North Korea: మాంత్రికుడి ప్రాణం చిలుకలో అన్నట్లు.. ఉత్తర కొరియా రాకెట్ రహస్యం.. దక్షిణ కొరియా చేతుల్లో..
నీవు ఒకడిని తంతే.. నీ తలను తన్నే వాడు ఇంకొకడు ఉంటాడు. ఈ నానుడి నిజం చేస్తూ ఇక ప్రకటన విడుదల చేసింది దక్షిణ కొరియా. సాధారణంగా ఉత్తర కొరియా ఇదివరకూ చేసిన ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. గతంలో మనకు బ్రిటీష్ పాలకులు ఏవిధంగా అయితే జుట్టుకు పన్ను, నీటికి పన్ను అని వేధించారో అదే తరుణంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ - ఉన్ అలా నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా పసిబాలిక అని చూడకుండా జీవిత ఖైదు వేసి దుర్మార్గంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈదేశం ఓ రాకెట్ ప్రయోగాన్ని గగనతలంలోకి పంపే ప్రయత్నం చేసింది. ఇది ఆదిలోనే హంసపాదం అన్నట్లుగా నేలకు రాలింది. ఈ ఉపగ్రహ శకలాలు దక్షిణ కొరియా చేతికి చిక్కాయి. దీంతో దక్షిణ కొరియా అందులోని భాగాలను పరిశీలించి ఆ దేశం వాడుతున్న సాంకేతికతను తెలుసుకోవాలనే ప్రయత్నంలో ఉంది.
ఉత్తర కొరియా గత నెలలో ఒక ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపేందుకు ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా ఆ రాకెట్ అంతరిక్షంలోకి వెళ్లే క్రమంలో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా తన దిశను మార్చుకుంది. దీంతో ఉత్తర కొరియా ప్రయోగం విఫలం అయ్యింది. రాకెట్ శకలాలు దక్షిణ కొరియా పశ్చిమ తీరంలో పడిపోయాయి. వీటిని గురువారం సాయంత్రం ఆ దేశ సైనికదళం శ్రమించి సముద్రం నుంచి బయటకు తీసింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా దేశ జాయింట్ ఛీఫ్ ఆఫ్ స్టాఫ్ అధికారికంగా ప్రకటించారు. ఉత్తర కొరియా ఇప్పటి వరకూ ఉపయోగించిన సాంకేతిక టెక్నాలజీని ఏంటి.. ఇది తమకు ఏవిధంగా ఉపయోగపడుతుంది అనే అంశంపై పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ చోన్మా అంటే రెక్కల గుర్రం అని రాసి ఉండే ఒక పెద్ద పరిమాణంలో ఉండే సిలిండర్ పై దృష్టి సారించారు. ఈ ప్రయోగానికి ఉత్తర కొరియా ఉపయోగించిన రాకెట్ పేరు చొల్లిమా -1 గా గుర్తించారు. ఈ విషయాన్ని దక్షిణ కొరియా ఏజెన్సీ ఫర్ డిఫెన్స్ డెవలప్మెంట్ అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే ఈ రాకెట్ లోని శకలాలు రెండవ ప్రయోగానికి చెందినవిగా గుర్తించారు. మొదటి దశ ప్రయోగంలో ఉపయోగించిన సాంకేతికత పై అప్పట్లో సరిహద్దు దేశాలైన దక్షిణ కొరియా, జపాన్ తీవ్రంగా ఖండించి ఆందోళనలు కూడా చేశాయి. ఇలా పక్కదేశాలకు సంబంధించి కుప్పకూలిన రాకెట్ శకలాలను తీసుకొని పరిశోధనలు జరిపి ఆ దేశ సాంకేతికతను తస్కరించడంలో చైనా ప్రదమ స్థానంలో ఉంటుంది. 1999 సంవత్సరంలో అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ఎఫ్ – 117 అనే అత్యాధునిక స్టెల్త్ విమానం సెర్బియాలో కూలిపోయింది. ఆ విమాన శకలాలను చైనా యుద్దప్రాతిపదికన సేకరించి ఆ సాంకేతికతతో జే-20 స్టెల్త్ అనే విమానాన్ని తయారు చేసింది. ప్రయోగం, ఫార్ములా పక్కదేశానిది అయితే వాటికి యంత్రరూపం ఏర్పాటు చేసి ఉపయోగించుకుంది చైనా. ఇప్పుడు ఉత్తర కొరియా ఈ దొరికిన శకలం ఆధారంగా ప్రయోగాలు చేసి ఏం తయారు చేస్తుందో అన్న ఆందోళల పక్కదేశాల పై ఉంది.
T.V.SRIKAR