Rice Prices: బియ్యం ధరలూ పైపైకి.. రూ.300 వరకు పెరిగిన బస్తా..!

నాలుగు నెలల క్రితం 26 కిలోల బస్తా రూ.1,200-రూ.1,250 మధ్య ఉండగా, ఇప్పుడు రూ.1,450-రూ.1,550 వరకు పలుకుతోంది. అంటే సగటున ఒక బియ్యం బస్తా రూ.200-రూ.300 వరకు పెరిగింది. సగటున నెలకు ఒకటి.. ఒకటిన్నర బియ్యం బస్తా వాడేవారిపై నెలకు రూ.400-రూ.500 వరకు అదనపు భారం పడుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 16, 2023 | 04:00 PMLast Updated on: Jul 16, 2023 | 4:00 PM

Surging Rice Prices In India Soaring Prices Of Essential Commodities Burn Holes In Consumers Pockets

Rice Prices; దేశంలో ఒకవైపు వర్షాభావ పరిస్థితులు, ఇంకోవైపు వరదలు సామాన్యుడి జీవితంపై పెనుభారాన్ని మోపుతున్నాయి. నిత్యావసరాల వస్తువులు ఆకాశాన్ని తాకుతున్నాయి. టమాటాలే కాదు.. పప్పులు, బియ్యం ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో బియ్యం ధరలు భారీగా పెరుగుతున్నాయని వ్యాపారులు అంటున్నారు. దీంతో సామాన్యుడు చితికిపోయే పరిస్థితి తలెత్తింది.

టమాటా సహా కూరగాయల ధరలు పెరిగినా.. ఏదోలా సరిపెట్టుకుంటారు సామాన్యులు. కానీ, ప్రధాన ఆహారమైన బియ్యం ధరలు పెరిగితే మాత్రం సామాన్యుడికి మోయలేని భారమే. అటు టమాటా, పప్పులు, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం వంట ఆహార పదార్థాల ధరలతోపాటు ఇప్పుడు బియ్యం ధరలు కూడా భారీగా పెరిగాయి. ముఖ్యంగా సన్నబియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అక్షయ, ఆవుదూడ, లలిత, బెల్‌ తదితర రకాల బియ్యం ధరలు తక్కువగా ఉండేవి. మూడు, నాలుగు నెలల క్రితం ఈ బ్రాండ్లకు సంబంధించిన 26 కిలోల బస్తా రూ.1,200-రూ.1,250 మధ్య ఉండగా, ఇప్పుడు రూ.1,450-రూ.1,550 వరకు పలుకుతోంది. అంటే సగటున ఒక బియ్యం బస్తా రూ.200-రూ.300 వరకు పెరిగింది.

సగటున నెలకు ఒకటి.. ఒకటిన్నర బియ్యం బస్తా వాడేవారిపై నెలకు రూ.400-రూ.500 వరకు అదనపు భారం పడుతోంది. రోజురోజుకూ బియ్యం ధరల్లో మార్పులు వస్తున్నాయి. గతంలో ఇతర రాష్ట్రాల్లో సన్నబియ్యం తక్కువగా వాడేవాళ్లు. అయితే, ఇప్పుడు తమిళనాడు, కేరళ, ఒడిశాలో కూడా సన్నబియ్యం వాడుతుండటంతో అటువైపు ఎగుమతులు పెరిగాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో బియ్యం సరైన స్థాయిలో అందుబాటులో ఉండటం లేదు. ఫలితంగా వ్యాపారులు ధరలు పెంచేస్తున్నారు. ముందుముందు ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందనడంలో అతిశయోక్తి లేదు. తెలుగు రాష్ట్రాల్లో వానలు ముఖం చాటేశాయి. ఇంకొంతకాలం ఇలాగే ఉంటే వరి ఉత్పత్తి తీవ్రంగా తగ్గుతుంది. దీంతో మరింతగా ధరలు పెరుగుతాయి. మరోవైపు బియ్యం ఎగుమతులపై నిషేధం విధించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కొన్నిచోట్ల బియ్యాన్ని కూడా తక్కువ ధరకే విక్రయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
అల్లం, వెల్లుల్లి కూడా
టమాటా ధర రూ.100-రూ.150 పలుకుతున్న సంగతి తెలిసిందే. ఇంతపెట్టి కొందామన్నా కొన్నిచోట్ల దొరకడం లేదు. రైతు బజార్లలో రూ.100కు అమ్ముతుంటే, బయటి మార్కెట్లలో కిలో రూ.140 వరకు అమ్ముతున్నారు. టమాటా ఒక్కటే కాదు.. పచ్చిమిర్చి ధర కూడా బాగానే పరిగింది. రెండు నెలల క్రితం కిలో పచ్చిమిర్చి ధర రూ.28 ఉండేది. ఇప్పుడు రైతుబజార్లలోనే కిలో రూ.120 వరకు అమ్ముతున్నారు. ఇతర మార్కెట్లలో కొన్నిచోట్ల అయితే కిలో రూ.200కుపైగా పలుకుతోంది. వెల్లుల్లి ధర కూడా భారీగా పెరిగింది. గతంలో మంచి రకం వెల్లుల్లి కిలో రూ.80కి దొరికేది. ఇప్పుడు కిలో రూ.170కి చేరింది. అంతకుముందు కిలో అల్లం రూ.80గా ఉండేది. ఇప్పుడు రూ.200కి పెరిగింది. కొన్నిచోట్ల అసలు మార్కెట్‌లో దొరకడం లేదు. ప్రభుత్వం కొన్నిచోట్ల టమాటాల్ని తక్కువ ధరకే అందిస్తోంది. రూ.80-రూ.100కు రైతు బజార్లలో ప్రభుత్వం అమ్ముతోంది. అయితే, అవి పరిమితంగానే విక్రయిస్తోంది.
ఖర్చులు భారం..
జూన్, జూలై నెలల్లో ప్రతి కుటుంబానికి అదనపు ఖర్చులుంటాయి. ముఖ్యంగా విద్యా సంవత్సరం ప్రారంభం కాబట్టి.. స్కూల్స్, కాలేజీల్లో చదివే తమ పిల్లల ఫీజుల కోసం భారీగా చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది ప్రారంభంలోనే అడ్మిషన్ల కోసం, స్కూల్ బ్యాగ్స్, బుక్స్, యునిఫాం, బస్/ఆటో ఛార్జీలు వంటివి చెల్లించాలి. ఇక రైతులకూ పెట్టుబడి కావాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలోనే ఇంటి ఖర్చుల కోసం అదనంగా చెల్లించాల్సి వస్తోంది. నిత్యావసరాల ధరలు సామాన్యుడికి భారంగా మారాయి. మరోవైపు విద్యుత్ ఛార్జీలు కూడా ఎక్కువగానే వస్తుండటంతో మధ్యతరగతి ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.