Supreme Court: స్వలింగ వివాహ పిటీషన్ ను స్వీకరించిన ధర్మాసనం..! ఇది తప్పా..ఒప్పా..?

సుప్రీం కోర్టు అంటే భారతదేశ అత్యున్నత న్యాయస్థానం. ఇది ఏదైతే తీర్పు ఇస్తుందో అది చట్టం అయి కూర్చుంటుంది. దీనిని దిక్కరించే అధికారం ఎవరికీ ఉండదు. గతంలో పాలకులకు తగ్గట్టుగా తీర్పులు వస్తున్నాయన్న అభియోగాలు న్యాయస్థానాలపై ఉండేవి. అందుకే కొలీజియం వ్యవస్థను ఏర్పాటు చేసి అందరికీ న్యాయం జరిగేలా ఒక కమిటీని నియమించారు. దీని ప్రకారం కేవలం ఒక్కరే నిర్ణయం తీసుకోకుండా కమిటీలో సగం పైగా సభ్యులు ఆమోదిస్తేనే అది తీర్పు వెలువరించేందుకు వీలుంటుంది. ఇలాంటి అత్యున్నత న్యాయస్థానం గతంలో అనేక సంచలనమైన తీర్పులనే ఇచ్చింది. వివాహేతర సంబంధాల విషయంలో కావచ్చు. విద్య విషయంలో కావచ్చు. స్త్రీ హక్కుల విషయంలో కావచ్చు. ట్రాన్స్ జెండర్స్ విషయంలో కావచ్చు. ఇలా పరిస్థితులకు అనుగుణంగా రకరకాల తీర్పులను వెలువరించింది. ఇప్పుడు తాజాగా మరో సంచలనమైన పిటిషన్ ను ఐదుగురు సభ్యుల ధర్మాసనం ముందు ప్రవేశపెట్టారు. అదే స్వలింగ వివాహానికి సంబంధించిన పిటీషన్. దీనిని ప్రస్తుతం తోసిపుచ్చకుండా స్వీకరించడం అయితే జరిగింది. దీనిపై తదుపరి వాయిదాను ఏప్రిల్ 18కి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే అసలు దీనిపై విచారణ జరుపవచ్చా లేదా అనే అంశం గురించి ఒక్కసారి లోతుగా చర్చించుకుందాం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 13, 2023 | 08:01 PMLast Updated on: Mar 13, 2023 | 8:01 PM

Supreme Court Taken Case About Same Gender Marriage

భారతదేశం అన్ని జాతుల, మతాల, సామాజికవర్గాలతో కలిసి మెలిసి ఉండే భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం అని చెబుతూ ఉంటారు. మన రాజ్యంగం కూడా ఇతరదేశాల ప్రాతిపదికన లిఖించుకున్నదే. అలాంటి రాజ్యంగంలోని చట్టాలను అనేక సార్లు మార్పులు చేర్పులు చేస్తూ వచ్చాయి చట్టసభలు. మహిళలకు సంబంధించిన అత్యాచారాల విషయంలో నిర్భయ, దిశ, పోక్సో వంటి కఠినమైన చట్టాలను రక్షణకోసం చేసుకున్నారు. అలాగే గతంలో ఒక మహిళ మరో వ్యక్తితో తిరిగితే అది చట్ట విరుద్దంగా ఉండేది. అలాంటి వాటిని చట్టబద్ధత కల్పిస్తూ స్త్రీ కోరుకుంటే ఎవరితోనైనా సహజీవనం చేసే హక్కు ఉన్నట్లు ప్రకటించింది. ఇక అన్యమతపరమైన వివాహాల విషయంలో కూడా ప్రత్యేక తీర్పు ఇచ్చిన పరిస్థితులు మెండుగా ఉన్నాయి. ఎవరు ఎవరినైనా.. ఏ సామాజిక వర్గం వారినైనా పెళ్లి చేసుకోవచ్చు అనేలా పౌరులకు న్యాయం కల్పించింది.

ఇప్పుడు ఇన్నింటినీ చట్టబద్దం చేసి తనదైన రికార్డును సాధించిన ధర్మసనం నేడు విచారణకు చేపట్టింది అంత ఆశ్చర్యాన్ని కలిగించే అంశంగా పరిగణించనవసరం లేదు. ఎక్కడో కొందరు దీనిని వ్యంగంగా, అన్యాయంగా, హేయమైనదిగా చూస్తూ ఉంటారు. నా వ్యక్తి గత అభిప్రాయానికి వస్తే దీనిని కూడా చట్ట బద్దత కల్పించి ఇలాంటి వారికి కూడా సామాజిక, ఆర్థిక, రాజకీయ, పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య, సేవారంగాల్లో గుర్తింపును కల్పించేలా చేయాలని చెబుతాను. ఎందుకంటే వీరు రోజుకొకరితో తిరిగే కంటే వివాహం చేసుకొని చట్టబద్దంగానే శారీరకంగా ఒక్కటయ్యే పరిస్థితి కల్పించవచ్చు. గే అనే పేరుతో విదేశాలలో జరిగే వ్యవహారమే. ఇది కొత్తేమీ కాదు. మనదేశంలో కూడా ఇలాంటి వారు చాలా మందే ఉన్నారు. అలాంటి వారికి చట్టబద్దత కల్పించడం వల్ల వచ్చే ఇబ్బందులు ఏముంటాయి.

supreme-court-of-india-

Supreme-court-of-India-

ఇది కేవలం వారికి శరీరంలోని హార్మోన్స్ లోపంవల్ల వచ్చిన మార్పు. అంతేతప్ప కావాలనో, అలా ఉండటం సరదా పడో చేసే వ్యవహారం కాదని నాభావన. ఇక వివాహం అంటే పవిత్రమైన బంధం అని చెప్పుకొస్తున్నారు కొందరు. వివాహం అంటే మానవులు కల్పించిన ఒక క్రియా విధానంమే తప్ప దీనికి సరైన ఆధారాలు లేవు. గతంలో ఆదిమానవుల కాలంలో ఒక స్త్రీకి నలుగురు లేదా ఐదుమంది భర్తలు ఉండేవారు. దీనిని వేటయుగం అంటారు. అప్పట్లో వీరందరూ అడవుల్లో వ్యవసాయం చేసుకొని బ్రతికేవారు. నిప్పును కనుగొనడం నుంచి ఆహారాన్ని వండుకోవడం, రుచికి అలవాటుపడటం ఇలా క్రమక్రమంగా మార్పులు ఏవిధంగా అయితే వచ్చాయో.. అదే విధంగా దంపతీవ్యవస్థ వచ్చింది. అదే నేటి సమాజంలో స్థిరంగా కొనసాగుతూ ఉంది. ఒక వ్యక్తికి నలుగురు, ఐదుగురు కాకుండా ఒక్కరికి ఒక్కరు అనే భావనను కల్పించారు. ఇలా భావన కల్పించక ముందు పాంచాలీ అనే మహిళకు ఐదుగురు భర్తలు ఉన్నారని మనం చదువుతూ ఉంటాం. అలా ఎవరో చెబితే దానిని గొప్పగా భావిస్తాం. అదే అన్వయంలోకి తీసుకొస్తే వ్యతిరేకిస్తాం. దీనిపై అవగాహన లేకుండా కొందరు తమ వ్యక్తిగత అభిప్రాయాన్ని అజ్ఞానంతో చెబుతూ ఉంటారు. లేదా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ ఉంటారు.

తాపిధర్మారావు రచించిన పెళ్లి దాని పుట్టుపూర్వోత్తరాలు పుస్తకంలో స్పష్టంగా రాశారు. పండుగ రోజుకూడా పాత మొగుడేనా అని. అంటే ఒకప్పటి సమాజంలో రవికల పండుగ పేరుతో ఒక తాండాలోకి వెళ్లి ఆడవాళ్లు తమ రవికలను ఒక బుట్టలో వేస్తారు. అలా వేసిన తరువాత తమ భర్తలు ఒక్కొక్కరిగా వచ్చి ఆబుట్టోలో నుంచి రవికలను తీసుకోవడం జరుగుతుంది. అలా ఎవరికి ఏరవికైతే వస్తుందో వారు ఆమెతో ఒకరోజంతా గడుపవచ్చు. అలాంటి సమయంలో ఒక మహిళకు తన రవికే తనకు వస్తుంది. అప్పుడు ఆమె వేరే గద్యంతరం లేకుండా తన భర్తతోనే గడపవలసి వస్తుంది. పండగ రోజుకూడా పాతమొగుడేనా అనేలా సామెత ఉద్భవించింది. దీనిని బట్టి ఇలాంటి వివాహ తంతులను వ్యవసాయ సమాజంలోని మానవులే ఏర్పాటు చేశారు.

రాజకీయ నాయకులు ఇలాంటివి ఏరకమైన సరికొత్త పోకడలు వచ్చినా ఇది చట్టవిరుద్దం అనడం పరిపాటిగా మారిపోయింది. ప్రస్తుతం ఉన్న మతం గొడవలో పడి మానవత్వాన్ని మరిచిపోతున్నారు. ప్రాశ్చాత్య పోకడలు అని అంటూ ఉంటారు. మనదేశంలో పండించే ప్రతి గింజ ప్రాశ్చాత్యం నుంచి దిగుమతి చేసుకున్నదే. పివి నరసింహరావు ప్రధానిగా అయినప్పటి నుంచి కొత్త వంగడాల పేరుతో మన మేలిమి గింజలనే విదేశాలకు ఎగుమతి చేసి వారి నుంచి సంకరజాతి గింజలను దిగుమతి చేసుకునేలా హరితవిప్లవం, లిబరలైజేషన్ లో భాగంగా మల్టీనేషన్ కంపెనీలను స్వాగతిచ్చారు. వస్త్రాల విష‍యంలో కూడా అంతే విదేశీ వస్తువుల బహిష్కరణ అంటే మనం ప్రతిరోజూ ధరించేవే అవి కదా. అలాగే ఉదయం లేచిన పేస్ట్ మొదలు, రాత్రి పడుకునే ముందు వినియోగించే దోమల మందు వరకూ అన్నీ ప్రాశ్చాత్యపు అలవాట్లే. వాటని అవలంభిస్తుంటేనే అభివృద్ది చెందుతున్న దేశాల జాబితాలో ఉన్నాం. ఇక వాటిని అసలు ఆచరణలోకి తీసుకురాకుంటే ఇంకా ఎంత వెనుక ఉండే వాళ్లమో ఆలోచించండి.

అందుకే ఇప్పటి వరకూ ఏవిధంగా అయితే మార్పులు జరుగుతూ వచ్చాయో అదే క్రమంలో ఈ స్వలింగ వివాహాలకు కూడా సుప్రీం కోర్టు అనుమతి లభిస్తుందని ఆశిస్తున్నాను. అలాగే వారికంటూ ఒక జీవితాన్ని ప్రసాదించి వారి మేలును కోరుకుందాం. ఎందుకంటే వీరి ఓటు అవసరమైనప్పుడు వీరి స్వేచ్ఛకూడా అవసరమే కదా. గతంలో నపుంసకులకు కూడా ఇలాగే హేళనగా చేసేవారు. ఇప్పుడు వారు అత్యున్నత రంగాల్లో మంచి మంచి స్థితుల్లో రాణిస్తున్నారు. అలాగే వీరికి కూడా దేశంలో ప్రత్యేక స్థానం కల్పిస్తుందంటూ ఆశిద్దాం. వివాహం అంటే ఒకరికి ఒకరు తోడు అని అర్ధం. వీరికి తోడు లింగంతో పనిలేదు కనుక దీనిపై తీర్పు ఏమౌతుందో వేచిచూడాలి. ఎందుకంటే భారత అత్యున్నతమైన న్యాయస్థానంలోనే వీరికి న్యాయం జరగకపోతే ఇక లోకంలో ఎక్కడా న్యాయం జరగదు.

 

T.V.SRIKAR