COVID-19: మళ్లీ కమ్ముకొస్తున్న కరోనా.. బీ కేర్‌ఫుల్!

గడిచిన 24 గంటల్లో 6,155 కేసులు నమోదయ్యాయంటే కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు ఏడు నెలల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. చివరగా గత సెప్టెంబర్ 16న 6,298 కేసులు నమోదయ్యాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 8, 2023 | 03:09 PMLast Updated on: Apr 08, 2023 | 3:38 PM

Ramp Up Covid 19 Testing And Vaccinationidentify Hotspots Centre Tells States

COVID-19: దేశంలో మళ్లీ కోవిడ్ విజృంభిస్తోంది. కోవిడ్ కేసుల సంఖ్య వరుసగా పెరుగుతోంది. మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఈసారి కరోనా వ్యాప్తికి ఎక్స్‌బీబీ 1.16 వేరియెంట్ కారణమని నిపుణులు చెబుతున్నారు. వేరియెంట్ ఏదైనా కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 6,155 కేసులు నమోదయ్యాయంటే కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు ఏడు నెలల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. చివరగా గత సెప్టెంబర్ 16న 6,298 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కరోనా మళ్లీ వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది.

వేలల్లో నమోదవుతున్న కేసులు
కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలోనే కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం 6,155 కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 5.63 శాతంగా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య 31,194. యాక్టివ్ కేసుల శాతం 0.07. ఇప్పటివరకు మొత్తం 4.47 కోట్ల మంది కరోనా బారిన పడ్డారు. గడిచిన 24 గంటల్లో కరోనాతో 11 మంది మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 5,30,985కు చేరింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4.41 కోట్లుకాగా, రికవరీ రేటు 98.47 శాతంగా ఉంది. ప్రస్తుతం కరోనా వ్యాప్తికి ఎక్స్‌బీబీ 1.16 (ఆర్క్టురస్) వేరియెంట్ కారణం. ఇది వేగంగా వ్యాప్తి చెందగల లక్షణం కలిగి ఉంది. అందువల్ల ఈ వేరియెంట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

COVID-19
కేంద్ర మంత్రి సమీక్ష
కోవిడ్ కేసులు పెరుగుతుండటంపై కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అనేక సూచనలు చేశారు. కోవిడ్ వ్యాప్తి విషయంలో అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ వ్యాపిస్తున్న ప్రాంతాలను గుర్తించి, నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. కోవిడ్ నిర్ధరణ పరీక్షలు చేయడం, వ్యాక్సినేషన్ వేగవంతం చేయడం, కోవిడ్‌ను ఎదుర్కొనేలా ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం, పాజిటివ్ వచ్చిన నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టడం, ప్రజలకు అవగాహన కల్పించడం వంటి చర్యల ద్వారా కోవిడ్ నియంత్రించాలని ఆయన సూచించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేంద్రం, రాష్ట్రాలు సమన్వయంతో పనిచేయాలని అభిప్రాయపడ్డారు.

ఈ అంశంపై జిల్లా అధికారులతో రాష్ట్ర స్థాయి అధికారులు సమీక్ష నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. 10, 11 తేదీల్లో మౌలిక సదుపాయాలపై ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని సూచించారు. ఆస్పత్రుల్లో తగినన్ని బెడ్స్, మెడిసిన్స్ అందుబాటులో ఉంచాలని చెప్పారు. వేరియెంట్లతో సంబంధం లేకుండా నియంత్రణా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్ వంటి ఐదంచెల వ్యూహాన్ని అమలు చేయాలని ఆదేశించారు. ఇప్పటికీ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోని వారిని గుర్తించి, వ్యాక్సిన్ ఇప్పించాలన్నారు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగులు, వృద్ధుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.

వైరస్ వ్యాప్తి పెరుగుతున్నప్పటికీ
ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ఎక్కువ మంది పేషెంట్లు ఆస్పత్రుల్లో చేరాల్సిన పరిస్థితులు రావడం లేదు. హోం ఐసోలేషన్, సాధారణ చికిత్స ద్వారానే కోలుకుంటున్నారు. తీవ్ర వ్యాధి లక్షణాలేమీ కనిపించడం లేదు. అలాగే మరణాల శాతం కూడా తక్కువగానే ఉంది. ఇవి ఉపశమనం కలిగించే అంశాలే అయినప్పటికీ కోవిడ్‌ను తేలిగ్గా తీసుకోకూడదని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం కేరళ, హిమాచల్ ప్రదేశ్, హరియాణా, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటకల్లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. ఇక దేశంలో సగటున ప్రతి పది లక్షల మంది జనాభాకు వంద మందికి కోవిడ్ పరీక్షలు చేపడుతున్నారు. అయితే, ఈ సంఖ్యను ఇంకా పెంచాల్సి ఉంది.