Aircraft : కూలీలందరినీ ఒకేసారి ఫ్లైట్ ఎక్కించిన యజమాని..

విమానం ఎక్కి ఆకాశంలో విహరించాలనే కోరిక చాలా మందికే ఉంటుంది. జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కాలనే ఆశ ప్రతీ ఒక్కరిలో సహజం. కానీ విమానం ఎక్కాలంటే అంత ధర చెల్లించే స్థోమత లేక చాలా మందికి ఆ కోరిక.. కోరికగానే మిగిలిపోతుంది. కానీ ఏవియేషన్‌ సంస్థలు ప్రకటిస్తున్న ఆఫర్ల వల్ల చాలా మంది ఇప్పుడు విమానాలు ఎక్కుతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 11, 2024 | 03:18 PMLast Updated on: Feb 11, 2024 | 3:18 PM

The Owner Took All The Workers On A Flight At Once

విమానం ఎక్కి ఆకాశంలో విహరించాలనే కోరిక చాలా మందికే ఉంటుంది. జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కాలనే ఆశ ప్రతీ ఒక్కరిలో సహజం. కానీ విమానం ఎక్కాలంటే అంత ధర చెల్లించే స్థోమత లేక చాలా మందికి ఆ కోరిక.. కోరికగానే మిగిలిపోతుంది. కానీ ఏవియేషన్‌ సంస్థలు ప్రకటిస్తున్న ఆఫర్ల వల్ల చాలా మంది ఇప్పుడు విమానాలు ఎక్కుతున్నారు. కానీ ఆ స్థోమత కూడా లేని చాలా మందికి విమాన ప్రయాణం ఇప్పటికీ ఓ కల మాత్రమే. కానీ ఓ సంస్థ యజమాని పుణ్యమా అని భవన నిర్మాణ కూలీలుగా పనిచేసే వారు ఎన్నడూ ఊహించని విధంగా విమాన ప్రయాణం చేసే అదృష్టం కలిసి వచ్చింది. తమిళనాడులోని మధురైకి చెందిన ఓ నిర్మాణ సంస్థ యజమాని మాయన్‌.. తన దగ్గర పనిచేస్తున్న 75 మంది కార్మికులను మధురై నుంచి చెన్నైకి విమానంలో తీసుకువెళ్లారు. చెన్నైకి చేరుకున్న కార్మికులకు వసతి ఏర్పాటు చేసి అక్కడ ఉండే ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలను చూపించారు.

చెన్నైలోని మెరీనా బీచ్, ఎంజీఆర్, అన్నాదొరై సమాధులు, డీఎండీ అధినేత విజయ్ కాంత్ స్మారక స్థూపంతో పాటు ఇతర ప్రాంతాలను దగ్గరుండి మరీ చూపించారు. తర్వాత హూటల్‌లో వారికి నచ్చిన విందు ఏర్పాటు చేశారు. అనంతరం వారందరినీ లగ్జరీ బస్సులో తిరిగి మధురైకి పంపించారు. మయాన్‌ కూడా ఓ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినవారే. సామాన్యుల కష్టాలు కోరికలు ఎలా ఉంటాయో తెలుసు కాబట్టే తన దగ్గర పని చేసే కార్మికులకు ఇలాంటి అవకాశం ఇచ్చానంటూ చెప్పారు మయాన్‌. తనకు కూడా విమానం ఎక్కడం ఒకప్పుడు కలగా ఉండేదట. వ్యాపారం ప్రారంభించిన తరువాత విమానం ఎక్కే అవకాశం కలిగిందట. అయితే చాలా మందికి ఇలా వ్యాపారం ప్రారంభించి జీవితంలో పైకి వచ్చే అదృష్టం లభించదు. అందుకే తన దగ్గర పని చేసే కార్మికులను విమానం ఎక్కించాలనే ఆలోచన వచ్చిందట మయాన్‌కు.

ఈ విషయాన్ని తన కార్మికులకు చెప్పగానే వాళ్లు చాలా సంతోషించారట. వాళ్ల చేతుల్లో ఫ్లైట్‌ టికెట్స్‌ పెట్టినప్పుడు, విమానం టేకాఫ్‌ అవుతున్నప్పుడు వాళ్ల కళ్లలో కనిపించిన ఆనందం ఎప్పటికీ మర్చిపోలేనని చెప్తున్నారు మయాన్‌. ప్రయాణం చేసిన కార్మికులు కూడా చాలా సంతోషించారు. విమానం దగ్గరగా కనిపిస్తేనే చాలా సంతోషించేవాళ్లం.. అలాంటి విమానం ఎక్కుతామని ఎప్పుడు అనుకోలేదు.. అలాంటిది మమ్మల్ని విమానం ఎక్కించిన యజమానికి ఎప్పుడూ రుణపడి ఉంటామని చెప్తున్నారు కార్మికులు. విమానం ఎక్కిన సంతోషంతో వాళ్లు మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. యజమానులు అంటేనే అజమాయిషీ చేస్తున్న ఈ రోజుల్లో.. ఏం ఆశించకుండా కార్మికులకు ఇలాంటి అవకాశం కల్పించిన మయాన్‌కు ప్రతీ ఒక్కరూ ఫిదా అవుతున్నారు.