Women Freedom: తాలిబన్లకు ఆడవాళ్లంటే అలుసు..!

తాలిబన్లు.. అరాచకానికి వాళ్లు ఆధార్ కార్డులాంటి వారు.. వీళ్ల దారుణాల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.. వారు అఫ్గాన్‌లో అధికారంలోకి రాగానే అందరికంటే దారుణంగా తయారైంది మహిళల పరిస్థితి.. ఆఫ్గాన్‌లో ఆడపిల్లగా పుడితే చాలు భూమిమీదే నరకం స్పెల్లింగ్ రాయిస్తారు.. సారీ వారు రాయడానికి ఒప్పుకోరు కదా.. నరకాన్ని నేరుగా చూపిస్తారు.. రోజుకో రకం ఆంక్షలతో రెచ్చిపోతున్న ముష్కరమూక.. తాజాగా ఆరుబయట, పచ్చిక బయళ్లున్న రెస్టారెంట్లోకి మహిళలు, కుటుంబాల ఎంట్రీపై బ్యాన్ ప్రకటించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 12, 2023 | 12:18 PMLast Updated on: Apr 12, 2023 | 12:18 PM

Talibans Special Story

ఏంటీ ఆంక్షలు..?
ఆడవాళ్లు ఇళ్లలోంచి ఒంటరిగా బయటకు రాకూడదు.. వచ్చినా హిజాబ్ ధరించాలి.. ఒంటరిగా ప్రయాణం చేయకూడదు..స్కూళ్లలో చదువుకోకూడదు..కాలేజీల్లోకి అడుగుపెట్టకూడదు.. పార్కుల్లోకి రాకూడదు..అసలు నోరువిప్పి మాట్లాడకూడదు.. టీవీలు చూడకూడదు..ఉద్యోగాలు చేయకూడదు.. విదేశీ మహిళలు ఐక్యరాజ్యసమితి ఉద్యోగాల్లో అయినా సరే అప్గాన్‌లో అత్యున్నత స్థాయిలో అయినా సరే పనిచేయకూడదు..ఇక పాలిటిక్స్‌లోకి అసలు రాకూడదు.. ఇవీ తాలిబన్ల ఆంక్షలు.. కాదని ఎదిరిస్తే కాల్చి చంపొచ్చు.. రాళ్లతో కొట్టి ప్రాణం తీయొచ్చు.. ఇవీ వాళ్ల ఆదేశాలు.. మహిళలు కేవలం సుఖాన్ని అందించే వస్తువులు.. పిల్లల్ని కనిపెట్టే యంత్రాలు.. ఇవీ వాళ్ల ఆలోచనలు.. రోజుకోరకం నియమంతో ఆడవారిని ఆంక్షల చట్రంలో బిగిస్తున్నారు తాలిబన్లు.. తాజాగా మహిళలపై మరో ఆంక్షను తీసుకొచ్చారు.

హెరాత్ ప్రావిన్సులోని మహిళలు, కుటుంబాలు.. ఓపెన్ రెస్టారెంట్లు, గ్రీనరీ ఉన్న రెస్టారెంట్లలోకి రావడాన్ని తాలిబన్లు నిషేధించారు. ఇలాంటి చోట్లకు వచ్చినప్పుడు మహిళలు, పురుషులు కలసి కూర్చుంటున్నారని, సరదాగా మాట్లాడుకుంటున్నారని, హిజాబ్ ధరించట్లేదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో తమ మతవిశ్వాసాలు దెబ్బతినకుండా ఉంటాయన్నట్లు ప్రకటనలు చేశారు. అంటే ఆడవారు వాళ్ల భర్తలతోనో, తండ్రితోనో, సోదరుడితోనో రెస్టారెంటుకు వెళ్లే స్వేచ్ఛను కూడా లాగేసుకున్నారు. కేవలం హెరాత్ ప్రావిన్సులో మాత్రమే ఇది వర్తిస్తుందని అధికారులు తెలిపారు. మిగతా ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి లేదన్నట్లు చెప్పుకొచ్చారు. అయినా మిగిలిన ప్రావిన్సుల్లోనూ ఇంతకంటే మంచి పరిస్థితులేం లేవు. అక్కడ మరో రకం అరాచకపు ఆంక్షలు అమల్లో ఉన్నాయి.

2 దశాబ్దాల క్రితం తాలిబన్ల పాలన పోయి అమెరికన్ల అండతో ప్రజాప్రభుత్వం ఏర్పడినప్పుడు అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇళ్లలో మగ్గిపోయిన మహిళలు బయటకు రావడం మొదలుపెట్టారు. చక్కగా చదువుకున్నారు. ఆడపిల్లలు బడిలో అడుగుపెట్టారు. స్వేచ్ఛ ఇంత అద్భుతంగా ఉంటుందా అనుకున్నారు. సంప్రదాయబద్దంగానే అయినా తమకు నచ్చిన దుస్తులు వేసుకున్నారు. నచ్చింది తిన్నారు.. ఉద్యోగాల్లో పురుషులను మించి రాణించారు. పదవులు నిర్వహించారు. కానీ రెండేళ్ల క్రితం తాలిబన్లు తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవడంతో పరిస్థితులు ఒక్కసారిగా తారుమారయ్యాయి. మహిళలు మళ్లీ పంజరంలో చిలుకల్లా మారిపోయారు. రోజు రోజుకు సరికొత్త ఆంక్షలతో ఎందుకు బతికున్నామా అన్న పరిస్థితి తీసుకొచ్చింది పాలక ముష్కర మూక. కనీసం ఇంట్లోవాళ్లతో కూడా స్వేచ్ఛగా మాట్లాడుకోలేని పరిస్థితిని తీసుకొచ్చారు. పిల్లల్నైనా నాలుగు ముక్కలు చదువుకోనివ్వండి అని వేడుకుంటే షరియా చట్టం ఒప్పుకోదన్నారు. సౌదీ వంటి ముస్లిం దేశాల్లో కూడా లేనన్ని ఆంక్షలు ఇక్కడ అమల్లో ఉన్నాయి. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఆధునిక యుగంలోనూ అనాగరిక పాలన సాగిస్తున్నారు. మిగిలిన ముస్లిం దేశాల్లో అయితే శిక్షలు విధిస్తారు కానీ ఇక్కడ ఆంక్షలు ఉల్లంఘిస్తే బహిరంగంగానే ప్రాణం తీస్తారు.

దాడులు చేశారు అధికారాన్ని లాక్కున్నారు.. విదేశీయుల్ని తరిమికొట్టారు.. రాజభవనాలను ఆక్రమించి ఫోటోలకు ఫోజులిచ్చారు. తుపాకులతో నడిరోడ్డులో తిరుగుతున్నారు.. ఇదేనా పాలన అంటే.? అధికారం లాక్కున్నంత ఈజీ కాదు ప్రజలను పాలించడం. కనీసం పక్కనున్న దేశాలనైనా చూసి నేర్చుకోవాలి. పోనీ ముస్లిందేశాలను అయినా ఫాలో అవ్వాలి. కానీ తాలిబన్లకు అవేమీ చేతకావడం లేదు.. దాడులతో ధ్వంసమైన దేశాన్ని పునర్నిర్మించడం అంత ఈజీ కాదు. కానీ ఆ దిశగా తాలిబన్లు చేస్తున్న ప్రయత్నాలేమీ లేవు. తమ ప్రజలకు కడుపునిండుతుందా లేదా అన్న ఆలోచన లేదు. పాలననను పక్కన పెట్టి మహిళలపై అడ్డగోలు ఆంక్షలు విధించడమే తమ ఘనతగా భావిస్తున్నారు. మొత్తంగా అఫ్గాన్‌లో మహిళల పరిస్థితి విన్న మనకే బాధేస్తుంటే అనుభవిస్తున్న వారి పరిస్థితేంటో ఊహించడం కూడా కష్టంగానే ఉంది.