On Her Way: ఒక సృజనాత్మక ఆలోచన వెనుక ఇద్దరమ్మాయిలు..!
అమ్మాయి అనగానే కొందరిలో అనిపించే భావన అందంగా ఉందా..? మరికొందరిలో అయితే అణుకువ కలిగి ఉందా..? అని అంటూ ఉంటారు. అలాంటి అమ్మాయి ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళాలంటే చాలా జాగ్రత్తలు సూచనలు తీసుకోవాల్సి వస్తుంది. అన్ని సక్రమంగా తీసుకున్నప్పటికీ వెళ్లే ప్రయాణంలో ఏవో ఒక అసౌకర్యం సమాజం కలిగిస్తుంది. ఆసమాజంలో పురుషులు, స్త్రీలు ఎవరైనా ఉండవచ్చు. తనకు కావల్సిన స్వేచ్ఛను ఎప్పుడూ ఆమెకు అందించదు. అలాంటి పరిస్థితుల నుంచి వచ్చిందే ఈ ఆన్ హర్ వే అనే స్టార్టప్ సంస్థ. ఏమిటి ఆ సంస్థ ప్రత్యేకత అని మీలో సందేశం కలుగవచ్చు. మహిళలు తమకు ఇష్టం వచ్చినట్లు ఎక్కడికైనా తిరిగేలా ప్రణాళికలు రచించి పూర్తి బాధ్యత తీసుకుంటారు. వారికి నచ్చిన విధంగా విహారయాత్రలో అనుభూతిని కలిగిస్తారు. ఇది ఎలా సాధ్యమో ఇందులో చెప్పిన విషయాలు చదివితే ఒక అవగాహన వస్తుంది.
ప్రస్తుతం మహిళలు.. పురుషులతో పోటీ పడి అన్ని రంగాల్లో విజయావకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పురుషులను వెనక్కి నెట్టి అగ్రపథంలో పయనిస్తున్నారని చెప్పాలి. దీనికి పురుషాధిక్యత సమాజంలో కొంతమంది ఒకప్పుకోరనుకోండి. కానీ ఇదే నిజం. ఒకప్పటి గురజాడ కన్యాశుల్కం నాటి పరిస్థితులు ఇప్పుడు అంతగా కనిపించడం లేదు. ఎక్కడో ఒకటో రెండో అజ్ఞాన సమాజంలో ఉండి ఉండవచ్చు. వివేకవంతమైన సమాజంలో ఐతే కనిపించదు. అమ్మాయిని డబ్బులిచ్చి కొనుక్కునే స్థాయి నుంచి.. అబ్బాయిలే ఎదురు కట్నం ఇచ్చి అమ్మాయిలను ఎన్నుకునే తరం రాబోతుంది. అంతేకాకుండా నిజమైన ప్రేమ వివాహాల్లో అయితే అమ్మాయిని ఇవ్వండి చాలు ఇంకేమీ వద్దు అనే విధంగా పరిస్థితుల్లో మార్పు వస్తుంది. దీనిని బట్టి భవిష్యత్తు మొత్తం వీరిదే అని ఖచ్చితంగా చెప్పాలి. ఇలా చెప్పలేక పోతే ప్రస్తుత పరిస్థితులను, సమాజాన్ని అతను అర్థం చేసుకునే మార్గంలో లేడని అర్థం.
విహారంలో నైరాశ్యం:
ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. స్త్రీలు తమకు కావల్సిన విధంగా ప్రపంచంలో విహరిద్దాం అనుకుంటున్నారు. అంటే పురుషులు ఎలా సరదాగా గడుపుతారో అలా. సాధారణంగా అబ్బాయిలు ఎంజాయ్ చేసినంతగా అమ్మాయిలు బయటకు వెళ్లి ఎంజాయ్ చేయలేరు. కొన్ని హద్దులు అడ్డుకుంటాయ్. అలాంటి వారికోసం స్త్రీహృదయ తీరం వెంబడి హద్దులన్నింటినీ చెరిపేసేందుకు ఒక అలలాగా ఆన్ హర్ వే అనే సంస్థ నెలకొల్పబడింది. దీనిని ఏర్పాటు చేసింది కూడా మహిలళే. అయితే వీరు ఒక్కరు కాదు ఇద్దరు. ఒంటరిగా మహిళ ఏదైనా టూర్ వెళ్లాలంటే ఎన్నో ఆటంకాలు ఎదుర్కోవల్సి వస్తుంది. ఎందుకంటే.. అక్కడి పరిస్థితులు తెలియకనో, వాతావరణం అనుకూలించకనో, సరైన గైడ్ లేకనో.. ఇంకా రకరకాల కారణాల దృష్ట్యా కొన్ని సమస్యలు తలెత్తి విహారయాత్రలో తీవ్ర నిరాశకులోనౌతూ ఉంటారు. ఇలా లోనైన వారిలో ఈ సంస్థ స్థాపకులు కూడా ఒకరు.
అనుభవమే ఆలోచనై ఆచరణ దిశగా..
ఒంటరియాత్రల పేరుతో వీరు భారతదేశమంతా చుట్టి వచ్చినప్పుడు ఇలాంటి అనుభవాలు వీరికి కూడా ఎదురయ్యాయి. ఇలా అనుభవమే ఆలోచనకు ఆజ్యంపోసింది. వెంటనే సంస్థను ప్రారంభించారు. ప్రయాణం వల్ల మనస్సు ప్రశాంతంగా మారుతుంది. మెదడులో సరికొత్త ఆలోచనలు చిగురిస్తాయి. అలా వచ్చిన ఆలోచనల ఫలితంగా జీవితాల్లో అద్భుతమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. మన నిర్ణయాలే మన జీవితం అనే బ్లఫ్ మాస్టర్ సినిమా డైలాగ్ గుర్తుందా..? అది నిజమే. ఇలా ప్రశాంతత నుంచి తీసుకున్న నిర్ణయాల ద్వారా ఆత్మవిశ్వాసం పెరిగి పనిలో వేగం పుంజుకుంటుంది. తద్వారా అతి సులభంగా విజయాన్ని సాధించినట్లు అనిపిస్తుంది. అందుకే ప్రయాణం సుఖమయం, క్షేమదాయకం అవ్వాలంటే రైల్వే అనౌన్స్ మెంట్ వినకుండా.. వీరికి సంప్రదిస్తే సరిపోతుంది.
పనిలో – ప్రయాణంలో కలిసి:
ఇక ఈ స్టార్టప్ సంస్థను ఏర్పాటు చేసిన వారి వివరాలకు వస్తే.. ఆమె పేరు ప్రియాన్ష మిశ్రా. ఈమెకు ఒక ప్రయాణ భాగస్వామి కూడా ఉంది. ఆమె పేరు స్రిష్టి మేదోంకర్. వీరిద్దరూ మణిపాల్ ఇన్సిట్యూట్ లో కలిసి చదువుకున్నారు. చదువు అయిపోయిన వెంటనే మైక్రోసాఫ్ట్ లో కలిసి పనిచేశారు. పనితో పాటూ అప్పుడప్పుడూ కలిసి ప్రయాణం కూడా చేసేవారు. అలా ప్రయాణం చేసే క్రమంలో కొన్ని గడ్డుపరిస్థితులు తలెత్తాయి. వాటిని అధిగమిస్తూ జర్నీని సాఫీగా సాగించేవారు. అలాంటి సమయంలో వారి మెదడులో మెదిలింది చిన్న సందేహం. ఒంటరి మహిళ ఇలా ప్రయాణం సాగించాలంటే ఎలా.? అందుకే దీనిని ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది.
చిన్న ఆలోచన పెద్ద ఉపాధి:
ఒంటరిగా ప్రయాణం చేయాలనుకునే వారి వివరాలను https://www.onherwaycation.com/లోకి వెళ్లి నమోదు చేస్తే చాలు. మీతో సంప్రదింపులు జరిపి మీరు ఎక్కడికైతే వెళ్లాలనుకుంటున్నారో అక్కడికి సురక్షితంగా, ఆనందంగా తీసుకెళ్లి అక్కడి ప్రదేశాలన్నీ చూపిస్తారు. మీరు ఎంచుకున్న ప్రదేశానికి సంబంధించి అక్కడి స్థానికులనే మీకు గైడ్ లాగా ఏర్పాటు చేస్తారు. అలాగే మీకు కావల్సిన వసతి, భోజన సదుపాయాలు కూడా వీరే చూసుకుంటారు. వీటన్నింటికీ కలిపి మనం కొంత డబ్బులు వెచ్చించవలసి ఉంటుంది. ఇలా చేయడం వల్ల చాలామంది స్థానికులకు ఉపాధి లభించింది. ఈ సంస్థ ద్వారా ఇప్పటి వరకూ చాలా మంది అమ్మాయిలు ఒంటరి ప్రయాణం చేస్తున్నారు. అంతేకాకుండా వారి అనుభూతులు, అనుభవాలు పంచుకుంటున్నారు. ఇప్పటి వరకూ ఐదువేల మందికి పైగా ప్రయాణం చేశారంటే మీరే ఆలోచించుకోండి. ఒక్క ఆలోచన ఎందరికి అవకాశాన్ని అందించిందో.
T.V.SRIKAR