Street Market: వారానికి ఒక్కరోజే సంత కానీ కోట్లలో లావాదేవీలు..!
మార్కెట్ విస్తృతి ఒకప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులను తీసుకొచ్చింది. పూర్వం సంతలోని వస్తు మార్పిడి పద్దతి నుంచి వ్యక్తిగత వ్యాపారాల పేరుతో నగదుకు విక్రయించే లాగా మార్పు చెందింది. దీనివల్ల గత కొంత కాలం స్ట్రీట్ మార్కెట్ కనుమరుగై పోయాయి. ప్రస్తుతం శిశిరంలో రాలిపోయి వసంతంలో చిగురించిన ఆకుల్లాగా మళ్లీ వాడవాడలా సంతలు వెలుగులోకి వచ్చాయి. అయితే గతంలో కొన్ని మాత్రం అంతరించి పోకుండా స్థిరంగా కొనసాగాయి. అందులో ప్రదానంగా కట్టంగూర్ సంత పేరొందింది. దీనికి విశేషమైన చరిత్ర ఉంది. అదేంటో తెలుసుకుందా.
ఒకప్పుడు మనం ఏవైనా ఇంటికి కావల్సిన వస్తువులు కావాలంటే సంతకి వెళ్లి కొనేవాళ్ళం. అది వస్తుమార్పిడి పద్దతి నుంచి మనకు తెలిసిన విద్య. అప్పట్టో డబ్బులు విరివిగా దొరికే పరిస్థితి లేదు. అందుకే అలా మనకు కావల్సిన వస్తువును ఒకరికి ఇచ్చి.. వారికి వద్దనుకున్న వస్తువును మనం తీసుకునే వాళ్లం. అది క్రమక్రమంగా మార్పు చెంది వ్యక్తిగత మార్కెట్ కి దారితీసింది. పైగా అందరి చేతుల్లోకి నగదు వచ్చేసింది. ఈ సమయంలో మనం ఏవస్తువు కొనాలన్నా మార్కెట్ కి వెళ్లి కొనేవాళ్లం. అదే తరుణంలో చిన్న చిన్న కిరాణా షాపులు ఇంటి గల్లీకి ఒకటి ఏర్పడిపోయాయి. దీంతో మార్కెట్ కి నిత్యం వెళ్లనవసరం లేకుండా పోయింది. ప్రస్తుతం ఏవస్తువు కొనాలన్నా నేటి తరం సూపర్ మార్కెట్ వైపుకు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఇక్కడ మరో పూర్వ సంస్కృతి జీవం పోసుకుంది. అదే కట్టంగూర్ సంత.
ధర తక్కువ – నాణ్యత ఎక్కువ
21వ శతాబ్ధంలో ఉన్నప్పటికీ సంతలను ప్రోత్సహిస్తున్నారా అంటే అవుననే చెప్పాలి. వినియోగదారునికి కావల్సింది వస్తు సేవలు. అవన్నీ ఒక్కటే చోట సరసమైన ధరలకు అందిస్తే ఇక కొనకుండా ఏమి చేస్తాడు. అదే ఇక్కడ జరుగుతోంది. ఈ సంత వారానికి ఒక్కసారే ఉంటుంది. ఈ మార్కెట్ హైదరాబాద్-విజయవాడ జాతీయరహదారిపై ఉంది. రోజు రోజుకూ ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసే వారి సంఖ్య పెరిగినట్టు అమ్మేవారి సంఖ్య కూడా పెరిగిపోతుంది. ఇక్కడ తక్కువ ధరలకు అన్ని రకాలా వస్తువులు లభించినప్పటికీ మంచి నాణ్యతతో కూడి ఉంటుంది. అదే ఇక్కడి ప్రత్యేకత.
73ఏళ్ల నాటి సంత
దీనిని 1950లో అక్కడి స్థానికులు ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు 73 ఏళ్ల నుంచి వ్యాపారం చేస్తూ ప్రఖ్యతిగాంచింది. దీని ప్రదాన ఉద్దేశ్యం జంతువులను విక్రయించడం. అది కాస్త కిరాణా మొదలు గృహోపకరణ వస్తువల వరకూ విస్తరించింది. అంతేకాకుండా వంటింటికి కావల్సిన కూరగాయల మొదలు వ్యవసాయానికి కావల్సిన పనిముట్ల వరకూ అన్నీ లభిస్తాయి. సుమారు 100కు పైగా గ్రామాల నుంచి రైతులు ఇక్కడకు వచ్చి ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, కోళ్లు రకరకాల కూరగాయలు, బట్టలు, చెప్పులు, కుండలు అన్నీ విక్రయాలు జరుపుతారు. వీరి వద్ద కొనేందుకు వందలాది మంది వినియోగదారులు సైతం సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. దీంతో వారంలో ఒక్కరోజూ పెద్ద ఎత్తున రద్దీగా కనిపిస్తుంది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ కొనుగోలు, అమ్మకాలు జరుగుతాయి.
గ్రామపంచాయతీకి గణనీయమైన ఆదాయం
ఈ ఒక్కరోజే సుమారు కోట్లలో లావాదేవీలు జరుగుతాయంటే ఆశ్చర్యం కలుగవచ్చు. దీనికి ఉదాహరణగా అక్కడి గ్రామపంచాయతీ అని చెప్పాలి. ఎందుకంటే సంవత్సరానికి సుమారు రూ.40 లక్షల వరకూ ఆదాయం ఈ సంత నుంచే రావడం విశేషం. అలాగే విక్రయదారుని ప్రతి దుకాణానికి రూ.5 నుంచి రూ.7వేల వ్యాపారం జరుగుతుంది. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు ఇక్కడి మార్కెట్ కి డిమాండ్ కొంచం ఎక్కవ అని. ప్రభుత్వాలు వీరికి సరైన తోర్పాటు అందించి ప్రోత్సాహకాలు కల్పిస్తే మరో వ్యాపార వనరుగా మారుతుందని చెప్పాలి.
T.V.SRIKAR