Hyderabad: హైదరాబాద్‌లో హైటెక్ సోలార్ సైకిల్ ట్రాక్.. నేటి నుంచి అందుబాటులోకి..
దేశంలోనే తొలిసారిగా హైటెక్ సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ ఎకో ఫ్రెండ్లీ ట్రాక్ మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ప్రారంభమవుతుంది. ఔటర్ రింగు రోడ్డు వెంట, దేశంలోనే మొదటిసారిగా 23 కి.మీ పొడవుతో గ్రీన్ ఫీల్డ్ సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్‌ను ప్రభుత్వం నిర్మించింది.
Hyderabad: వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహా నగరం మరో ప్రత్యేకత సంతరించుకోబోతుంది. దేశంలోనే తొలిసారిగా హైటెక్ సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ ఎకో ఫ్రెండ్లీ ట్రాక్ మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ప్రారంభమవుతుంది. ఔటర్ రింగు రోడ్డు వెంట, దేశంలోనే మొదటిసారిగా 23 కి.మీ పొడవుతో గ్రీన్ ఫీల్డ్ సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్‌ను ప్రభుత్వం నిర్మించింది. గత ఏడాది సెప్టెంబర్‌లో మంత్రి కేటీఆర్ దీనికి శంకుస్థాపన చేశారు.
దీనికి సుమారు రూ.100 కోట్ల వ్యయమైనట్లు, అంతర్జాతీయ ప్రమాణాలతో దీన్ని నిర్మించినట్లు మున్సిపల్ స్పెషల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్ తెలిపారు. 4.25 మీటర్ల వెడల్పుతో మూడు లేన్లల్లో ఈ ట్రాక్ నిర్మించారు. నార్సింగి-గండిపేట మార్గంలో మూడు లేన్లలో ఈ ట్రాక్ ఏర్పాటైంది. సోలార్ రూఫ్ సైకిల్ మొదటి ట్రాక్ నార్సింగి నుంచి తెలంగాణ పోలీస్ అకాడెమీ వరకు 8.5 కిలోమీటర్ల మేర, రెండో ట్రాక్ నానక్‌రామ్‌గూడ నుంచి కొల్లూరు వరకు 14 .5 కిలోమీటర్ల మేర నిర్మించారు. 23 కిలోమీటర్ల మేర సోలార్ రూఫ్ కలిగిన ఈ ట్రాక్ 16 మెగా వాట్ల విద్యుత్ కూడా ఉత్పత్తి చేస్తుంది. ట్రాక్ పక్కన ఔషధ మొక్కలు, సువాసన వెదజల్లే, అందమైన పూల మొక్కలు ఏర్పాటు చేసి సుందరంగా తీర్చిదిద్దారు. ఈ ట్రాక్‌పై వెళ్లే సైకిలిస్టులు తమ సైకిళ్లను పార్కింగ్ చేసుకునేందుకు పార్కింగ్ ఏరియా సౌకర్యం ఉంటుంది. సైకిల్ రైడ్ చేసే వారి రక్షణ కోసం ట్రాక్ పరిధిలో ప్రతి చోటా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ట్రాక్ మధ్యమధ్యలో వివిధ రకాల ఫుడ్ కోర్టులు అందుబాటులో ఉంటాయి.
సైకిలిస్టుల కోసం, విజిటర్స్ కోసం మంచినీటి సదుపాయం కూడా అందుబాటులో ఉంది. సైక్లిస్టులు విశ్రాంతి తీసుకునేందుకు విశ్రాంతి గదులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మార్గమధ్యలో సైకిల్ రిపేర్ స్టోర్లు, అద్దె సైకిల్ స్టోర్‌లు కూడా ఉన్నాయి. ఈ ట్రాక్ 24 గంటల పాటు అందుబాటులో ఉంటుంది. భవిష్యత్తులో అంతర్జాతీయ సైక్లింగ్ టోర్నీలు నిర్వహించేందుకు అనుకూలంగా ఈ ట్రాక్ ను అభివృధ్ది చేసినట్లు అధికారులు వివరించారు. ఈ ట్రాక్ ఎకో ఫ్రెండ్లీ కావడంతో పర్యావరణానికి మేలు చేస్తుంది. నగరంలో సైక్లింగ్‌ను ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో ఇలాంటివి ఏర్పాటు చేయడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది. ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి.