Dangerous Pigeon: కాటేస్తున్న కబూతర్.. పావురాలతో విష వైరస్ వ్యాప్తి!
పావురాల రెట్ట నుంచి రెక్కల వరకు శరీరం మొత్తం రకరకాల వైరస్‌లకు ఆవాసంగా ఉంటుందని చెబుతున్నారు. వీటి నుంచి పదుల సంఖ్యలో వైరస్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పావురాల రెట్టల్లో ‘హిస్టాప్లాస్మా’ అనే ఫంగస్ ఉంటుందని.. దీని వల్ల ‘హిస్టాప్లాస్మోసిస్’ అనే ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ వస్తుందని చెబుతున్నారు.
Dangerous Pigeon: పావురాలను చూసి చాలా మంది ముచ్చటపడుతుంటారు. కానీ, వాటి నుంచి మనుషులకు అనేక ఇన్‌ఫెక్షన్లు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పావురాల రెట్ట నుంచి రెక్కల వరకు శరీరం మొత్తం రకరకాల వైరస్‌లకు ఆవాసంగా ఉంటుందని చెబుతున్నారు. వీటి నుంచి పదుల సంఖ్యలో వైరస్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పావురాల రెట్టల్లో ‘హిస్టాప్లాస్మా’ అనే ఫంగస్ ఉంటుందని.. దీని వల్ల ‘హిస్టాప్లాస్మోసిస్’ అనే ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ వస్తుందని చెబుతున్నారు.
గబ్బిలాల రెట్టల్లోనూ ఈ ఫంగస్ ఉంటుందని చెప్తున్నారు. పావురాల వల్ల ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. ప్రధానంగా వృద్ధులు, గర్భిణులు, చిన్నపిల్లలకు వెంటనే సోకే ప్రమాదం ఉందని వివరిస్తున్నారు. పావురాల కారణంగా చాలా మంది వారికి తెలియకుండానే దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధుల బారినపడుతున్నారు. సాధారణంగా ఏసీ మెకానిక్‌లు ఎక్కువగా ఊపిరితిత్తులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బారిన పడుతుంటారు. దీనికి కూడా కారణం పావురాలేనని నిపుణులు చెబుతున్నారు. అపార్ట్‌మెంట్ భవనాల్లో పావురాలు ఎక్కువగా ఏసీ యంత్రాలను ఆవాసంగా చేసుకొని ఉంటాయి. అక్కడ ఉండే పావురాల వ్యర్థాల నుంచి ఇన్‌ఫెక్షన్లు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వివరిస్తున్నారు.
పావురాల సంఖ్యను తగ్గించేందుకు గతంలో చాలా సార్లు పావురాలను పట్టుకుని అడవుల్లో వదిలేశారు జీహెచ్‌ఎంసీ అధికారులు. వాటి పెరుగుదలను తగ్గించే బాధ్యత ప్రజలపై కూడా ఉంటుందని చెప్తున్నారు. పావురాలకు ఫీడింగ్ ఇవ్వవద్దని గతంలోనే ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా మార్కెట్లు, ఆహార పదార్థాలు అమ్మే షాపుల వద్ద పావురాలను అస్సలు ప్రోత్సహించరాదని సూచించారు. జీహెచ్‌ఎంసీకి చెందిన అన్ని పార్కుల్లో పావురాలకు ఫీడింగ్ నిషేధించారు. కానీ ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు పావురాలకు ఫీడింగ్ చేస్తున్నారు. గింజలు కొని మరీ వాటికి వేస్తున్నారు. ముందు ఇలాంటివి తగ్గించాలంటున్నారు అధికారులు.