Medigadda Barrage: కుంగిన మేడిగడ్డ బ్యారేజ్‌ వంతెన.. ఇది వాళ్ల పనే అంటున్న ఇంజినీర్లు..

భారీ శబ్దంతో బి-బ్లాకులోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య ఉన్న వంతెన ఒక అడుగు మేర కుంగిపోయింది. దీంతో, అప్రమత్తమైన అధికారులు వంతెన పైనుంచి రాకపోకలను నిలిపివేశారు. ఈ క్రమంలో తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 22, 2023 | 02:13 PMLast Updated on: Oct 22, 2023 | 2:13 PM

Pillars Of Lakshmi Barrage Sink At Jayashankar Bhupalpally

Medigadda Barrage: తెలంగాణకే తలమాణికంగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నిర్మించింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం. ప్రపంచంలోనే అత్యంత పెద్ద లిఫ్ట్‌ ఇరిజేషన్‌ ప్రాజెక్ట్‌ను తెలంగాణలో ఏర్పాటు చేసింది. ఈ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ వంతెన ఒక్కసారిగా కొంతమేరకు కుంగింది. భారీ శబ్దంతో బి-బ్లాకులోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య ఉన్న వంతెన ఒక అడుగు మేర కుంగిపోయింది. దీంతో, అప్రమత్తమైన అధికారులు వంతెన పైనుంచి రాకపోకలను నిలిపివేశారు. ఈ క్రమంలో తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

అయితే ఇందులో అసాంఘికశక్తుల ప్రమేయం ఉన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే కొందరు బ్రిడ్జ్‌కు నష్టం కలిగేలా చేశారని అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని చెప్తున్నారు. గతేడాది ఈ బ్యారేజ్‌ నుంచి దాదాపు 29 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహించిది. అప్పుడు కూడా డ్యామేజ్‌ అవ్వని బ్రిడ్జ్‌ ఇప్పుడు ఒక్కసారిగా డ్యామేజ్‌ అవడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయయి. మేడిగడ్డ బ్యారేజీ 20వ పిల్లర్‌ కుంగడంతోనే పైన వంతెన కుంగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, బ్యారేజీ పొడవు 1.6 కిలో మీటర్లు ఉండగా సంఘటన జరిగిన ప్రదేశం మహారాష్ట్ర వైపు నుంచి 356 మీటర్ల సమీపంలో ఉంది. గోదావరి నదిపై జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలో 2019లో మేడిగడ్డ వద్ద ఈ బ్యారేజీ నిర్మించారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లో ఇది మొదటిది. శనివారం రాత్రి సమయానికి ఎగువ నుంచి జలాశయానికి 25 వేల క్యూసెక్కుల వరకు ప్రవాహం వస్తుండగా 8 గేట్లు తెరిచి దిగువకు వదులుతున్నారు.

ఈ క్రమంలో శబ్దం రావడంతో ప్రాజెక్టు కార్యనిర్వాహక ఇంజనీరు తిరుపతిరావు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. వారు పరిశీలన చేస్తున్న సమయంలోనూ మరికొన్ని శబ్దాలు రావడంతో వెంటనే ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. దీంతో, అప్రమత్తమైన నీటిపారుదల శాఖ ఇంజినీర్లు డ్యాం పరిసరాల్లో అలర్ట్‌ ప్రకటించారు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఈ బ్యారేజీ పైనుంచి రాకపోకలు నిలిపివేశారు.