TTD: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తేదీల ఖరారు.. పలు సేవల రద్దు..!

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 18 నుంచి 26 వరకు జరుగుతాయి. ఆ తర్వాత అక్టోబర్ 14 నుంచి 22 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజైన సెప్టెంబర్ 18న ఏపీ సీఎం జగన్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 30, 2023 | 04:07 PMLast Updated on: Aug 30, 2023 | 4:07 PM

Srivari Brahmotsavam 2023 Shedule Released By Ttd

TTD: తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి ఏటా జరిగే వార్షిక బ్రహ్సోత్సవాలకు షెడ్యూల్ ఖరారైంది. సెప్టెంబరు 18వ తేది నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఆలయం ఎదుట ప్రత్యేక పోస్టర్‌ను బుధవారం విడుదల చేశారు. ఈ ఏడాది అధికమాసం కావడంతో స్వామివారికి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సెప్టెంబరు 18 నుంచి
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 18 నుంచి 26 వరకు జరుగుతాయి. ఆ తర్వాత అక్టోబర్ 14 నుంచి 22 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజైన సెప్టెంబర్ 18న ఏపీ సీఎం జగన్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది. సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇచ్చే ఉద్దేశంతో, బ్రహ్మోత్సవాల సమయంలో సిఫార్సు లేఖలపై దర్శనాలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురువకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. సెప్టెంబర్, అక్టోబర్‌లో బ్రహ్మోత్సవాలు జరిగే అన్ని రోజులలో అష్టద‌ళ‌పాద‌ప‌ద్మారాధ‌న‌, తిరుప్పావ‌డ‌, క‌ల్యాణోత్సవం, ఊంజ‌ల్‌సేవ‌, స‌హ‌స్రదీపాలంకార సేవ‌ల‌ను ర‌ద్దు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. ముంద‌స్తుగా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవా టికెట్లు బుక్ చేసుకున్న భ‌క్తుల‌ను కూడా నిర్దేశిత వాహ‌న‌సేవ‌కు మాత్రమే అనుమ‌తిస్తారు. అక్టోబ‌రు 14న న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల అంకురార్పణ కార‌ణంగా స‌హ‌స్ర దీపాలంకార సేవ‌ను కూడా ర‌ద్దు చేసింది. ఈ అంశాలను గుర్తించి, భక్తులు సహకరించాలని టీటీడీ కోరింది. దీనికి అనుగుణంగా భక్తులు తమ ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించింది.

బ్రహ్మోత్సవ విశేషాలు
వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా సెప్టెంబ‌ర్ 18న ధ్వజారోహ‌ణం, సెప్టెంబ‌ర్ 22న గ‌రుడ వాహ‌న సేవ, సెప్టెంబర్ 23న స్వర్ణర‌థోత్సవం, సెప్టెంబ‌ర్ 25న ర‌థోత్సవం (మ‌హార‌థం), సెప్టెంబ‌ర్ 26న చ‌క్రస్నానం, ధ్వజావ‌రోహ‌ణం నిర్వహిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబ‌రు 19న గ‌రుడ‌వాహ‌న సేవ, అక్టోబ‌రు 22న స్వర్ణర‌థోత్సవం, అక్టోబ‌రు 23న చ‌క్రస్నానం నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు టీటీడీ వెబ్‌సైట్ సందర్శించవచ్చు.