Supreme Court: టీనేజర్లలో అంగీకార శృంగారంపై మీ అభిప్రాయమేంటి..? కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం కోర్టు..!
16 నుంచి 18 ఏళ్లలోపు వయసు కలిగిన వారు పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొంటే చట్టప్రకారం నేరంగా పరిగణిస్తున్నారని, దీని చట్టబద్ధతను సవాలు చేస్తూ హర్ష్ విభోర్ సింఘాల్ అనే న్యాయవాది ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
Supreme Court: 16 నుంచి 18 ఏళ్లలోపు వయసు కలిగిన వారు పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొంటే నేరంగా పరిగణించకూడదని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) సుప్రీంకోర్టు శనివారం విచారించింది. ఈ అంశంపై అభిప్రాయం చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కేంద్ర న్యాయశాఖ, హోంశాఖ, జాతీయ మహిళా కమిషన్ సహా ఇతర చట్టబద్ధ సంస్థలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.
16 నుంచి 18 ఏళ్లలోపు వయసు కలిగిన వారు పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొంటే చట్టప్రకారం నేరంగా పరిగణిస్తున్నారని, దీని చట్టబద్ధతను సవాలు చేస్తూ హర్ష్ విభోర్ సింఘాల్ అనే న్యాయవాది ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. 18 ఏళ్లలోపు వారు పరస్పర అంగీకారంతోనే లైంగిక చర్యలో పాల్గొన్నా.. బాలిక గర్భం దాల్చిన సందర్భాల్లో ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదుతో బాలుడిని అరెస్ట్ చేస్తున్నారని ఆయన వాదించారు. పోక్సో చట్టం ప్రకారం 18 ఏళ్లలోపు వారిని మైనర్లుగా పరిగణించి.. లైంగిక చర్యను నేరంగా నిర్ధారిస్తున్నారని సింఘాల్ పేర్కొన్నారు.
అయితే బాలిక వయసు కంటే బాలుడి వయసు నాలుగేళ్ల కంటే ఎక్కువ కానప్పుడు అరెస్ట్ నుంచి మినహాయిస్తూ “రోమియో- జూలియట్ లా”ను కొన్ని దేశాలు అనుసరిస్తున్నాయనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీన్ని భారత్‌లోనూ అమలు చేయాల్సిన అవసరం ఉందని పిటిషనర్ అభిప్రాయపడ్డారు. దీనిపైనే సమాధానం చెప్పాలని కోరుతూ కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.