Rain Alert: తెలంగాణకు మరో 2 రోజులు వానగండం.. ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్
అల్పపీడనం కాస్త బలహీనపడ్డా.. వాన ముప్పు మాత్రం పూర్తిగా తొలగిపోలేదు. తెలంగాణలో మరో రెండు నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తెలంగాణలో అన్ని జిల్లాల్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. కుండపోత వర్షాలతో దాదాపు అన్ని జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిస్థితి అయితే మరింత దారుణంగా మారింది.
కట్టలు తెగిన చెరువులు.. భయపెడుతున్న వాగులు.. ఎక్కడ చూసినా ఇదే సీన్. వరంగల్ సిటీ అయితే.. పూర్తిగా వరదలతో నిండిపోయింది. వీధుల్లో బోట్ల మీద తిరగాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల మధ్య వాన చినుకు పడితే చాలు.. జనాలు వణికిపోతున్నారు. అల్పపీడనం కాస్త బలహీనపడ్డా.. వాన ముప్పు మాత్రం పూర్తిగా తొలగిపోలేదు. తెలంగాణలో మరో రెండు నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఖమ్మం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, మెదక్, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని.. జనాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో మున్నేరులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి.
22 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. నారాయణపేట, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక అటు హైదరాబాద్‌లోనూ వర్షం దంచికొడుతోంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో పలు ప్రాంతాలు జలదిగ్భందంలో ఉండిపోయాయి. జీహెచ్ఎంసీ అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. జనాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్‌లో శుక్రవారం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.