Supreme Court: బాలికల లైంగిక వాంఛలు.. హైకోర్టు వ్యాఖ్యల్ని తప్పుబట్టిన సుప్రీం కోర్టు..
కౌమార దశలో ఉన్న బాలికలు తమ లైంగిక వాంఛలను నియంత్రించుకోవాలి. కౌమార దశలోని ప్రతీ బాలిక ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. రెండు నిమిషాల సుఖం కోసం ఆరాటపడితే సమాజం దృష్టిలో చులకన అవుతారు. అబ్బాయిలు.. స్త్రీలను గౌరవించేలా తల్లిదండ్రులే చెప్పాలి.

Supreme Court: యుక్త వయసులోని బాలికలు లైంగిక వాంఛల్ని నియంత్రించుకోవాలంటూ కలకత్తా హైకోర్టు చేసిన వ్యాఖ్యల్ని భారత సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఇలాంటి సందర్భాల్లో న్యాయమూర్తులు తమ వ్యక్తిగత అభిప్రాయల్ని వెల్లడించరాదని, హైకోర్టు జడ్జిలు చేసిన వ్యాఖ్యలు యుక్త వయస్సున్న వారి హక్కుల్ని ఉల్లంఘించడమే అని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఒక కేసు విచారణ సందర్భంగా కలకత్తా హైకోర్టు గత అక్టోబర్‌లో ఈ వ్యాఖ్యలు చేసింది. మైనర్ బాలికపై అత్యాచారం కేసు నమోదైంది.
FREE BUS RIDE: మహిళలకు ఉచిత ప్రయాణం.. ఆ కార్డు ఉంటేనే..
ఈ కేసులో అత్యాచార ఆరోపణలున్న వ్యక్తిని నిర్దోషిగా ప్రకటిస్తూ కలకత్తా హైకోర్టు తీర్పు వెల్లడించింది. బాలికపై నిందితుడు అత్యాచారం చేశాడని, అయితే, వారిద్దరి మధ్య లైంగిక సంబంధం ఉందని కోర్టు పేర్కొంది. ఇలాంటి సందర్భాల్లో పోక్సో చట్టంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. “కౌమార దశలో ఉన్న బాలికలు తమ లైంగిక వాంఛలను నియంత్రించుకోవాలి. కౌమార దశలోని ప్రతీ బాలిక ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. రెండు నిమిషాల సుఖం కోసం ఆరాటపడితే సమాజం దృష్టిలో చులకన అవుతారు. అబ్బాయిలు.. స్త్రీలను గౌరవించేలా తల్లిదండ్రులే చెప్పాలి” అని సూచించింది. అయితే, బాలికల లైంగిక వాంఛల విషయంలో వారికి సూచన ఇస్తూ హైకోర్టు వ్యాఖ్యలు చేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరమని, అవి అనవసర వ్యాఖ్యలని సుప్రీంకోర్టు మండిపడింది.
కోర్టులు, న్యాయమూర్తుల పని నీతులు చెప్పడం కాదని జస్టిస్ అభయ్ ఎస్ ఒఖా, జస్టిస్ పంకజ్ మిథాల్ సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. ఆ బాలికలకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద లభించే హక్కులను హైకోర్టు వ్యాఖ్యలు ఉల్లంఘించాయని బెంచ్ వ్యాఖ్యానించింది. జడ్జీలు తమ వ్యక్తిగత అభిప్రాయాలను, నీతి సూత్రాలను తీర్పుల్లో వెల్లడించడం సరికాదని అభిప్రాయపడింది. కేసు విచారణను జనవరి 4కు వాయిదా వేసింది.