Kartika Maso : కార్తీక మాసం ప్రారంభం.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కార్తీక మాసం ప్రారంభమైంది. శ్రీ మహా విష్ణువు, శివుడికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం.. నవంబర్ 14వ తేదీ నుంచి ప్రారంభమై.. డిసెంబర్ 13వ తేదీ వరకు ఉంటుంది. కార్తీక మాసం ప్రారంభంతో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కార్తీక మాసం ప్రారంభమైంది. శ్రీ మహా విష్ణువు, శివుడికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం.. నవంబర్ 14వ తేదీ నుంచి ప్రారంభమై.. డిసెంబర్ 13వ తేదీ వరకు ఉంటుంది. కార్తీక మాసం ప్రారంభంతో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో స్నానమాచరించి, భక్తిశ్రద్ధలతో ఆలయాలకు చేరుకుని పూజలు చేస్తున్నారు భక్తులు. శివాలయాలు, వైష్ణవ క్షేత్రాల్లో దీపారాధన చేస్తూ శివుడికి, శ్రీ మహావిష్ణువుకి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ శైవ క్షేత్రాలైన శ్రీశైలం, వేములవాడ, తిరుపతి, విజయవాడ దుర్గమ్మ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. కార్తీక మాస పూజలు చేస్తున్నారు. ఇక భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆయా ఆలయాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. అవసరమైన భద్రతా పరమైన చర్యలతో పాటు.. భక్తుల సౌకర్యార్థం అవసరమైన చర్యలు చేపడుతున్నారు. అలాగే, రద్దీ దృష్ట్యా ఆలయాల్లో రోజూ చేసే కొన్ని పూజా కార్యక్రమాలకు, ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
శ్రీశైలం పుణ్యక్షేత్రం లో కార్తీక మాసం ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాలు డిసెంబర్ 12 వరకు కొనసాగుతాయి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని స్వామి వారికి ప్రత్యేకంగా నిర్వహించే గర్భాలయం, సామూహిక అభిషేకాలను రద్దీ రోజుల్లో నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. అలాగే, శనివారం, ఆదివారం, సోమవారాలతో పాటు సెలవు రోజుల్లో స్పర్శ దర్శనాలను రద్దు చేసినట్లు తెలిపారు. కార్తీక మాసం సందర్భంగా స్వామి వారి ఆలయానికి శని, ఆది, సోమవారాల్లో భక్తులకు కేవలం అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తారు. ఇలాగే భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో అమ్మవారి అంతరాలయంలో భక్తులు నిర్వహించుకునే కుంకుమార్చన కూడా రద్దు చేశారు.