Plastic roads in India: ప్లాస్టిక్ రోడ్ల నిర్మాణం-పర్యావరణానికి ప్రయోజనకరం..!

మనం పల్లెల్లో అయితే మట్టి రోడ్లను చూసి ఉంటాం. మండలాల్లో అయితే సిమెంటు రోడ్లపై నిత్యం నడుస్తూ ఉంటాం. అదే సిటీల్లో నల్లని థార్ రోడ్లను మాత్రమే ఎక్కువగా చూస్తాం. కానీ వీటన్నింటినీ తలదన్నేలా ప్లాస్టిక్ రోడ్లు అందుబాటులోకి వచ్చాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 14, 2023 | 05:38 PMLast Updated on: Feb 14, 2023 | 5:43 PM

Plastic Roads In India

సాధారణంగా మనం నిత్యం రోడ్లపై ప్రయాణం చేస్తూ ఉంటాం. ఆఫీసుకు వెళ్లాలన్నా, ఏదైనా ఊరికి వెళ్లాలన్నా, చివరకు పక్కనున్న కిరాణా కొట్టుకు వెళ్లాలన్నా రోడ్లపైన వెళ్లడం తప్పనిసరి. అదే త్వరగా వెళ్లాలంటే రెండు ప్రధానమైన అంశాలు దోహదపడతాయి. మొదట ట్రాఫిక్ కంట్రోల్ లో ఉండాలి. రెండవది రోడ్లు సాఫీగా ఉండాలి. ఈ రెండూ అనుకూలిస్తే మనం అనుకున్న గమ్యస్థానం చేరుకోవడం చాలా సులువు అవుతుంది. మనకు మొదటిది కొంత వరకూ అందుబాటులో ఉన్నప్పటికీ రెండవది అంతగా అందుబాటులో ఉండదు. వాటిని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రతి 6 నుంచి 12నెలలకు ఒకసారి రోడ్డు మరమ్మత్తులు చేపడుతూ ఉండాలి. అలా చేయాలంటే నిధులు అధికంగా వెచ్చించాలి. మనకున్న జనాభాలో రోడ్డుమీద ప్రయాణించే వాహనాలకు రోడ్లను ప్రతి మూడు నెలలకు ఒకసారైనా రోడ్లు వేయాల్సి ఉంటుంది. రోడ్డుకు రాయి, సున్నం, ఇసుక అవసరం అవుతుంది. ఇవి తక్కువ ధరకు అందుబాటులో ఉండవు. అధిక వ్యయం ఖర్చు అవుతుంది. ఈ వ్యయాన్ని తగ్గించుకోవాలి. అప్పుడే రోడ్లు వేయగలం. తక్కువ నిధుల్లో పనులు జరగాలి అనుకుంటే ప్లాస్టిక్ రోడ్లను అందుబాటులోకి తీసుకురావాలి. ఇలా చేయడం వల్ల ఈ ప్రజారవాణా సమస్యలను అధిగమించవచ్చు.

సృజన వారిది – అనుకరణ మనది:

ప్రపంచంలో 40 మిలియన్ కిలోమీటర్ల రోడ్డు అందుబాటులో ఉంది. వందలాది మిలియన్ల ఆయిల్ ని ఉపయోగించి రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. అందుకే ఈ రీసైకిల్ అవ్వని ప్లాస్టిక్ ను ఉపయోగించి రోడ్లు వేసే ఆలోచనను మొదటగా స్కాట్ లాండ్ (Scotland) లోని టోబి మెకార్ని (Tobi Mccartney) అనే ఇంజనీర్ కనుగొన్నాడు. ఇతనికి సంబంధించిన ఫాంహౌస్ లో ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. ఈ ఆలోచన అతని కూతురిని వాళ్ల స్కూల్ టీచర్ అడిగిన ప్రశ్న నుంచి వచ్చిందట. అతను ఒకప్పుడు ఇండియాకి వచ్చినప్పుడు ఇక్కడి స్థానికులు రోడ్లపై పున‌:ర్వినియోగం అవ్వని ప్లాస్టిక్ ను పడేయడం చూశాడట. అదే సందర్భంలో రోడ్ల పరిస్థితిని చూసి ఆ వ్యర్ధమైన ప్లాస్టిక్ తో రోడ్ల నిర్మాణం చేపడితే ఎలా ఉంటుందా.. అని ఆలోచించాడట. ఆలోచన వచ్చిందే తడవుగా రంగంలోకి దూకాడు. సాధారణంగా రోడ్లు వేయాలంటే 90శాతం రాళ్లు, ఇసుక, సున్నంరాయి ని వినియోగిస్తారు. 10శాతం వరకూ బిటుమైన్ వాడుతారు. ఈ బిటుమైన్ అనేది క్రూడ్ ఆయిల్ నుంచి తీస్తారు. అంతేకాకుండా వ్యవసాయ సంబంధిత, వర్తక, వాణిజ్య పరమైన వ్యర్దాలను కూడా ఇందులో వినియోగిస్తారు. దీనిని ముందుగా సన్నని ముక్కల్లా క్రష్ చేసి, వేడి చేసి చిన్న చిన్న ప్లాస్టిక్ గుళికలను తయారు చేస్తారు, ఈ గుళికలను అవసరమైన థార్ మిశ్రమంలో కలుపుతారు. ఆ మిశ్రమాన్ని రోడ్లపై వేసేందుకు వీలుగా కొద్దిగా చిక్కగా ఉండేలా తయారు చేసి పెద్ద కంటైనర్లలోకి నింపుతారు. ఆతరువాత ఎక్కడైతే అవసరమో అక్కడి రోడ్లపై వేసి చదును చేస్తారు. మొట్టమొదటి సారిగా ప్రపంచంలో ఈ ప్రయోగాన్నిUK లో ప్రారంభించారు.

లక్ష కిలోమీటర్ల ప్లాస్టిక్ రోడ్లు:

మన కేంద్రప్రభుత్వం దీనిని ఆదర్శంగా తీసుకొని గ్రామీణ సడక్ యోజన అనే పేరుతో లక్ష కిలోమీటర్ల ప్లాస్టిక్ రోడ్డుమార్గాన్ని నిర్మించేందుకు సంకల్పించింది. గురుగ్రామ్ లో తొలిసారిగా 2018లో ప్లాస్టిక్ వ్యర్థాల వాడకం ద్వారా రోడ్డు వేసి ఆచరణలోకి తీసుకొచ్చింది. ఆతరువాత జమ్మూ కాశ్మీర్ లోనూ దీనిని చేపట్టింది. సుమారు 270కి.మీ మేర ప్లాస్టిక్ వ్యర్ధాలతో రోడ్డును నిర్మించడం ద్వారా డబ్బును భారీగా ఆదా చేయవచ్చు అని గుర్తించింది. దీంతో ఢిల్లీ మీరట్ రహదారులలో 1.6 టన్నుల ప్లాస్టిక్ ను వినియోగించారు. అదేవిధంగా ధౌలా రేవాన్ నుంచి ఢిల్లీ ఎయిర్ పోర్టు రోడ్డులో కూడా ప్లాస్టిక్ రహదారిని ఏర్పాటు చేశారు. మరో లక్ష కిలోమీటర్ల రోడ్డును నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా త్రిపుర సీఎం బిప్లాబ్ కుమార్ దేబ్ ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం అనే నినాదాన్ని ఇచ్చారు. అగర్తలాలో పునర్వినియోగం చేయలేని ప్లాస్టిక్ తో రోడ్ల నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ కార్యాచరణను తీసుకొచ్చారు. అందులో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్కో రీసైక్లింగ్ యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే 160 నియోజకవర్గాల్లో 160 గ్రామాలను ఎంపిక చేశారు. 232 టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలను సేకరించినట్లు గ్రామీణ, పట్టణాభివృద్ది శాఖ తెలిపింది.

ప్రతిరోజూ 25వేల టన్నుల ప్లాస్టిక్ లభ్యం:

భారత్ లో నిత్యం 25,940 టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలు లభ్యం మవుతున్నాట్లు తెలుస్తుంది. ఇందులో 60శాతం పైగా రీసైక్లింగ్ అవుతున్న ప్లాస్టిక్ గా గుర్తించారు. అందుకే ప్రతి రాష్ట్రంలో రోడ్ల వినియోగంలో కంకరతో పాటూ కొంత ప్లాస్టిక్ వ్యర్ధాలను వినియోగించాలని కేంద్రం అన్నిరాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టిక్ బాటిల్స్ మట్టిలో కలవాలంటే కనీసం 240 సంవత్సరాల కాలం పడుతుంది. వీటిని రోడ్లుగా మారిస్తే నీటిని పీల్చుకునే గుణం ఉండదు కనుక నీరు రోడ్లపై నిలువ ఉండదు. దీంతో భూగర్భ జలాలు కలుషితం అయ్యే ప్రమాదం ఉండదని చెబుతుంది. ఇప్పటి వరకూ దేశంలో చాలా కొన్నిరాష్ట్రాల్లోనే ఈ ఫార్ములాను వినియోగించుకుంటున్నాయి. ఇక భవిష్యత్ లో ‎ఎంతమంది దీనిని వినియోగిస్తారో వేచి చూడాలి.

 

T.V.SRIKAR