America: ఒకవేళ పుతిన్, జెలెన్‌స్కీ మరణిస్తే.! సంచలనం రేపుతున్న అమెరికా రహస్య పత్రాల లీక్ వ్యవహారం

భీకరంగా జరుగుతున్న రష్యా -ఉక్రెయిన్ యుద్ధంలో ఒకవేళ పుతిన్, జెలెన్‌స్కీ ప్రాణాలు కోల్పోతే అప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ? జెలెన్‌స్కీ మరణంపై ఉక్రెయిన్ ఎలా ప్రతిస్పందిస్తుంది ?యుద్ధ పరిణామాలతో పుతిన్ ప్రాణాలు కోల్పోతే రష్యా మరింతగా రెచ్చిపోతుందా ? అది ప్రపంచ దేశాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది..? ఇవి మాత్రమే కాదు ఇలాంటి ఎన్నో సందేహాలు అమెరికా ఇంటిలిజెన్స్ విభాగానికి వచ్చాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 12, 2023 | 05:28 PMLast Updated on: Apr 12, 2023 | 6:15 PM

Secrate Document Leak Issue Create The Sensation In America

అందుకే భవిష్యత్తును ముందే ఊహించి ఇలా జరిగితే ఏమవుతుంది.. అలా జరిగే అవకాశముందా అంటూ కొన్ని విశ్లేషణలను రహస్య పత్రాల రూపంలో సిద్ధం చేసి పెట్టుకుంది. అయితే ఆ తర్వాతే కథ అడ్డం తిరిగింది. పెంటగాన్‌లో మూడో కంటికి తెలియకుండా అత్యంత రహస్యంగా ఉండాల్సిన క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్‌ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్‌ అంటేనే వాటిని అత్యంత రహస్యంగా భద్రపరుస్తారు. పైగా పెంటగాన్ లాంటి హైప్రొఫైల్ నిఘా సంస్థ నుంచి పిచ్చికాగితం బయటకు రావాలన్నా అంత ఈజీ కాదు. కానీ రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి అమెరికా రహస్యంగా రూపొందించిన దాచి పెట్టుకున్న కీలక పత్రాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడం కలకలం రేపుతోంది

పుతిన్, జెలెన్‌స్కీ యుద్ధంలో మరణిస్తే..

412 రోజులుగా రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్నా రష్యా అధ్యక్షుడు పుతిన్ గానీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ గానీ యుద్ధక్షేత్రంలో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రావొచ్చు అని ఎవరూ ఊహించలేదు. కానీ ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచిన అమెరికా మాత్రం యుద్ధం ఎటుదారితీస్తుంది.. చివరకు ఏం జరగవచ్చు అంటూ అన్ని రకాల సినారియోలను అంచనా వేసి పెట్టుకుంది. అందులో ఒకటి పుతిన్, జెలెన్‌స్కీ మరణం గురించి ప్రస్తావన.

సోషల్ మీడియాకు లీకైన క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్‌లో ఒకదానిలో ఈ ప్రస్తావన ఉండటం ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది. సీక్రెట్ అని రాసి ఉన్న ఈ డాక్యుమెంట్‌లో యుద్ధంలో పుతిన్,జెలెన్‌స్కీ ఆ తర్వాత జరగబోయే పరిణామాల గురించి ముందస్తుగా ఓ విశ్లేషణ చేసిపెట్టుకున్నారు అమెరికా అధికారులు. యుద్ధంలో గెలవలేని పరిస్థితి తలెత్తితే పుతిన్ తీవ్ర నిర్ణయాలు తీసుకునే అవకాశముందని.. టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్‌ను ప్రయోగించాల్సిందిగా రష్యాన్ సైన్యాన్ని పుతిన్ ఆదేశించవచ్చని కూడా అమెరికా ఓ విశ్లేషణ చేసింది. ఒకవేళ జెలెన్‌స్కీ గనుక యుద్ధంలో మరణిస్తే ఉక్రెయిన్‌కు మద్దతుగా ఉన్న దేశాలు వెంటనే ఆ దేశానికి ఆయుధ సరఫరా నిలిపివేసే అవకాశాలు లేకపోలేదన్న అమెరికా అనాలిస్. అంతేకాదు జెలెన్‌స్కీ మరణిస్తే.. ఉక్రెయిన్‌కు చెందిన కీలక నేత ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశముందని విశ్లేషించింది.

క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ ‌నిజమేనా ?

క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ లీక్ అయిన వ్యవహారాన్ని అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ సీరియస్‌గానే తీసుకుంది. దీనిపై ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించింది. అయితే క్లాసిఫైడ్ సీక్రెట్ డాక్యుమెంట్స్‌ పేరుతో సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఫైల్స్‌పై అమెరికా నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మార్ఫింగ్ చేసి పోస్ట్ చేశారా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు