Tesla Robo Attack : టెస్లా రోబో ఎటాక్… ఇంజినీర్ కి గాయాలు !!
రోబో సినిమాలో రజనీకాంత్ తయారు చేసిన రోబో... తర్వాత మనుషుల ప్రాణాలను కూడా తీస్తుంది. దాంతో దాని పార్ట్స్ అన్నీ పీకే పడేసి పనికిరాకుండా చేస్తారు. సరిగ్గా అలాగే టెస్లా కంపెనీలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పై రోబో ఎటాక్ చేసింది. దాంతో అతనికి తీవ్ర గాయాలైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అమెరికాలోని టెక్సాస్ లో ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా గిగా ఫ్యాక్టరీలో ఓ రోబో దాడిలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తీవ్రంగా గాయపడ్డారు. రెండేళ్ళ క్రితం ఈ సంఘటన జరిగింది. అయితే అమెరికాకు చెందిన ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి చెందిన ఇంజ్యూరీ రిపోర్టులో ఈ సంగతి ఆలస్యంగా బయటపడింది. టెస్లా గిగా ఫ్యాక్టరీలో అల్యూమినియం స్లేట్స్ ను కోసి… కారు విడిభాగాలను తయారు చేస్తుంటారు. అందుకోసం టెస్లా రోబోలను వాడుతుంటారు. రోబోలను సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అప్ డేట్ చేస్తుండగా… అతనిపై దాడి చేసింది ఓ రోబో. సాధారణంగా అప్ డేట్స్ చేసేటప్పుడు రోబోలను పనిచేయకుండా (Inactive) చేస్తారు. ఆరోజు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ రెండు రోబోను ఇన్ యాక్టివ్ చేశాడు. కానీ మరోదాన్ని మర్చిపోయాడట.
అప్పుడు ఆ రోబో… ఇంజినీర్ ను కిందపడేసి గట్టిగా అదిమి పట్టి బంధించింది. రోబోకు ఉండే షార్ప్ వెపన్స్ ఇంజినీర్ వీపులోకి గుచ్చుకున్నాయి. దాంతో అతని చేతికి కూడా తీవ్ర గాయం అయింది. ఫ్యాక్టరీలోని ఫ్లోర్ మీద రక్తం కారింది. 2021లో జరిగిన ఈ ప్రమాదం తప్ప తర్వాత మరేవీ జరగలేదనీ… కానీ టెస్లా ఫ్యాక్టరీలో భద్రతాపరమైన లోపాలు ఉన్నాయని ఇంజూరీ రిపోర్టులో అమెరికా అధికారులు తెలిపారు.
Zomato Shares down: జొమాటోకు భారీ షాక్ ! భారీగా పడిపోతున్న షేర్లు !!
టెక్సాస్ లోని టెస్లా ఫ్యాక్టరీలో 2022లో సగటున 21 మంది సిబ్బందిలో ఒకరికి గాయాలు అయినట్టు రిపోర్ట్ లో పేర్కొన్నారు. టెస్లాలో ఉద్యోగులకు భద్రతాపరంగా రక్షణ లేదని మాజీ ఉద్యోగులు కూడా ఆరోపిస్తున్నారు. నిర్మాణం, నిర్వహణ ఇతర పనుల్లో సంస్థ తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదనీ… అందుకే ఉద్యోగులు ప్రమాదాల బారిన పడుతున్నారని అంటున్నారు. దీనిపై టెస్లా కంపెనీ హెడ్ ఎలెన్ మస్క్ ఇంతవరకూ స్పందించలేదు.