GST ON HOSTELS: హాస్టల్స్, పీజీల్లో ఉంటున్నారా.. ఇక జీఎస్టీ కట్టాల్సిందే..!

హాస్టళ్లలో చెల్లించే ఫీజులు, పీజీ రెంట్స్‌పై 12 శాతం జీఎస్టీ వసూలు చేయనున్నట్లు తెలిపింది. ఈ అంశంపై కర్ణాటక, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్స్ (ఏఏఆర్) హాస్టల్ ఫీజులు, పీజీ రెంట్స్‌పై జీఎస్టీ వసూలు చేయాలని నిర్ణయించాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 31, 2023 | 01:33 PMLast Updated on: Jul 31, 2023 | 1:33 PM

Rent On Hostels Stays Paying Guest Accommodations To Attract 12 Percent Gst

GST ON HOSTELS: హాస్టల్స్, పీజీల్లో ఉంటున్న వారికి షాకింగ్ న్యూస్ చెప్పింది కేంద్ర ఆర్థిక శాఖ. ఇకపై లగ్జరీ హాస్టల్స్, పెయింగ్ గెస్ట్‌ (పీజీ)లుగా ఉంటున్న వారికి జీఎస్టీ మోత మోగనుంది. ఈ సేవలకు జీఎస్టీ వర్తిస్తుందని ఆర్థిక శాఖ వెల్లడించింది. హాస్టళ్లలో చెల్లించే ఫీజులు, పీజీ రెంట్స్‌పై 12 శాతం జీఎస్టీ వసూలు చేయనున్నట్లు తెలిపింది. ఈ అంశంపై కర్ణాటక, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్స్ (ఏఏఆర్) హాస్టల్ ఫీజులు, పీజీ రెంట్స్‌పై జీఎస్టీ వసూలు చేయాలని నిర్ణయించాయి.

దీని వెనుక ఏఏఆర్ వాదన ఇలా ఉంది. హాస్టల్స్, పీజీలను ఇండ్లలాగా పరిగణించడం సాధ్యం కాదు. వీటిని నాన్ రెసిడెన్షియల్ వసతి గృహాలుగా పరిగణిస్తుంది. అంటే ఇవి కమర్షియల్ వసతి గృహాలు. చిన్న హోటల్స్, సత్రాల మాదిరిగానే వీటికీ పన్ను వర్తిస్తుంది. అందువల్ల లగ్జరీ హాస్టల్స్, పీజీలను జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వలేమని ఏఏఆర్ బెంగళూరు కోర్టుకు తెలిపింది. ఇకపై వీటికి జీఎస్టీ వసూలు చేస్తారు. హాస్టల్ ఫీజులు, పీజీ రెంట్స్ చెల్లించే వాళ్లు 12 శాతం జీఎస్టీ కూడా కలిపి చెల్లించాలి. 2022, జూలై 17 వరకు వీటికి పన్ను మినహాయింపు ఉండేది. అది కూడా రోజుకు రూ.1000 లోపు వసూలు చేసే హోటల్స్, క్లబ్స్, క్యాంప్స్ వంటి వాటికి మాత్రమే ఈ మినహాయింపు ఉండేది. బెంగళూరుకు చెందిన శ్రీసాయి లగ్జరియస్ స్టే ఎల్‌ఎల్‌పీ అనే సంస్థపై తలెత్తిన వివాదంపై బెంగళూరు కోర్టు తాజా నిర్ణయం వెల్లడించింది.

ఈ తీర్పు ప్రకారం.. రెసిడెన్షియనల్ అకామిడేషన్‌గా పరిగణించాలంటే అది శాశ్వత వసతి కోసమే అయ్యుండాలి. తాత్కాలిక వసతికి అద్దెకిచ్చే అతిథి గృహాలు, లాడ్జిలు కలిగి ఉండరాదు. ఏదైనా బిల్డింగ్‌ను అద్దెకు తీసుకునేటప్పుడు వాటిని అతిథి గృహం, లాడ్జింగ్ సేవలతో సమానమైన హాస్టల్స్, పీజీ సేవలు అందిస్తే.. వాటికి జీఎస్టీ మినహాయింపు ఉండదు. అంటే.. తాత్కాలిక ప్రాతిపదికన వసతి కల్పించే గృహాలు జీఎస్టీ చెల్లించాల్సిందే. ఇకపై వీటికి 12 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. దీనివల్ల హాస్టల్స్, పీజీల్లో ఉండే విద్యార్థులు, బ్యాచిలర్స్‌కు మరింత ఆర్థిక భారం పడనుంది. ఫీజుతోపాటు జీఎస్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది.