ ఫౌండేషన్ కీలక ప్రకటన చేసింది. శాంతి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్, లిటరేచర్, ఎకనమిక్స్ రంగాల్లో నోబెల్ పురస్కారం అందుకునే వారికి ఇప్పటివరకు రూ.7.41 కోట్లు చొప్పున ప్రైజ్ మనీ ఇస్తుండగా.. ఇకపై రూ.8.16 కోట్లు చొప్పున ప్రైజ్ మనీ ఇస్తామని అనౌన్స్ చేసింది. ప్రస్తుతం ఫౌండేషన్ ఆర్థిక స్థితి బలంగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. డాలర్, యూరోలతో పోలిస్తే స్వీడన్ క్రోనార్ కరెన్సీ విలువ పడిపోవడం కూడా ప్రైజ్ మనీని పెంచడానికి ప్రధాన కారణమని నోబెల్ ఫౌండేషన్ పేర్కొంది.
1901లో నోబెల్ బహుమతులను ప్రదానం చేయడం మొదలుపెట్టిన టైంలో ఒక్కో కేటగిరీకి ప్రైజ్ మనీ రూ.11 లక్షలు మాత్రమే ఉండేది. అప్పటి నుంచి నోబెల్ ఫౌండేషన్ క్రమంగా ఈ మొత్తాన్ని పెంచుకుంటూ వస్తోంది. 2012లో నోబెల్ ప్రైజ్ మనీని రూ.7.41 కోట్ల నుంచి రూ.5.93 కోట్లకు తగ్గించింది. 2017లో నోబెల్ ప్రైజ్ మనీని రూ.6.67 కోట్ల నుంచి రూ.7.41 కోట్లకు పెంచారు. ఇదే ప్రైజ్ మనీ 2017 నుంచి ఇస్తూ వస్తున్నారు. దాదాపు ఆరేళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి నోబెల్ ప్రైజ్ మనీని రూ.7.41 కోట్ల నుంచి రూ.8.16 కోట్లకు పెంచారు. అంటే.. దాదాపు అరకోటికిపైనే ప్రైజ్ మనీ పెరిగింది.
డైనమైట్‌ను ఆవిష్కరించిన విఖ్యాత స్వీడన్ శాస్త్రవేత్త ఆల్‌ఫ్రెడ్ నోబెల్ 1895లో నోబెల్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. దాదాపు రూ.25 కోట్ల తన సంపాదనను నోబెల్ ఫౌండేషన్‌కు అందించాడు. ఆ మొత్తంపై వచ్చే ఆదాయంతో ప్రపంచం మొత్తంలో అత్యున్నత స్థాయిలో పరిశోధనలు చేసే వారికి ఏటా అవార్డులు ఇవ్వాలని కోరాడు. ఈ మేరకు ఆల్ఫ్రెడ్ నోబెల్ ఆస్తి వీలునామా రాశారు. 2022 చివరి నాటికి నోబెల్ ఫౌండేషన్ పెట్టుబడుల విలువ రూ.4,600 కోట్లకు పెరిగింది. నోబెల్ బహుమతులను ఏటా ఆల్ ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి రోజు.. అంటే డిసెంబర్ 10న ప్రదానం చేస్తారు. నోబెల్ బహుమతి గ్రహీతకు ఒక సర్టిఫికేట్, బంగారుపతకం, నగదు, నిర్ధారణ పత్రాలు ఇస్తారు. 1901లో ప్రారంభమైన ఈ బహుమతిని భౌతిక, రసాయన శాస్త్రాలు, సాహిత్యం, శాంతి, వైద్యరంగంలో ఇస్తున్నారు. 1969 నుంచి ఆర్థిక రంగంలో కూడా అవార్డును ఇస్తున్నారు.