Sudha Murty: వెజ్.. నాన్ వెజ్.. మధ్యలో కడిగిన చెంచాలు.. సుధామూర్తి మాటల చుట్టూ రచ్చరచ్చ
కొన్ని రోజుల నుంచి సుధామూర్తి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో చర్చ జరగుతుంది. ఆమెను సమర్థించే వాళ్లు.. వ్యతిరేకించేవాళ్లు.. ఆమె మాటలను అడ్డం పెట్టుకుని వెకిలిగా సుధామూర్తిపై ట్రోలింగ్ చేసేవాళ్లు ఇలా సోషల్ మీడియా.. మొత్తం వెజ్, నాన్ వెజ్, కడిగిన చెంచాల చుట్టూనే తిరుగుతోంది.
Sudha Murty: “నేను పూర్తిగా శాకాహారిని. గుడ్లు కూడా తినను. విదేశాలకు వెళ్లేటప్పుడు కూడా నా బ్యాగ్‌లో ఆహారం పెట్టుకెళ్తాను. వెజ్, నాన్ వెజ్ వంటకాలకు ఒకటే స్పూన్ వాడతారేమోనని నా భయం”.. ఇవీ సుధానారాయణ మూర్తి ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు. ఆమె కాజువల్‌గా చెప్పారో.. లేక మనసులో ఏదైనా పెట్టుకుని చెప్పారో ఎవరికీ తెలియదు గానీ.. కొన్ని రోజుల నుంచి సుధామూర్తి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో చర్చ జరగుతుంది. ఆమెను సమర్థించే వాళ్లు.. వ్యతిరేకించేవాళ్లు.. ఆమె మాటలను అడ్డం పెట్టుకుని వెకిలిగా సుధామూర్తిపై ట్రోలింగ్ చేసేవాళ్లు ఇలా సోషల్ మీడియా.. మొత్తం వెజ్, నాన్ వెజ్, కడిగిన చెంచాల చుట్టూనే తిరుగుతోంది.
కుల దురహంకారం ఉందా..?
సుధామూర్తి కన్నడ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. ఆమె వయసు 72 సంవత్సరాలు. చిన్నప్పటి నుంచి పూర్తి శాకాహారిగానే ఉన్నారు. తానెప్పుడూ గుడ్డుకూడా ముట్టుకోలేదని ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన మాటలను బట్టి అర్థమవుతుంది. అయితే ఆమె చెప్పిన తీరుపైనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “నేను శాకాహారిని.. ఇండియాలో ఉన్నా విదేశాల్లో ఉన్నా వెజ్‌టేరియన్ ఫుడ్ మాత్రమే తింటాను” అని చెప్పి ఉంటే అసలు దీనిపై ఇంత చర్చ, రచ్చ జరిగేది కాదు. కానీ ఆమె వెజ్, నాన్ వెజ్‌లకు ఒకటే స్పూన్లు వాడతారేమో అన్న భావన వ్యక్తం చేయడం వివాదానికి దారి తీసింది. నాన్ వెజ్ స్పూన్ వాడితే ఏదో కొంపలు మునిగిపోతాయి అన్నట్టు.. శాఖాహారమే గొప్పది అన్నట్టు ఆమె వ్యాఖ్యలను చూస్తున్నారు. అగ్రకుల బ్రాహ్మణ భావజాలాన్ని సుధామూర్తి తన వ్యాఖ్యల ద్వారా బయట పెట్టుకున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.
ఎవరి వాదనను ఎవరు సమర్థించాలి..?
కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా విడిపోయిన మన దేశంలో ఇలాంటి అంశాలు పెద్ద చర్చకే దారి తీస్తాయి. సుధామూర్తి వ్యాఖ్యలపై పౌర సమాజం కూడా రెండుగా చీలిపోయింది. తాను శాకాహారిని అని చెప్పుకోవడంలో తప్పేముందని.. మాంసాహారాన్ని ఆమె ఎక్కడా కించపర్చలేదు కదా అని ఆమెను సమర్ధించేవాళ్లు చెబుతున్న మాట. అయితే ఒకటే స్పూన్లు వాడతారేమోనన్న మాటల ద్వారా కేవలం శాకాహారం గురించి మాత్రమే కాకుండా.. నాన్ వెజ్‌టేరియన్ పై ఆమె మనసులో ఉన్న వ్యతిరేకతను పరోక్షంగా వెళ్లగక్కారని సుధామూర్తి వ్యాఖ్యలతో విభేదించేవాళ్లు చెబుతున్నమాట.
సుధామూర్తికి కుల, మత పిచ్చి ఉందా..?
ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భార్యగానే కాకుండా.. టీచర్‌గా, సోషల్ వర్కర్‌గా ఎన్జీవో నేతగా సుధామూర్తి ప్రపంచానికి సుపరిచితం. ఆమె ఎన్నో పుస్తకాలు కూడా రాశారు. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఆమె ఎంతో మందికి మోటివేటర్. కష్టాల్లో ఉన్న వారికి చేదోడు అందించే మనస్సున్న మనిషిగా ఆమెకు మంచి పేరే ఉంది. ఇక ఆమె సింప్లిసిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇన్ఫోసిస్ కో ఫౌండర్ భార్యగా.. బ్రిటన్ ప్రధాని రిషి సునక్ అత్తగా.. ఆమె వరల్డ్ ఫేమస్ సెలబ్రిటీ. కానీ సాధాసీదా కాటన్ చీరలు కట్టుకుంటూ.. చాలా సింపుల్‌గా మన పక్కింటి బామ్మగారిలానే ఆమె కనిపిస్తారు. మాట తీరులోనూ, ఆమె చేష్టల్లోనూ ఇప్పటి వరకు ఎప్పుడూ గర్వం కన్పించలేదు. ఆమె మాటలు, చేతలు ఈస్థాయిలో ఎప్పుడూ వివాదాస్పదం కూడా కాలేదు. ఆమె వ్యక్తిగత జీవితాన్ని, సోషల్ లైఫ్‌ను పరిశీలించిన ఎవరైనా.. సుధామూర్తికి కులపిచ్చో, మత పిచ్చో ఉందని చెప్పలేరు. తాను పుట్టిన మతంపై అభిమానం ఉండొచ్చు.. తాను పుట్టిన కులానికి సంబంధించిన కట్టుబాట్లను అనుసరించవచ్చు. కానీ ఎప్పుడూ, ఎలాంటి సందర్భంలోనూ ఆమె కుల, మత వివాదాల జోలికి వెళ్లలేదు. తాను పూర్తిగా శాకాహారిని అని చెప్పే క్రమంలో.. చేసిన వ్యాఖ్యలకు ఆమె బ్రాహ్మణ భావజాలానికి ముడిపెట్టడం సరికాదన్నది కొంతమంది వాదన.
ఎవరు ఏం తింటే ఎవరికేంటి..?
ఆహారపు అలవాట్లు పూర్తిగా వ్యక్తిగతం. దానికి కులాలు, మతాలు, ప్రాంతాలకు లింక్ ఉంటుందని ఎవరైనా అనుకుంటే అది మూర్ఖత్వమే అవుతుంది. పలానా కులపు వాళ్లందరూ శాఖాహారమే తింటారు.. పలానా కులాలు, మతాలకు చెందిన వాళ్లు పూర్తిగా శాకాహారులు అని చెప్పడానికి ఏమీ లేదు. బ్రాహ్మణ కులంలో పుట్టి, మాంసాహారులుగా మారిన వాళ్లు సమాజంలో చాలా మంది ఉన్నారు. అదే సమయంలో మాంసాహారం తినే కుటుంబంలో పుట్టి అనేక కారణాల వల్ల శాకాహారులుగా మారిన వాళ్లు కూడా ఉన్నారు. ఎవరు ఏది ఇష్టపడతారు.. ఏది తింటారన్నది వాళ్ల వ్యక్తిగత చాయిస్‌గానే చూడాలి. మాంసాహారులతో కలిసి టేబుల్ షేర్ చేసుకుని వెజ్‌టేరియన్ తినే వాళ్లు కూడా ఉంటారు. అదే సమయంలో ఒకే కుటుంబంలో శాకాహారులు, మాంసాహారులు కూడా ఉంటారు. బలవంతంగా ఆహారపు అలవాట్లను ఎవరూ ఎవరిపై రుద్దలేరు.
సుధామూర్తి వివరణ ఇస్తారా..?
వెజ్, నాన్ వెజ్, కడిగిన స్పూన్ల గురించి చేసిన వ్యాఖ్యలపై సుధామూర్తి వివరణ ఇస్తే తప్ప ఈ వివాదం ముగిసే అవకాశం లేదు. మాంసాహారాన్ని, మాంసాహారం తినే వాళ్లను తక్కువ చేసే ఉద్దేశం ఆమెకుంటే.. అది కచ్చితంగా ఖండించాల్సిన విషయమే.