Tirumala Security: తిరుమలలో నిఘా వైఫల్యం.. మొబైల్‌లో గర్భగుడిని చిత్రీకరించిన అజ్ఞాతవ్యక్తి..! టీటీడీ నిద్రపోతోందా..?
ఆలయంలోకి ప్రవేశించేముందు భక్తుల్ని మూడో చోట్ల తనిఖీ చేస్తారు. సెల్‌ఫోన్‌లు, కెమెరాలు, ఇతర ఎలక్ట్రానిక్స్ వంటివి ఏం ఉన్నా గుర్తించి తీసుకుంటారు. అలాంటిది మూడు చోట్ల తనిఖీలు జరిగినా ఒక భక్తుడు ఆలయం లోపలికి సెల్‌ఫోన్‌తో వెళ్లాడు. అక్కడి ఆనంద నిలయంలో వీడియో తీశాడు.
Tirumala: అత్యంత పవిత్రమైన తిరుమల శ్రీవారి ఆలయంలో భద్రతాలోపం మరోసారి బయటపడింది. ఒక భక్తుడు సెల్‌ఫోన్‌తో ఆలయంలోకి ప్రవేశించాడు. అక్కడి ఆనంద నిలయాన్ని అతి దగ్గరి నుంచి వీడియో తీశాడు. అంతేకాదు.. ఆ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ అంశం సంచలనంగా మారింది. పూర్తి తనిఖీల తర్వాతే లోపలికి వెళ్లాల్సిన భక్తుడు సెల్‌ఫోన్ లోపలికి ఎలా తీసుకెళ్లగలిగాడని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన అక్కడి అధికారుల భద్రతా వైఫల్యాన్ని, నిర్లక్ష‌్యాన్ని తెలియజేస్తోంది.
తిరుమలలో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ఆలయం లోపలికి సెల్‌ఫోన్‌లు, కెమెరాలు వంటివి తీసుకెళ్లడం నిషేధం. ఆలయంలోకి ప్రవేశించేముందు భక్తుల్ని మూడో చోట్ల తనిఖీ చేస్తారు. సెల్‌ఫోన్‌లు, కెమెరాలు, ఇతర ఎలక్ట్రానిక్స్ వంటివి ఏం ఉన్నా గుర్తించి తీసుకుంటారు. అలాంటిది మూడు చోట్ల తనిఖీలు జరిగినా ఒక భక్తుడు ఆలయం లోపలికి సెల్‌ఫోన్‌తో వెళ్లాడు. అక్కడి ఆనంద నిలయంలో వీడియో తీశాడు. వర్షం పడుతుండగా, ఆనంద నిలయాన్ని భక్తుడు అతి దగ్గరి నుంచి వీడియో తీసినట్లు తెలుస్తోంది. తర్వాత దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆనంద నిలయానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో తిరుమలలో భద్రతా వైఫల్యం బయటపడింది. చుట్టూ సీసీ కెమెరాలు, నిరంతరం సిబ్బంది పర్యవేక్షణ, తనిఖీలు వంటివి జరుగుతున్నా ఒక భక్తుడు సెల్‌ఫోన్ లోపలికి తీసుకెళ్లడం వివాదంగా మారింది. అధికారుల నిర్వహణా వైఫల్యాన్ని భక్తులు ప్రశ్నిస్తున్నారు. తూతూమంత్రంగా తనిఖీలు చేస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైతే భక్తుల భద్రత ఎలా అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు భక్తుడు తన మొబైల్‌లో వీడియో తీస్తుండగా అధికారులు సీసీ కెమెరాల ద్వారా కూడా గుర్తించలేకపోయారు. ప్రస్తుతం ఆనంద నిలయం వీడియోనే వైరల్ కాగా.. ఆ భక్తుడు ఇతర చోట్ల కూడా వీడియో తీశాడా.. అతడి దగ్గర ఇంకేమైనా వీడియోలున్నాయా అని అధికారులు అనుమానిస్తున్నారు. ఆ భక్తుడి కోసం ఆరా తీస్తున్నారు.
టీటీడీ ఏం చేస్తున్నట్లు..
కచ్చితంగా ఇది టీటీడీ వైఫల్యమే. అనేకసార్లు ఇలా టీటీడీ అధికారుల భద్రతా వైఫల్యం బయటపడింది. గతంలో ఆలయం వద్ద డ్రోన్ కెమెరాతో వీడియో చిత్రించడం కూడా సంచలనంగా మారింది. తాజాగా భక్తుడు సెల్‌ఫోన్‌తో ఆలయం లోపలికి వెళ్లాడు. ఇకనుంచైనా టీటీడీ ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అసలే ఇటీవల తిరుమలకు ఉగ్రవాదుల హెచ్చరికలు వచ్చాయి. అయితే, అవి ఫేక్ అని తర్వాత అధికారులు తేల్చారు. ఇలాంటి సమయంలో ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన అధికారులు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.