Diabetes Solution : డయాబెటీస్ కి శాశ్వత పరిష్కారం.. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల పరిశోధన

డయాబెటీస్ కి శాశ్వతంగా పరిష్కారం లభించబోతోంది. ఈ మాట చూడగానే.. ఇదేదో మోసం చేసే ప్రకటన అని చాలా మంది అనుకుంటారు. అసలు మధుమేహానికి మందులే గానీ.. పర్మినెంట్ గా ఎలా తగ్గుతుంది అని ప్రశ్నిస్తారు. కానీ ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు ఈ అద్భుతాన్ని కనుగొన్నారు. ఇన్సులిన్ ఉత్పత్తి కాకుండా పోయిన క్లోమం నుంచి మళ్ళీ ప్రొడ్యూస్ అయ్యేలా పరిశోధనలు చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 6, 2024 | 01:15 PMLast Updated on: Jan 06, 2024 | 1:15 PM

Permanent Solution To Diabetes Research By Australian Scientists

డయాబెటీస్ కి శాశ్వతంగా పరిష్కారం లభించబోతోంది. ఈ మాట చూడగానే.. ఇదేదో మోసం చేసే ప్రకటన అని చాలా మంది అనుకుంటారు. అసలు మధుమేహానికి మందులే గానీ.. పర్మినెంట్ గా ఎలా తగ్గుతుంది అని ప్రశ్నిస్తారు. కానీ ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు ఈ అద్భుతాన్ని కనుగొన్నారు. ఇన్సులిన్ ఉత్పత్తి కాకుండా పోయిన క్లోమం నుంచి మళ్ళీ ప్రొడ్యూస్ అయ్యేలా పరిశోధనలు చేశారు. కొన్ని క్లినికల్ ట్రయిల్స్ తర్వాత ఈ ప్రయోగం ప్రపంచం మొత్తానికి విస్తరించనుంది. సక్సెస్ అయితే డయాబెటీస్ ని శాశ్వతంగా మనిషి బాడీ నుంచి తీసేయొచ్చు.

మధుమేహ బాధితులు తమ శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోడానికి యేళ్ళ తరబడిగా ఇన్సులిన్‌ ఇంజెక్షన్లు, మాత్రలు వాడుతూ విసిగిపోతున్నారు. అలాంటి వారికి ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు గుడ్ న్యూస్ చెప్పారు. క్యాన్సర్‌కు చికిత్స చేస్తుండగా జరిపిన ప్రయోగాల్లో.. అనుకోకుండా క్లోమాన్ని పునరుద్ధరించే ప్రక్రియను కనుగొన్నారు. శరీరంలో గ్లూకోజ్‌ ను నియంత్రించాలంటే.. ఇన్సులిన్‌ చాలా అవసరం. దీన్ని ఉత్పత్తి చేసే క్లోమ గ్రంథి పుట్టకతోనే దెబ్బతిని ఉంటే.. టైప్‌-1 డయాబెటిస్ వస్తుంది. దాంతో వాళ్ళు జీవితాంతం ఇన్సులిన్‌ ఇంజెక్షన్లు వాడతారు. టైప్‌-2 డయాబెటిక్ బాధితులకు వివిధ కారణాలతో క్లోమం ఇన్సులిన్‌ ఉత్పత్తి చేసే శక్తిని కోల్పోతుంది. వాళ్ళకి ఉన్న చక్కెర స్థాయిలను బట్టి.. ఇన్సులిన్‌ ఇంజెక్షన్‌ లేదంటే మాత్రలను డాక్టర్లు సూచిస్తారు.

ఇలా ఎన్నాళ్లు అంటే.. మధుమేహానికి ఇప్పటి వరకూ శాశ్వత పరిష్కారం లేదు. మనిషి బతికి ఉన్నంత కాలం ఇలా ఇంజెక్షన్లో.. మాత్రలో వాడాల్సిందే. ఆస్ట్రేలియాకు చెందిన బేకర్‌ హార్ట్‌ అండ్‌ డయాబెటిక్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు.. క్లోమ గ్రంథి స్రావాల ప్రవాహ నాడుల్లో ఏర్పడిన క్యాన్సర్‌ కణతులను నయం చేసేందుకు ప్రకృతి పరమైన విధానాలపై పరిశోధనలు చేస్తున్నారు. అందులో భాగంగా EZH2 అనే ఎంజైమ్‌ను ఆ కణతులపై ప్రయోగించారు. ఈ ఎంజైమ్‌ సహజ సిద్ధంగానే ఏర్పడుతుంది. క్యాన్సర్‌ కణతులపై దాడిచేసిన ఈ ఎంజైమ్‌.. డక్టల్‌ ప్రోజెనిటర్‌ కణాలను ఉత్తేజితం చేసింది.
గ్లూకోజ్‌ వల్ల తీవ్రంగా దెబ్బ తిన్న క్లోమంలోని ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే బీటా సెల్స్‌ను ఈ డక్టల్ కణాలు తిరిగి సృష్టించాయి. ఇక ఎప్పటికీ ఇన్సులిన్‌ ఉత్పత్తి కాదు అనుకున్న క్లోమ గ్రంథి.. వెంటనే ఇన్సులిన్‌ను ప్రొడ్యూస్ చేయడం మొదలు పెట్టినట్టు శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ పరిశోధనలు ప్రస్తుతం బేసిక్ లెవల్లో ఉన్నాయనీ.. క్లినికల్‌ ట్రయల్స్‌లో ఇది విజయవంతమైతే మధుమేహ వ్యాధిగ్రస్తులకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని అంటున్నారు. అదే జరిగితే వైద్య ప్రపంచంలో ఇదో మహా అద్భుతం అవుతుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.