Indians Suffer America: కుప్పకూలుతున్న డాలర్ డ్రీమ్స్..అమెరికా, కెనడాల్లో భారతీయ విద్యార్థులు రోదన
భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో అమెరికాలో అడుగుపెట్టిన ఆ యువతి చివరకు మానసికంగా, శారీరంగా కుంగికుశించుకుపోయింది. ఇది కేవలం ఉదాహరణ మాత్రమే. డాలర్ డ్రీమ్స్ తో అమెరికా ఫ్లైట్ ఎక్కి.. అక్కడ జీవితం ఊహించిన దానికి భిన్నంగా ఉండటంతో అనేకమంది ఎన్ఆర్ఐ విద్యార్థుల జీవితాలు నడిసంద్రంలో నావలా తయారయ్యాయి.

a young woman who went from Hyderabad to Chicago to study for her master's degree and was roaming the streets starving
మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసేందుకు హైదరాబాద్ నుంచి చికాగో వెళ్లిన ఓ యువతి ఆకలితో అలమటిస్తూ వీధుల్లో తిరుగుతున్న దుస్థితిని ఈ మధ్య మీడియా వెలుగులోకి తెచ్చింది. ఆమె పరిస్థితి చూసి అందరూ చలించిపోయారు. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో అమెరికాలో అడుగుపెట్టిన ఆ యువతి చివరకు మానసికంగా, శారీరంగా కుంగికుశించుకుపోయింది. ఇది కేవలం ఉదాహరణ మాత్రమే. డాలర్ డ్రీమ్స్ తో అమెరికా ఫ్లైట్ ఎక్కి.. అక్కడ జీవితం ఊహించిన దానికి భిన్నంగా ఉండటంతో అనేకమంది ఎన్ఆర్ఐ విద్యార్థుల జీవితాలు నడిసంద్రంలో నావలా తయారయ్యాయి. కారణాలు ఏమైనా కావొచ్చు.. భారతీయ విద్యార్థులు మాత్రం ఎందుకొచ్చామురా దేవుడా అంటూ తలలు బాదుకుంటున్నారు. దేశంగానీ దేశంలో తమ ఆశలు నెరవేరక.. తిరిగి స్వదేశం వెళ్లలేక.. నరకం అనుభవిస్తున్నారు.
ఒక్కసారిగా పరిస్థితి ఎందుకు మారింది ?
హైయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వేలాది మంది విదేశాలకు క్యూ కడుతూ ఉంటారు. ఉన్నత విద్య , ఉపాధి అనగానే భారతీయుల ఛాయిస్ అమెరికా, కెనడానే. రికార్డు స్థాయిలో అమెరికా , కెనాడా చేరుకున్న విద్యార్థులు.. చదువులు పూర్తి చేసినా.. ఉద్యోగ అవకాశాలు దొరకక తాము అనుకున్న లక్ష్యాలను చేరుకోలేక డీలా పడిపోతున్నారు. ఓవైపు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోగా..మరోవైపు కాస్ట్ ఆఫ్ లివింగ్ విపరీతంగా పెరిగిపోయి బతుకు భారంగా గడుపుతున్నారు. క్లౌడ్ కంప్యూటింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి సరైన ఆఫర్ కోసం ఎదురుచూసి చూసి..చివరకు నిరుద్యోగిగా ఉండలేక కెనడాలో సూపర్ మార్కెట్‌లో పనిచేస్తున్నాడు ఓ వ్యక్తి. స్టూడెంట్ లోన్స్ తీసుకుని ఉన్నత విద్యను పూర్తి చేసిన చాలా మంది.. తీసుకున్న రుణాన్ని తీర్చలేని పరిస్థితుల్లో ఉన్నారు. తాము చదువుకున్న దానికి భిన్నంగా చిన్నాచితకా ఉద్యోగాలు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ఏదో ఒక రోజు మంచి అవకాశం రాకపోతుందా.. దశ తిరగకపోుతుందా అనుకుంటూ విదేశాల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు.
ఖర్చులెక్కువ.. ఆదాయం తక్కువ
అంతాఅనుకున్నట్టు జరిగితే.. లైఫ్ ఈజీగా వెళ్లిపోతుంది. కానీ మనం రాసుకున్న స్క్రిప్ట్ కు భిన్నంగా పరిణామాలు ఎదురైదే.. ఆ పరిస్థితులను ఎదుర్కొని ముందుకుసాగడం ఎవరికైనా కష్టమే. కెనడా, అమెరికాలో ఉంటున్న భారతీయ విద్యార్థుల పరిస్థితి ఇలానే ఉంది. సాధారణంగా ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే స్టూడెంట్స్ అక్కడ పాకెట్ మనీ కోసం పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తారు. మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసే వరకు చేతి ఖర్చులకైనా పనికోస్తాయని.. పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్లలోనో, సూపర్ మార్కెట్లలోనో పనిచేస్తారు. అయితే చదువు పూర్తైనా అనుకున్న ఉద్యోగం దొరక్క పార్ట్ జాబులతోనే కడుపు నింపుకునే పరిస్థితి ఎన్ఆర్ఐ స్టూడెంట్లది.
కాస్ట్ ఆఫ్ లివింగ్‌తోనే అసలు సమస్య
కెనడాలో ఇంటి అద్దె కోసమే మన కరెన్సీలో దాదాపుగా లక్ష రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. డబుల్ షేరింగ్ ఎకామిడేషన్ అయితే ఖర్చు తడిచి మోపెవడుతుంది. కెనడాలో అద్దెలు చెల్లించడమే భారం అనుకుంటే తిండి, రవాణా ఖర్చులు..మరో 15వందల డాలర్లు కేటాయించాలి. అమెరికాలోనైతే కొంతమంది విద్యార్థులు అర్బన్ ఏరియాల్లో ఖర్చులు భరించలేక.. గ్రామీణ ప్రాంతాలకో.. బంధువుల ఇళ్లకో వెళ్లిపోతున్నారు. అమెరికాలో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ NRI స్టూడెంట్స్ నెలకు 2000 డాలర్ల వరకు సంపాదిస్తారు. బిల్లులు చెల్లించడానికి కూడా ఈ డబ్బులు సరిపోని పరిస్థితి. అప్లైడ్ డేటా సైన్స్ లో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసేందుకు అలస్కా వెళ్లిన ఓ ఇండియన్ స్టూడెంట్.. గడ్డ కట్టే చలిలో సైకిల్‌పై తిరుగుతూ ఫుడ్ డెలివరీ చేస్తున్నాడంటే.. మనవాళ్ల పరిస్థితి అక్కడ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
మనసు విదేశాల్లో.. చూపులు స్వదేశం వైపు
కెనడా, అమెరికా, యూకే దేశాల ఆర్థిక పరిస్థితి దెబ్బతినడం.. అగ్రరాజ్యం.. మాంద్యానికి దగ్గర్లో ఉండటం, గ్రేట్ బ్రిటన్ ఇప్పటికే ద్రవ్యోల్బణం దెబ్బకు బజారునపడటం.. ఇలా అనేక కారణాలు.. విదేశీ చదువులపై గంపెడాశలతో వెళ్లిన మనవిద్యార్థుల పాలిట శాపంగా మారాయి. చావోరేవో అక్కడే ఉండిపోదామంటే.. రోజులు గడవని పరిస్థితి. ఆర్థికంగా స్థితిమంతుల కుటుంబాలకు చెందిన పిల్లలు ఇబ్బంది లేకుండా మేనేజ్ చేయగలుగుతున్నా.. అప్పులు చేసి బ్యాంకుల్లో లోన్లు తీసుకుని అమెరికా, కెనడా, యూకేల్లో పై చదువుల కోసం వెళ్లి అనుకున్న సమయానికి ఉద్యోగాల్లో చేరని వాళ్ల పరిస్థితి మాత్రం దినదినగండంగానే ఉంది. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదుటపడిన తర్వాత పరిస్థితుల్లో మార్పులు వచ్చే అవకాశమున్నా.. ఖర్చులను మేనేజ్ చేస్తూ.. లైఫ్ లీడ్ చేయడం మాత్రం NRI స్టూడెంట్స్ కు కత్తిమీదసాములానే ఉంది.