Return Dowry: రివర్స్ కట్నం ఇస్తున్న ఆంధ్రా యువకులు గోదావరి జిల్లాల్లో వధువులు కావలెను..
పెళ్లి కాని అమ్మాయి ఇంట్లో ఉంటే భారంగా తల్లితండ్రులు తెగ బాధపడిపోయేవారు ఒకప్పుడు ! ఐతే ఇప్పుడు కాలం మారింది. అబ్బాయిలకు అదే పరిస్థితి నెలకొంది. అదేదో సినిమాలో చెప్పినట్లు పెళ్లి కాని ప్రసాదుల్లా మిగిలిపోతున్నారు. ఈ వింత పరిస్థితిపై అబ్బాయిల్ని కన్న తల్లిదండ్రులు బాధపడుతున్నారు.
ఉభయగోదావరి జిల్లాల్లో పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య పెరిగిపోతుంది. పెళ్లీడు దాటిపోయి వివాహం కాకపోవడంతో.. బంధువుల పెళ్లిళ్లకు వెళ్లలేక అటు ఎవ్వరితోనూ కలవలేక చాలా మంది ఫీలవుతున్నారట.. తనతోటి చదువుకున్నవారు లేక తనకంటే చిన్నవాళ్లు భార్య పిల్లలతో ఫంక్షన్లకు వస్తుంటే బ్రహ్మచారిలా ఒంటరిగా వెళ్లి.. బంధువులు, స్నేహితులు పిల్లలెంత మంది అని అడుగుతుంటే సమాధానం చెప్పలేని స్థితిలో అసలు వెళ్లకుండా ఉండడమే బెటరని నిర్ణయానికి వస్తున్నారట.
వ్యవసాయం, సంప్రదాయ వృత్తులు, కుటుంబ వ్యాపారాల్లాంటి వృత్తులలో ఉన్న అబ్బాయిలకు ఆంధ్రా పెళ్లి మార్కెట్‌లో పెద్దగా విలువ లేదు. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నాయ్. దీంతో ఆడపిల్లలకు డబ్బులు చెల్లించేందుకు అబ్బాయిలు ముందుకు వస్తున్నారు. కొన్ని సామాజికవర్గాల్లో పెళ్లికాని ప్రసాద్‌ల సంఖ్య మరీ పెరిగిపోతోంది. అబ్బాయికి బాగా ఆర్థిక స్థోమత ఉన్నా అమ్మాయి తల్లిదండ్రులు సంతృప్తిపడడం లేదని తెలుస్తోంది.
మంచి ఉద్యోగం, మంచి ఆర్థిక స్థితి, అందం, చందం… ఇవన్నీ బేరీజు వేసుకుని అప్పుడు ఆచితూచి ఆలోచించి నిర్ణయానికి వస్తున్నారు. కొంత మంది అమ్మాయికి ఎదురుకట్నం ఇచ్చి, వివాహ ఖర్చులన్నీ తామే భరించడమే కాకుండా అవసరమైతే అమ్మాయి తల్లిదండ్రుల పేరిట కొంత భూమిని కూడా రాసి పెళ్లిళ్లు కుదుర్చుకుంటున్నారు. చాలా సామాజికవర్గాల్లో అమ్మాయిల కొరత తీవ్రమవ్వడానికి ప్రధానంగా 1990 నుంచి 1996 మధ్యలో చాలా కుటుంబాల్లో.. ఒక్క సంతానం చాలు అన్న కారణం కనిపిస్తోంది. ఏమైనా బండ్లు ఓడలవడం ఇదే కాబోలు.. ఆంధ్రా అబ్బాయిల కష్టం చూసి.. కన్యాశుల్కం రిటర్న్స్ అంటూ కొత్త చర్చ మొదలైంది సోషల్ మీడియాలో.