Technology: కృత్రిమ మేధతో మనిషికి మరణమే.. మస్క్‌ ఆందోళనకు కారణమేంటి ?

టెక్‌ వర్గాల్లో కృత్రిమ మేధ ఎంత ఆసక్తి కలిగిస్తుందో.. అంత ఆందోళనకూ గురిచేస్తోంది. ఉద్యోగాలు పోవడంతో పాటు భవిష్యత్‌లో.. ఇది మానవాళి ఉనికికే ముప్పు తలపెట్టే ప్రమాదం ఉందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఎలాన్‌ మస్క్‌ వంటి టెక్‌ నిపుణులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. అత్యాధునిక ఏఐ వ్యవస్థల అభివృద్ధిని వెంటనే నిలిపివేయాల్సిన అవసరం ఉందని కోరుతూ నిపుణులు బహిరంగ లేఖ రాశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 30, 2023 | 11:00 PMLast Updated on: Mar 30, 2023 | 11:00 PM

Technology Of Ai

దీనిపై ట్విటర్‌ సీఈఓ ఎలన్‌ మస్క్‌, యాపిల్‌ సహ వ్యవస్థాపకుడు స్టీవ్‌ వోజ్నియాక్‌ సహా వెయ్యి మందికి పైగా నిపుణులు సంతకం చేశారు. పాజ్‌ జియాంట్‌ ఏఐ ఎక్స్‌పెరిమెంట్స్‌ పేరుతో ఈ లేఖ విడుదల చేశారు. ఏఐ ఆధారిత చాట్‌బాట్‌ చాట్‌ జీపీటీని అభివృద్ధి చేసిన ఓపెన్‌ఏఐ సంస్థ.. ఈ మధ్య జీపీటీ 4 పేరుతో మరింత అత్యాధునిక ఏఐ వ్యవస్థను పరిచయం చేసింది. ఐతే ఈ లేఖను ఫ్యూచర్‌ ఆఫ్‌ లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తరఫున రిలీజ్‌ చేశారు.

ఈ సంస్థకు ఎలాన్‌ మస్క్‌ నిధులు సమకూరుస్తున్నారు. సంతకం చేసిన వారిలో చాట్‌జీపీటీని విమర్శిస్తున్న ప్రముఖులతో పాటు ఓపెన్‌ ఏఐ ప్రత్యర్థి సంస్థల ప్రతినిధులు కూడా ఉన్నారు. ఓపెన్‌ ఏఐకి తొలినాళ్లలో మస్క్‌ కూడా నిధులు సమకూర్చారు. అలాగే ఆయన నేతృత్వంలో ఉన్న టెస్లా.. తమ విద్యుత్‌ కార్ల కోసం ప్రత్యేక ఏఐ వ్యవస్థల్ని అభివృద్ధి చేస్తోంది. మానవ మేధస్సుతో పోటీ పడే జీపీటీ 4 వంటి ఏఐ వ్యవస్థలు సమాజానికి, యావత్‌ మానవాళికి తీవ్ర ముప్పును తలపెట్టే ప్రమాదం ఉందని లేఖలో రాసుకొచ్చారు. సానుకూల ఫలితాలు ఇవ్వగలిగే ఏఐ వ్యవస్థలను మాత్రమే అభివృద్ధి చేయాలని సూచించారు. ఒకవేళ ఏమైనా ప్రతికూల ప్రభావాలు తలెత్తినా.. వాటిని నియంత్రించగలమనే నమ్మకం కుదిరితేనే శక్తిమంతమైన ఏఐల దిశగా అడుగులు వేయాలన్నారు.