Russia: రష్యాకు నిద్రలేకుండా చేస్తున్న డ్రోన్‌దాడులు.. మాస్కోలో వాళ్లనే టార్గెట్ చేశారా ?
తన వరకు వస్తే గానీ నొప్పి తెలియదంటారు.. ! నిజమే.. బుల్లెట్ దించే వాడికంటే.. బుల్లెట్ దిగిన వాడికే పెయిన్ తెలుస్తుంది..వ్యక్తుల మధ్య వైరమైనా.. దేశాల మధ్య యుద్ధమైనా అంతే..! ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్నే తీసుకుందాం..! వారం పదిరోజులు అనుకున్న యుద్ధం కాస్తా.. 463 రోజులకు చేరుకుంది. ప్రతి రోజూ ఉక్రెయిన్ పై రష్యా ఏదో రూపంలో దాడి చేస్తూనే ఉంది. ఒకరకంగా ఉక్రెయిన్ ప్రజలకు బాంబుల మోతతోనే సూర్యోదయం, సూర్యాస్తమయం అవుతున్నాయని చెప్పాలి. నెలల తరబడి సాగుతున్న యుద్ధానికి ఉక్రెయిన్ ప్రజలు కూడా అలవాటు పడిపోయారు. లక్షలాది మంది జీవితాలు సర్వనాశనమైనా.. వేలాది మంది ప్రాణాలు కోల్పోయినా.. నగరాలకు నగరాలు రూపు రేఖలు మారిపోయినా.. రష్యా ఉక్రెయిన్‌పై బాంబు వర్షం కురిపిస్తూనే ఉంది.
పుతిన్ వైఖరిని, విధానాలను వ్యతిరేకించే అతి తక్కువ మంది రష్యన్లు మాత్రమే ఉక్రెయిన్‌పై క్రెమ్లిన్ చేస్తున్న దాడిని ఖండించారు. అంతకు మించి రష్యాలో యుద్ధానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరగలేదు. పుతిన్ వైఖరిని ఎండగట్టిందీ లేదు. అయితే రెండు మూడు రోజులుగా పరిణామాలు మారిపోయాయి. యుద్ధ ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడిప్పుడే రష్యన్లకు కూడా తెలుస్తుంది. యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో సాధారణ ప్రజలు చస్తుంటే.. స్పందించని రష్యన్ ప్రజానీకం..ఇప్పుడు కుయ్యో మొర్రో అంటోంది. దీనికి కారణం మాస్కోపై డ్రోన్ దాడి జరగడమే.
మాస్కోపై డ్రోన్ దాడి ఎవరి టార్గెట్‌గా జరిగింది ?
యుద్ధం అన్నాక రెండు వైపుల నుంచి దాడులు, ప్రతిదాడులు ఉంటాయి. కవ్వింపు ఎటువైపు నుంచి ఉన్నా.. యుద్ధంలో పాల్గొన్న రెండు పక్షాలు టార్గెట్‌జోన్‌లోకే వస్తాయి. ఉక్రెయిన్ -రష్యా యుద్ధంలోనూ నష్టం రెండు వైపుల నుంచి వుంది. అయితే ఉక్రెయిన్‌కు జరిగిన నష్టంతో పోల్చితే రష్యా పెద్దగా కోల్పోయింది ఏదీ లేదు. పశ్చిమ దేశాలు ఆర్థిక ఆంక్షలు విధించడం వల్ల తలెత్తిన సమస్యలు, యుద్ధంలో సైనికులను కోల్పోవడం రష్యాకు తగిలి ఎదురుదెబ్బలు. అయితే తొలిసారిగా రష్యా ప్రజలు కూడా యుద్ధం విపరిణామాలను అనుభవిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు రష్యా వైపు నుంచి ఉక్రెయిన్‌పై దాడులు జరిగితే ఇప్పుడు మాస్కో టార్గెట్‌గా డ్రోన్ దాడులు జరుగుతున్నాయి. మాస్కో గగనతలంలోకి డ్రోన్లు ప్రవేశించడం వెనుక తాము లేమని.. డ్రోన్ల దాడులు తమ పని కాదని.. ఉక్రెయిన్ వాదిస్తోంది. డ్రోన్ ఎటాక్‌వెనుక ఎవరున్నా… రష్యా రాజధాని మాస్కోలో జనావాసాలపై డ్రోన్ల దాడి జరగడం మాత్రం పుతిన్‌తో పాటు రష్యా పాలకులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీన్ని పుతిన్ తీవ్రవాద చర్యగా చెబుతున్నారు. ఉక్రెయిన్ మిలటరీ ఇంటెలిజెన్స్ కార్యాలయంపై తాము జరిపిన దాడికి నిరసనగా ఉక్రెయిన్ మాస్కో ప్రజలను టార్గెట్ చేస్తూ డ్రోన్లను ప్రయోగించిందని.. దీన్ని ఎంతమాత్రం సహించబోమని పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేస్తారు.
మాస్కోలోని ఆ ఏరియాలోనే డ్రోన్ దాడి ఎందుకు జరిగింది ?
ఉక్రెయిన్‌పై 460 రోజులుగా విరుచుకుపడుతున్న రష్యా… తమ భూభాగంలో డ్రోన్ దాడి జరిగే సరికి ఉక్కిరిబిక్కిరవుతుంది. మాస్కో దీనిని ఎందుకు ఇంత సీరియస్‌గా తీసుకుందో తెలియాలంటే ముందుగా డ్రోన్ దాడి జరిగిన ఏరియాకున్న ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలి. రష్యా సబ్‌అర్బన్ ఏరియాలో 8 డ్రోన్లు విరుచుకుపడిన ప్రాంతం పేరు రబ్లివోకా. రష్యాకు చెందిన రాజకీయ నాయకులు, అధికారులతో పాటు రష్యా ధనవంతులు నివసించే ఖరీదైన ప్రాంతం. రష్యాను ఆర్థికంగా , పాలనాపరంగా శాసించి , నడిపించే ప్రముఖులంతా ఈ ఏరియాలో నిర్మించిన గేటెట్ కమ్యూనిటీలోనే నివసిస్తారు. ఈ ఏరియా ఎంత ఖరీదైనదంటే ప్రపంచంలోనే రియల్ ఎస్టేట్ ధరలు ఎక్కువగా ఉన్న ప్రాంతంగా ఇది ఎప్పటి నుంచో రికార్డుల్లో ఉంది. పైగా డ్రోన్ల దాడిని రష్యా సీరియస్‌గా తీసుకోవడానికి మరో ముఖ్య కారణం కూడా ఉంది. అధ్యక్షుడు పుతిన్ తన కుటుంబంతో కలిసి ప్రైవేట్ టైమ్‌ను స్పెండ్ చేసే ప్రాంతం కూడా ఇదే. ఈ ప్రాంతాన్ని రష్యాస్ బెవరెలీ హిల్స్ అని కూడా పిలుస్తారు. రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వదేవ్‌తో పాటు ప్రస్తుత ప్రధానమంత్రి నివసించేది కూడా ఇక్కడే. పుతిన్‌తో సహా ధనవంతులు, ప్రముఖులు ఉండే ప్రాంతాన్ని టార్గెట్‌గా చేసుకుని డ్రోన్ల దాడి జరిగే సరికి రష్యా అలర్ట్ అయ్యింది.
యుద్ధం రష్యా ప్రముఖులను తాకిందా ?
ఉక్రెయిన్ రష్యాపై ప్రతిదాడులకు దిగి సామాన్యులకు నష్టం కలిగి ఉంటే క్రెమ్లిన్ ఎలా స్పందించేదో తెలియదు గానీ.. డ్రోన్ల దాడులు రష్యన్ రిచ్ కమ్యూనిటీని, రాజకీయనేతలను టార్గెట్‌గా చేసుకుని జరగడంతో పుతిన్ టీమ్‌లో కలవరం మొదలయ్యింది. మే మొదటి వారంలో క్రెమ్లిన్ టార్గెట్‌గా పుతిన్‌ను హత్య చేసేందుకు కూడా దాడులు జరిగాయి. వరుస పెట్టి ప్రతిదాడులు పెరగడంతో పుతిన్ వ్యతిరేక వర్గాలకు కొత్త ఆయుధం దొరికింది. నిన్నమొన్నటి వరకు పుతిన్ విధానాలను సమర్థించిన వాళ్లు, వ్యతిరేకించిన వాళ్లు ఇప్పుడు ఆయనపై భగ్గుమంటున్నారు. పరిస్థితి ఈ స్థాయికి రావడానికి పుతిన్ కారణమంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.
నాడు పుతిన్‌కు వెన్నెముక..నేడు ఆయన పాలిట విలన్
రష్యాలో ప్రైవేటు మిలటరీ కంపెనీని నడిపిస్తున్న వాగనార్ గ్రూప్ అధినేత యెవ్‌గని ప్రిగోజిన్ అధ్యక్షుడు పుతిన్‌కు నమ్మినబంటు. పుతిన్ కోసం దేశ విదేశాలకు ప్రైవేటు సైన్యాన్ని పంపించే యెవ్‌గని ప్రిగోజిన్ ఉక్రెయిన్ వార్‌లోనూ కీలక పాత్ర పోషించారు. ఉక్రెయినపై దాడి చేసేందుకు రష్యా సైన్యానికి భారీగా సైనికులను, ఆయుధాలను సమకూర్చారు. నిన్న మొన్నటి వరకు పుతిన్ ఆడినట్టు ఆడిన యెవ్‌గని ప్రిగోజిన్ ఇప్పుడు ఆయన టీమ్ పై నేరుగా విమర్శలు గుప్పిస్తారు. ఉక్రెయిన్‌పై యుద్ధం చేయడంలో రష్యన్ ఆర్మీ విఫలమైందని ఆరోపిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు పుతిన్ చెప్పినట్టు నడుచుకున్న వాగనార్ గ్రూప్ అధినేత ఇప్పుడు పుతిన్ విధానాలను, మంత్రుల తీరును బహిరంగంగా విమర్శిస్తున్నారు. పుతిన్ చుట్టూ ఉన్న కోటరీ విషయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదో ఒక రోజు పుతిన్ ఇన్నర్ సర్కిల్ చేతిలో పుతిన్ చావడం ఖాయమన్నారు. యెవ్‌గని ప్రిగోజిన్‌ని ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పుతిన్ ఎక్కువగా వాగనార్ గ్రూప్‌పై ఆధారపడటమే ఈ పరిస్థితికి కారణమన్నది జెలెన్‌స్కీ అభిప్రాయం.
యుద్ధం మొన్నటి వరకు ఒక లెక్క.. ఇప్పుడు మరో లెక్క
ఉక్రెయిన్ రష్యా మధ్య సాగుతున్న యుద్ధం ఇంకెంత కాలం కొనసాగుతుందో ఎవరూ ఊహించి చెప్పలేరు. రష్యా దాడులు కొనసాగిస్తున్న కొద్దీ.. ప్రతిఘటించేందుకు ఉక్రెయిన్ కూడా తన శక్తిసామర్థ్యాలతో ప్రయత్నిస్తూనే ఉంది. అమెరికా సహా పశ్చిమ దేశాల సహకారంతో ఉక్రెయిన్ రష్యాకు జవాబు ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఉక్రెయిన్ నుంచి డ్రోన్ల దాడులు పెరగడం యుద్ధం తీవ్రతను మార్చేసింది. పుతిన్‌ను, రష్యా ప్రముఖులను టార్గెట్‌గా చేసుకుని జరుగుతున్న దాడులు…భవిష్యత్తులో యుద్ధాన్ని మరింత భీకరంగా మార్చొచ్చు. అమెరికా సహా ఉక్రెయిన్‌కు మద్దతిస్తున్న దేశాలు జెలెన్‌స్కీకి భారీగా ఆయుధాలు సరఫరా చేస్తుండటంతో పుతిన్… బెలారస్‌కు అణ్వాయుధాలను కూడా తరలిస్తున్నారు. ఉక్రెయిన్ వార్‌లో రష్యాకు బేస్ పాయింట్‌గా ఉన్న బెలారస్.. పుతిన్ పంపుతున్న న్యూక్లియర్ వెపన్స్ ను ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా వాడే ప్రమాదం లేకపోలేదు.