same-sex marriages: మనదేశంలో సాధ్యమేనా ? సుప్రీంకోర్టు తీర్పుపైనే అందరి చూపులు

అక్కడో పెళ్లి జరుగుతోంది. వధువు..వరుడు.. చూడముచ్చని జంట. బంధుమిత్రుల కోలాహలం మధ్య వైభవంగా పెళ్లివేడుక నిర్వహించారు కుటుంబ సభ్యులు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ అతిథులు కూడా ఆశీర్వదించి బెస్ట్ విషెస్ చెప్పారు. ఏడడుగులతో ఆ జంట కొత్త జీవితాన్ని ప్రారంభించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 9, 2023 | 08:45 PMLast Updated on: Apr 10, 2023 | 12:06 PM

Same Sex Marriages Supreme Court

మరో చోట కూడా పెళ్లి జరుగుతోంది. తక్కువ మంది అతిథులు మాత్రమే ఉన్నారు. పెద్దగా కోలాహలం లేదు. పెళ్లికి వచ్చిన వాళ్లలో కూడా ఎన్నో అనుమానాలు. వివాహ వేడుకైతే పూర్తయ్యింది గానీ.. వాళ్ల పెళ్లిని సమాజం మొత్తం ఆమోదించలేదు. వాళ్లిద్దరూ పారిపోయి పెళ్లి చేసుకోలేదు.. ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకుండా కూడా పెళ్లి చేసుకోలేదు. అయినా వాళ్లంటే చిన్నచూపు.ఎందుకిలా ? ఎందుకంటే మొదటి ఉదాహరణలో పెళ్లి చేసుకుంది స్త్రీపురుషులు. కానీ రెండో సందర్భంలో పెళ్లి జరిగింది ఇద్దరు పురుషుల మధ్య( GAY COUPLE). సమాజం ఆమోదించకపోవడం ఒక్కటే వీళ్ల సమస్య కాదు. వీళ్ల పెళ్లికి చట్టబద్దత కూడా లేదు. పేరుకు పెళ్లి చేసుకున్నా ప్రస్తుతమున్న భారతీయ చట్టాలు వీళ్ల పెళ్లిని పెళ్లిగా గుర్తించవు. పెళ్లి ద్వారా సంక్రమించే ఎలాంటి హక్కులను కల్పించవు.

ఎక్కడ మొదలై..ఎక్కడ వరకు వచ్చింది ?
ఐదేళ్ల క్రితం వరకు మనదేశంలో హోమో సెక్సువాలిటీ అన్నది అతిపెద్ద నేరం. గే, లెస్బియన్, ట్రాన్స్ జెండర్ ఇలా LGBTQ+ కమ్యూనిటీకి చెందిన ఇద్దరు మగ లేదా ఇద్దరు స్త్రీలు, లేదా ఇద్దరు ట్రాన్స్ పర్సన్స్ మధ్య శారీరక సంబంధం చట్ట వ్యతిరేక చర్య. అయితే తమ సెక్సువల్ ఓరియంటేషన్‌ను నేరంగా పరిగణించడాన్ని LGBTQ+ కమ్యూనిటీ తీవ్రంగా వ్యతిరేకించింది. దేశ వ్యాప్తంగా ఆందోళనలతో పాటు న్యాయపోరాటాలు కూడా జరిగాయి. చివరకు సుప్రీంకోర్టు వాళ్ల ఘోష విన్నది. 2018లో నవతేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ కేసులో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పును వెల్లడించింది. హోమో సెక్సువల్స్ మధ్య సంబంధాన్ని నేరంగా చూస్తున్న బ్రిటీష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్ లో ని సెక్షన్ 377ను రద్దు చేసింది. హోమో సెక్సువాలిటీ నేరం కాదని… వ్యక్తుల సెక్సువల్ ఓరియెంటేషన్‌ను నేరంగా చూపుతూ LGBTQ+ కమ్యూనిటీ ప్రాధమిక హక్కులను హరించడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. సెక్షన్ 377 రద్దుతో LGBTQ+ కమ్యూనిటీ సంబరాలు చేసుకుంది. అయితే వాళ్ల పోరాటం అక్కడితో ఆగలేదు. ఐదేళ్ల తర్వాత మళ్లీ సుప్రీంకోర్టు తలుపు తట్టింది LGBTQ+ కమ్యూనిటీ. స్త్రీ పురుషుల మధ్య వివాహ బంధాలను ఆమోదించినట్టే same-sex marriagesకు కూడా చట్టబద్దత కల్పించాలని, రాజ్యాంగం తమకు కల్పించిన ప్రాధమిక హక్కులకు భంగం వాటిల్లకుండా చూడాలని న్యాయపోరాటం మొదలుపెట్టారు. ఇదే అంశంపై వివిధ రాష్ట్రాల హైకోర్టులో పెండింగ్ లో ఉన్న 20కి పైగా పిటిషన్లను తమ పరిధిలోకి బదిలీ చేసిన సుప్రీంకోర్టు అన్నింటిని కలిపి విచారించేందుకు అంగీకరించింది.

ఏప్రిల్ 18న సుప్రీంకోర్టు ఏం చేయబోతోంది ?
ఎన్నో సంక్లిష్ట సమస్యలకు సమాధానం చెప్పిన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సేమ్ సెక్స్ మ్యారేజెస్‌కు చట్టబద్దత కల్పించాలన్న పిటిషన్స్ పై విచారణ చేపట్టింది. ఈ నెల 18న తుది వాదనలు వినబోతున్న సుప్రీంకోర్టు విషయ ప్రాధాన్యత దృష్ట్యా విచారణ మొత్తాన్ని లైవ్ టెలికాస్ట్ చేయాలని నిర్ణయించింది. సుప్రీం చీఫ్ జస్టిస్ డి.వై. చంద్రచూడ్‌తో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్వలింగ వివాహాలకు చట్టబద్దత కల్పించాలా వద్దా అన్న అంశంపై విచారణ చేపట్టబోతోంది. స్వలింగ సంపర్గం నేరమా..కాదా అన్న విషయంలో నిర్ణయాన్ని సుప్రీంకోర్టుకే వదిలేసిన కేంద్ర ప్రభుత్వం.. same-sex marriagesకు చట్టబద్దత కల్పించేందుకు మాత్రం సిద్ధంగాలేదు.

same-sex marriagesపై కేంద్రం వాదనేంటి ?
భారతీయ సమాజం స్త్రీ పురుషుల మధ్య వివాహాన్ని మాత్రమే ఆమోదిస్తుందని.. కుటుంబ వ్యవస్థకు అదే మూలమని.. same-sex marriages ఆమోదిస్తే దేశంలో వివాహ వ్యవస్థ మూలాలు దెబ్బతింటాయని కేంద్రం వాదిస్తోంది. same-sex marriages కోరుతూ దాఖలైన పిటిషన్లను వ్యతిరేకిస్తూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాన్ని పార్లమెంట్‌కు వదిలేయాలని కేంద్రం వాదిస్తోంది. హోమో సెక్సువాలిటీనీ ఆమోదించిన ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలు కూడా same-sex marriagesకు నో చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రమే కాదు . సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ మొదలుపెట్టకముందే వివిధ రాష్ట్రాలకు చెందిన 21 మంది రిటైర్డ్ న్యాయమూర్తులు same-sex marriagesకు చట్టబద్దత కల్పించవద్దంటూ లేఖ విడుదల చేశారు.

పిటిషనర్ల వాదనేంటి ?
సెక్యువల్ ఓరియెంటేషన్ తో సంబంధం లేకుండా జీవిత భాగస్వామిని ఎంచుకునే అవకాశం లేకపోవడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందని LGBTQ+ కమ్యూనిటీతో పాటు వాళ్లకు మద్దతుగా న్యాయపోరాటం చేస్తున్న సోషల్ ఆర్గనైజేషన్స్ వాదిస్తున్నాయి. లింగ వివక్షకు తావులేకుండా భారత రాజ్యాంగం దేశంలో ఉన్న పౌరులందరికీ సమాన హక్కులు కల్పిస్తున్నప్పుడు తమకు నచ్చిన పార్టనర్‌ను ఎంచుకునే స్వేచ్ఛ లేకుండా ఎలా చేస్తారన్నది LGBTQ+ కమ్యూనిటీ వాదన. జెండర్ ఆధారంగా రాజ్యాంగం ఎలాంటి వివక్ష చూపించకపోయినా రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వాలు సంప్రదాయాలు, కుటుంబ వ్యవస్థ పేరుతో తమ హక్కులను కాలరాస్తున్నాయని LGBTQ+ కమ్యూనిటీ విమర్శిస్తోంది.

మన దేశంలో పెళ్లిళ్ల కోసం ఉన్న చట్టాలేంటి ?
దేశవ్యాప్తంగా ప్రస్తుతం 7 రకాల వివాహ చట్టాలు అందుబాటులో ఉన్నాయి.
1. హిందూ వివాహ చట్టం (1955) : హిందూ సంప్రదాయాలు, నిబంధనల ప్రకారం పెళ్లిళ్లు, విడాకులు ఈ చట్ట పరిధిలోకి వస్తాయి.
2. ముస్లిం పర్సనల్ లా (హరియా) అప్లికేషన్ యాక్ట్ (1937 ) : ముస్లిం సమాజంలో వివాహాలు, విడాకులు, వారసత్వాలు వంటివి ఈ చట్ట పరిధిలోకి వస్తాయి
3. ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ (1872 ) : క్రిస్టిషన్స్ లో వివాహాలు, విడాకులు ఈ చట్ట పరిధిలోకి వస్తాయి
4. ఆనంద్ మ్యారేజ్ యాక్ట్ ( 1909) :సిక్కుల్లో వివాహాలన్నీ ఈ చట్ట పరిధిలోనే జరుగుతాయి.
5.పార్సీ మ్యారేజ్ అండ్ డైవర్స్ యాక్ట్ ( 1936) : జొరాస్ట్రియన్ మత సంప్రదాయాల ప్రకారం పార్సీల వివాహ, విడాకుల వ్యవహరాలకు ఈ చట్టం వర్తిస్తుంది.
6. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ( 1954) : వ్యక్తుల కులాలు, మతాలు, ప్రాంతాలు, మత విశ్వాసాలతో సంబంధం లేకుండా ఎవరైనా ఈ చట్ట ప్రకారం వివాహం చేసుకోవచ్చు.
7. ఫారిన్ మ్యారేజ్ యాక్ట్ ( 1969) : భారతీయులై ఉండి విదేశాల్లో చేసుకున్న వివాహాలకు ఈ చట్టం వర్తిస్తుంది.

LGBTQ+ కమ్యూనిటీ ఏం కోరుకుంటోంది ?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న 7 వివాహ చట్టాలు కేవలం స్త్రీ పురుషుల మధ్య వివాహాలను మాత్రమే ఆమోదిస్తున్నాయి. ఈ చట్టాల పరిధిలో సేమ్ సెక్స్ మ్యారేజెస్ ‌ను ఆమోదించకపోవడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందని పిటిషనర్లు వాదిస్తున్నారు. మరీ ముఖ్యంగా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954లోని సెక్షన్ 4(c)ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954లోని సెక్షన్ 4(c) కూడా స్త్రీ పురుషుల మధ్య వివాహాన్నే ఆమోదిస్తోంది. దీంతో ఆ సెక్షన్‌ను కొట్టేయాలని డిమాండ్ చేస్తున్నారు.

DCPCR ఏం చెబుతోంది ?
ఓవైపు same-sex marriagesను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే.. LGBTQ+ కమ్యూనిటీకి అండగా నిలిచింది ఢిల్లీ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓపెన్ మైండ్ తో ఆలోచించాలని.. సేమ్ సెక్స్ కపుల్ కూడా గుడ్ పేరెంట్స్ గా ఉండగలరని వాదిస్తూ సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. same-sex marriagesకు చట్టబద్దత కల్పిస్తే వాళ్లు పెంచుకునే పిల్లల జీవితాలు ఆగమైపోతాయన్న వాదనను DCPCR కొట్టిపడేసింది.

ఇతర దేశాల్లో పరిస్థితేంటి ?
ప్రపంచ వ్యాప్తంగా 32 దేశాలు ఇప్పటికే సేమ్ సెక్స్ మ్యారేజెస్ ను ఆమోదించి చట్టబద్దత కల్పించాయి. వీటిలో 10 దేశాలు కోర్టు తీర్పుల ద్వారా
same-sex marriagesకు ఓకే చెబితే మిగతా దేశాలు చట్టాల ద్వారానే గుర్తించాయి. ఒకవేళ భారత సుప్రీంకోర్టు కూడా same-sex marriagesకు చట్టబద్దత కల్పిస్తే తైవాన్ తర్వాత ఆసియాలో రెండో దేశంగా గుర్తింపు తెచ్చుకుంటుంది.

LGBTQ+ కమ్యూనిటీ ఆశలన్నీ సుప్రీం పైనే..
ఓవైపు ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది.. మరోవైపు సంప్రదాయవాదులు, రిటైర్డ్ న్యాయమూర్తుల్లో కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మెజార్టీ సంప్రదాయ సమాజం సేమ్ సెక్స్ మ్యారేజెస్ ‌ను ఆమోదించడానికి సిద్ధంగా లేదు. ఇలాంటి సమయంలో సుప్రీంకోర్టు సమాధానం చెప్పాల్సిన ప్రశ్న ఒక్కటే. దేశంలో అమలులో ఉన్న వివిధ వివాహ చట్టాల పరిధిలో పెళ్లి చేసుకునే అవకాశాన్ని సేమ్ సెక్స్ కపుల్‌కు లేకుండా చేయడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందా రాదా ? అన్నది తేల్చాలి. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా ఉన్న 30 లక్షలకు పైగా LGBTQ+ కమ్యూనిటీ సుప్రీం కోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తోంది. స్త్రీ పురుషుల మధ్య జరిగేది మాత్రమే పెళ్లి అనే సంప్రదాయ భావజాలం ఉన్న మనదేశంలో lgbtq+ కమ్యూనిటీ మధ్య స్వలింగ వివాహాలకు ఆమోదం లభిస్తుందా ? హోమోసెక్సువాలిటీ నేరం కాదని ఐదేళ్ల క్రితం తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు ఇప్పుడు సేమ్ సెక్స్ మ్యారెజ్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ? ఏప్రిల్ 18న తేలిపోతుంది.