Tirumala: తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల చేసిన టీటీడీ..!

సాధారణంగా ఏడాది ఒకసారి మాత్రమే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అయితే, ఈ ఏడాది రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తోంది టీటీడీ. దీనికి కారణం.. అధిక మాసం. చాంద్రమానం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంటుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 29, 2023 | 07:55 PMLast Updated on: Sep 29, 2023 | 7:55 PM

Tirumala Navaratri Brahmotsavam Shedule Released By Ttd Here Is The Details

Tirumala: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు జరుగునున్నాయి. ఇటీవలే సాలకట్ల బ్రహ్మోత్సవాలు పూర్తైన సంగతి తెలిసిందే. ఇక వచ్చే నెల నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించబోతుంది టీటీడీ. ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు జరిగేందుకు కారణం ఉంది.
సాధారణంగా ఏడాది ఒకసారి మాత్రమే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అయితే, ఈ ఏడాది రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తోంది టీటీడీ. దీనికి కారణం.. అధిక మాసం. చాంద్రమానం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంటుంది. అధిక మాసం వచ్చిన ఏడాది కన్యామాసం (భాద్రపదం)లో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, ఆ తర్వాత దసరా నవరాత్రుల్లో (ఆశ్వయుజం) నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఇటీవలే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఈ నెల 18 నుంచి 26 వ‌రకు సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను టీటీడీ శుక్రవారం విడుదల చేసింది.
నవరాత్రి బ్రహ్మోత్సవాల షెడ్యూల్ ఇదే..
టీటీడీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అక్టోబర్ 15 ఆదివారం రాత్రి పెద్ద శేష వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వడంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. తర్వాత అక్టోబర్ 16, సోమవారం ఉదయం చిన్న శేష వాహనం, రాత్రి హంస వాహనంపై స్వామివారు విహరిస్తారు. అక్టోబర్ 17, మంగళవారం ఉదయం సింహ వాహన సేవ, రాత్రి ముత్యపు పందిరి వాహన సేవలు జరుగుతాయి. అక్టోబర్ 18, బుధవారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు కల్ప వృక్ష వాహన సేవ, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు సర్వ భూపాల వాహనంపై స్వామి వారు భక్తులను కరుణిస్తారు. అక్టోబర్ 19, గురువారం ఉదయం మోహినీ అవతారంలో దర్శనమిస్తారు. అదే రోజు రాత్రి గరుడ వాహన సేవ జరుగుతుంది. అక్టోబర్ 20, శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు హనుమ వాహనంపై, సాయంత్రం పుష్పక విమానంపై, రాత్రి గజ వాహనంపై శ్రీవారు విహరిస్తారు. అక్టోబర్ 21, శనివారం ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహన సేవలు ఉంటాయి. అక్టోబర్ 22, ఆదివారం ఉదయం స్వర్ణ రథోత్సవంపై, రాత్రి అశ్వ వాహనంపై స్వామివారు విహరిస్తారు. అక్టోబర్ 23, సోమవారం తొమ్మిదో రోజు స్వామివారికి చక్ర స్నానం జరుగుతుంది. దీంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
రెండింటికీ తేడా ఏంటి..?
చంద్రమానంలో ప్రతి మూడేళ్లకు ఒకసారి అధిక మాసం వస్తుంది. ఆ సమయంలో భాద్రపద మాసంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలను వార్షిక బ్రహ్మోత్సవాలు అంటారు. దాని తరువాత దసరా నవరాత్రుల సందర్భంగా మరోసారి ఉత్సవాలు నిర్వహిస్తారు. వీటిని నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంటారు. పురాణాల ప్రకారం శ్రీవారు వేంకటాద్రిపై వెలిశారు. తొలినాళ్లలోనే బ్రహ్మదేవున్ని పిలిచి, లోకకల్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించారు. దీంతో స్వామివారు ఆనంద నిలయం మధ్యలో ఆవిర్భవించిన కన్యామాసం (ఆశ్వయుజం)లోని శ్రవణా నక్షత్రం నాటికి పూర్తయ్యేలా బ్రహ్మదేవుడు తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాల నిర్వహించార‌ట‌. బ్రహ్మ నిర్వహించిన ఉత్సవాలు కాబట్టి, అవి బ్రహ్మోత్సవాలుగా గుర్తింపు పొందాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. అయితే ఈ ఏడాది అధికమాసం కారణంగా భాద్రపదంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాలు వచ్చాయి. ఈ రెండు బ్రహ్మోత్సవాలకు చిన్నపాటి తేడా ఉంటుంది. వార్షిక బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉంటుంది. అయితే దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఈ సేవలు ఉండవు.