Singer Sai Chand: తెలంగాణ జానపద గాయకుడు సాయిచంద్ హఠాన్మరణం.. సీఎం కేసీఆర్ సంతాపం
తెలంగాణ ఫోక్ సింగర్, తెలంగాణ గిడ్డంగుల శాఖ చైర్మన్ సాయిచంద్ హఠాన్మరణం చెందారు. బుధవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి నాగర్ కర్నూల్ జిల్లాలోని తన ఫాంహౌజ్‌కు వెళ్లారు సాయిచంద్. తన ఫాం హౌజ్‌లోనే రాత్రి అస్వస్థతకు గురయ్యారు.

Singer Sai Chand: పాట మనిషిని తట్టి లేపుతుంది. ఆలోచింపజేస్తుంది. ఉద్యమాల్లో ఉత్తేజాన్ని నింపుతుంది. అలాంటి పాటల పూదోట పూయించిన తెలంగాణ ఫోక్ సింగర్, తెలంగాణ గిడ్డంగుల శాఖ చైర్మన్ సాయిచంద్ హఠాన్మరణం చెందారు. బుధవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి నాగర్ కర్నూల్ జిల్లాలోని తన ఫాంహౌజ్‌కు వెళ్లారు సాయిచంద్. తన ఫాం హౌజ్‌లోనే రాత్రి అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు తీవ్ర గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు నాగర్‌కర్నూల్‌లోని హాస్పిటల్‌కు తరలించారు.
పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని హాస్పిటల్‌కు తరలించాల్సిందిగా డాక్టర్లు సూచించారు. దీంతో హైదరాబాద్‌లోని కేర్ హాస్పిటల్‌కు సాయిచంద్‌ను తరలించారు. కానీ అప్పటికే ఆయన చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. 1984 సెప్టెంబర్ 20న వనపర్తి జిల్లా అమరచింత గ్రామంలో సాయిచంద్ జన్మించారు. ఆయన తల్లిదండ్రులు వెంకట్రాములు, మణెమ్మ. పీజీ వరకూ చదువుకున్న సాయిచంద్‌కు పాటలంటే ప్రాణం. సాయిచంద్ తండ్రి వెంకటరాములు అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి. సాయిచంద్‌కు కూడా తండ్రి బాటలోనే నడిచారు. తన భావాలను పాటల రూపంలో చెప్పేవారు. తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో కీలక పాత్ర పోషించారు. ప్రతీ కార్యక్రమంలో పాటలు పాడి ఉద్యమకారులను ఉత్తేజపరిచేవారు.
2018లో కేసీఆర్ నిర్వహించిన ప్రతీ కార్యక్రమంలో సాయిచంద్ పాట ఉండాల్సిందే. ఉద్యమ సమయం నుంచే సాయిచంద్‌కు బీఆర్‌ఎస్ అగ్ర నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తరువాత 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ ఎంపీ టికెట్ ఆశించారు సాయిచంద్. కానీ అప్పుడున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సాయిచంద్‌కు టికెట్ రాలేదు. కానీ 2021లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థానానికి సాయిచంద్ పేరును ముఖ్యమంత్రి ఖరారు చేశారు. ఆ స్థానం ఆయనకే ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో సాయిచంద్‌కు గిడ్డంగుల శాఖ చైర్మన్ పదవి ఇచ్చారు. పార్టీ అధినేత మాటకు ఎదురు చెప్పకుండా 2021 డిసెంబర్ 24న పదవీబాధ్యతలు స్వీకరించారు సాయిచంద్.
అప్పటి నుంచి గిడ్డంగులశాఖ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. నిన్న రాత్రి కుటుంబ సభ్యులతో తన ఫాం హౌజ్‌కు వెళ్లిన సాయిచంద్ అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషమించడంతో హాస్పిటల్‌కు తరలిస్తుండగానే చనిపోయారు. 39 ఏళ్ల వయసులో సాయిచంద్ చనిపోవడం తీవ్ర విషాధాన్ని నింపింది. తెలంగాణ సమాజం ఓ మంచి కళాకారుడిని కోల్పోయిందంటూ సీఎం కేసీఆర్ సాయిచంద్‌కు సంతాపం తెలిపారు.