Rich India: భారత్ హై బిలినియర్.. మిడిల్ క్లాస్ బనేగా మిలినియర్.. అదిరిపోయే కొత్త సర్వే సారాంశం..
కౌన్ బనేగా కరోడ్ పతి అనగానే మనకు ఒక రియాలిటీ షో గుర్తుకు వస్తుంది. మన తెలుగులో అయితే మీలో ఎవరు కోటీశ్వరుడు పేరుతో గతంలో ఒక ప్రోగ్రాం నడిచేది. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెబుతున్నామంటే భారత్ బనేగా కరోడ్ పతి వైపుగా మన దేశం అడుగులు వేస్తుంది. ఇది తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో తేటతెల్లమైంది. ఆ సర్వే మిడిల్ క్లాస్ పీపుల్ గురించి కూడా సంచలన విషయాలను బయటపెట్టింది. ఇంతకూ అవేంటో ఇప్పుడు గమనిద్దాం.
మన భారత్ దాదాపు 142 కోట్లకు పైగా జనాభా కలిగి ఉంది. ప్రపంచంలోనే రెండవ అత్యధిక జనాభా కలిగిన దేశంగా రికార్డుకు ఎక్కింది. ఇంతటి జనాభాలో మనం పేదరికంలో ఉన్నామని ఇంకా భ్రమపడితే మీకు సమాజం పట్ల సరైన అవగాహనలేదని చెప్పాలి. ఇలాంటి వాటిపై ఒక క్లారిటీ ఇచ్చేందుకు ప్రైస్ (PRICE) అనే సంస్థ ఒక సర్వే చేపట్టింది. పీపుల్స్ రీసెర్చ్ ఆన్ ఇండియాస్ కన్జ్యూమర్ ఎకానమీ అండ్ ఇండియా సిటిజన్ ఎన్విరాన్మెంట్ నిర్వహించిన సర్వేలో రానున్న రోజుల్లో సంపన్నులు మరింత ఎక్కువ అవనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఉన్న ధనవంతుల సంఖ్య రానున్న పదేళ్లలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు రెట్లు పెరగనున్నట్లు వెల్లడించింది.
ధనవంతుల నివేదిక ఇలా..
ప్రస్తుతం ఉన్న గ్రామీణ ప్రాంత పరిస్థితులు చాలా వరకూ మెరుగుపడ్డాయని అందులో భాగంగానే వారి జనాభాతో పాటూ ఆర్థిక స్థితిగతుల్లో కూడా పెరుగుదల కనిపిస్తుందని వివరించింది. ఈ సర్వే మన దేశంలో దాదాపు 25 రాష్ట్రాల్లో చేసినట్లు తెలుస్తుంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన.. భిన్నమైన డేటాను సేకరించారట. గత దశాబ్ధ కాలంలోని ధనవంతులను ప్రస్తుతం ఉన్న సంపన్నులను లెక్కగట్టి భవిష్యత్తులో ఈ సంఖ్య ఎంతకు చేరుకుంటుందో అంచనా వేసింది. 2021లో సంవత్సరానికి రూ. 2 కోట్ల కంటే సంపాదించేవారి సంఖ్య 18 లక్షలుగా ఉంటే వచ్చే దశాబ్దం నాటికి దీని సంఖ్య ఐదు రెట్లకు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపింది. అంటే 2031 నాటికి 90 లక్షలకు పైగా సంపన్నులు మన భారత్లో ఉంటారని ఈ నివేదిక సారాంశం. ఇది పట్టణ ప్రాంతంలో నివసించే ధనికులకు సంబంధించిన గణాంకాలు మాత్రమే. ఇక గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ధనికులు పట్టణాలకుంటే ఎక్కువగా ఉన్నారని ఆసక్తికరమైన సమాచారాన్ని వెలువరించింది. ఎందుకంటే చిన్న చిన్న పల్లెల్లో, గ్రామాల్లోని ప్రజలు వ్యవసాయం చేస్తూ వాటి ద్వారా వచ్చే సంపదతో చిన్న పరిశ్రమలు, వ్యాపారాలు చేసి ఆదాయాన్ని రెట్టింపు చేసుకుంటున్నట్లు వివరించింది. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో సుసంపన్నుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని సర్వేలో పేర్కొంది. గత ఐదు సంవత్సరాలలో గ్రామీణ స్థాయిలో ధనవంతుల సంఖ్య 14.2 శాతంగా ఉంటే పట్టణాల్లో మాత్రం 10.6 శాతంగా ఉంది. దీనిని బట్టి గ్రామాల్లోనే ధనవంతుల సంఖ్య అధికంగా ఉందని చెప్పవచ్చు.
మధ్యతరగతి గణాంకాలు..
ఇక మధ్యతరగతి వివరాల్లోకి వెళితే 5 నుంచి 30 లక్షలు వరకూ సంపాదించే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుందని తెలిపింది. ప్రస్తుతం భారత్ లో ఇంతటి ఆదాయాన్ని గణిస్తున్న వారు 43.2 కోట్లుగా ఉన్నారని నివేదికలో పేర్కొంది. రానున్న 2031 నాటికి వీరి సంఖ్య 71.5 కోట్లకు చేరువయ్యే అవకాశం ఉన్నట్లు లెక్కగట్టింది. అంటే దాదాపు 27 కోట్ల మంది దిగువ మధ్యతరగతితోపాటూ పేదరికం నుంచి బయటపడుతున్నట్లు అంచనా వేసింది. పేదరికం గురించి కూడా సంచలన విషయాలను బయటపెట్టింది. సంవత్సర ఆదాయం రూ. 1.25 కంటే తక్కువగా సంపాదించేవారిని పేదవారిగా పరిగణించింది. వీరి సంఖ్య కూడా 2023 నాటికి సగం కంటే ఎక్కువగా తగ్గే అవకాశం ఉన్నట్లు వివరించింది. అంటే ప్రస్తుతం ఉన్న 16 కోట్ల మంది పేదలు కాస్తా 7.9 కోట్లకు తగ్గిపోతారని భావిస్తోంది.
ప్రైస్ వారు పేర్కొన్న నివేదిక కంటే ముందు ఆక్స్ ఫామ్ అనే అంతర్జాతీయ సంస్థ తమ నివేదికలో కూడా దాదాపు ఇదే అంశాన్ని వెలువరించింది. ఇండియాలో మిలినియర్ల సంఖ్య పెరుగుతోందని గతంలోనే భావించింది. 2018 – 22 మధ్య నిర్వహించిన సర్వేలో రోజుకు 70 మంది కొత్త మిలినియర్స్ పుట్టుకొస్తున్నట్లు స్పష్టం చేసింది. దీనిని బట్టి అర్థమైంది ఏమిటంటే మన దేశం ఆర్థికంగా అగ్రదేశాలతో పోటీపడి అభివృద్ది సాధించకపోయినా బిలినియర్స్, మిలినియర్స్ ని సృష్టించడంలో ముందువరుసలో ఉందిన చెప్పక తప్పదు.
T.V.SRIKAR