Pakistan: పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ రూ.300.. పెరిగిన ధరలతో అల్లాడుతున్న జనం..!
పెట్రోల్, డీజిల్ రేట్లతో.. మిగతా వస్తువుల ధరలకు కూడా రెక్కలు వస్తున్నాయి. దీంతో పరిస్థితి మరింత భయంకరం అనిపిస్తోంది. పెరిగిన ధరలు మోయలేక.. జనాలు అల్లాడిపోతున్నారు. ఇప్పుడు వారిపై మరో పిడుగు పడింది.

Pakistan: జాలి కూడా జాలి పడే పరిస్థితుల్లో ఉంది పాకిస్తాన్. ఆర్థిక సంక్షోభం కారణంగా.. అక్కడ జనాలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కొండెక్కిన ధరలు.. ఆకలితో కాలుతున్న కడుపులు.. ఆగని కన్నీళ్లు.. పాకిస్తాన్‌లో చాలామంది జనాల పరిస్థితి ఇదే. ఆకాశాన్ని అంటుతున్న ధరలతో.. పాక్ జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చమురు ధరలైతే పీక్స్‌కు చేరాయి. పెట్రోల్, డీజిల్ రేట్లతో.. మిగతా వస్తువుల ధరలకు కూడా రెక్కలు వస్తున్నాయి.
దీంతో పరిస్థితి మరింత భయంకరం అనిపిస్తోంది. పెరిగిన ధరలు మోయలేక.. జనాలు అల్లాడిపోతున్నారు. ఇప్పుడు వారిపై మరో పిడుగు పడింది. లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు 3 వందల పాక్ రూపాయల మార్క్ దాటేశాయి. పాక్ చరిత్రలో చమురు ధరలు ఈ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి. పాకిస్థాన్ ఆర్థికమంత్రిత్వ శాఖ చమురు ధరల పెంపుపై ప్రకటన చేసింది. లేటెస్ట్‌గా 14 రూపాయల 91 పైసలు పెరగడంతో.. లీటర్ పెట్రోల్ ధర 305 రూపాయల 36 పైసలకు చేరింది. హైస్పీడ్ డీజిల్ ధర 311 పాక్ రూపాయలకు పెరిగింది. హెచ్‌ఎస్‌డీ ధరను 18 రూపాయల 44 పైసలు పెంచడంతో ఈ మార్పు చోటుచేసుకుంది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే పాకిస్థాన్ రూపాయి మారకం విలువ 305 రూపాయలుగా ఉంది. కరెన్సీ విలువ భారీగా పతనం అవుతుండటంతో సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేట్లను పెంచాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇక అటు కరెంట్ బిల్లులు భారీగా పెరిగాయి. పెరుగుతున్న విద్యుత్ బిల్లుల భారం మోయలేక జనాలు దేశవ్యాప్తంగా నిరసనకు దిగారు. తమ బిల్లుల్ని కాల్చివేశారు. పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అధికారులతో ఘర్షణకు దిగారు. ఈ సమస్య పరిష్కారానికి తాము ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా.. ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ ద్రవ్యనిధి ఇచ్చే రుణాలపైనే పాకిస్తాన్ ఆధారపడుతోంది.