Tirumala: మొన్న దర్శనం టికెట్లు – నిన్న గోవింద యాప్ – నేడు లడ్డూ పోటు – రేపు ఆ’లయమా’..?
ఏడుకొండలవాడా వేంకటరమణా గోవిందా.. గోవింద.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు. ఈయన దర్శనం రమణీయమైతే.. స్వామివారి లడ్డూ ప్రసాదం కమనీయం. తిరుమల అంటేనే లడ్డూ అనేలా నానుడి స్థిరంగా పాతుకుపోయింది. ఈ స్వామి వారి ప్రసాదం కోసం నిత్యం వేల మంది పరితపిస్తూ ఉంటారు. అలాంటి తిరుమలను నేడు క్రమక్రమంగా ప్రైవేటీకరిస్తున్నారు అని పలువురు విమర్శిస్తున్నారు. మొన్నటికి మొన్న దర్శనం టికెట్లు, నిన్న టీటీడీ యాప్, నేడు స్వామి లడ్డూ తయారీ ప్రాజెక్ట్. మరి రేపు ఏంటో..ఏకంగా గుడికే గోవింద పలుకుతారా అనే విధంగా టిటిడి బోర్డు పాలకమండలి నిర్ణయాలున్నట్లు బయట గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వానికి తెలియకుండానే జరుగుతుందా..
కేంద్రప్రభుత్వం ప్రైవేటీకరణ పేరుతో కీలకమైన ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అదానీ సంస్థలకు అప్పణంగా కట్టబెడుతోందని కొందరు ఆరోపిస్తుంటే..ఇక్కడ టీటీడీకి సంబంధించిన కొన్ని కీలక ప్రాజెక్టులను అంబానీ సంస్థలకు కట్టబెడుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనివల్ల శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల వెళ్లిన సామాన్య ప్రజలకు కనీసం వసతి కూడా అందుబాటులో లేని దుస్థితి ఏర్పడిందని కొందరి భావన. అలాగే బుకింగ్ టికెట్ల కోటా విడుదల చేసిన క్షణాల వ్యవధిలో మొత్తం టికెట్లు ఖాళీ అయిపోవడం మరో చర్చనీయాంశం అయ్యింది. కొన్ని సార్లు ఆ యాప్ ఓటీపీల పేరిట నిమిషాలను కాలాన్ని వృధా చేస్తూ బుకింగ్ చేసుకునే అవకాశాన్ని నీరుగారుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండానే ఇదంతా జరుగుతుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. వీటన్నింటికీ సమాధానం తెలియాలంటే అసలు తిరుమల లడ్డూ తయారీ ఏవిధంగా జరిగేది అందులో వచ్చిన మార్పులను తెలుసుకోవాలి.
నిర్థేశించిన కొలతల ప్రకారమే..
శ్రీవేంకటేశ్వరస్వామికి నిత్యం 62 రకాలా నైవేద్యాలను నివేదిస్తారు. ఎన్ని ప్రసాదాలు ఉంచినా స్వామివారి లడ్డూకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.1903 నుంచి స్వామి వారి ప్రసాదాలను భక్తులకు అందించడం అలనాటి మద్రాస్ ప్రభుత్వం ప్రారంభించింది. అయితే శ్రీవారి లడ్డూ ప్రసాదం 1940లో ప్రవేశపెట్టారు. అప్పటి వరకూ వివిధ రకాల రుచులతో ఉన్న ప్రసాదాల కోవలోకి తియ్యటి మధురమైన లడ్డూ ప్రసాదం వచ్చి చేరింది. ఈ లడ్డూల తయారీని నిర్ధేశించిన కొలతల ప్రకారం తయారు చేస్తారు. 5100 లడ్డూల తయారీకి 165కిలోల ఆవునెయ్యి, 180కిలోల శనగపిండి, 400కిలోల చెక్కర, 30కిలోల జీడిపప్పు, 16కిలోల ఎండుద్రాక్ష, 8కిలోల కలకండ, 4కిలోల యాలకలు వాడుతారు.
లడ్డూలకే ఏటా 250కోట్లు కేటాయింపు..
1950లో లడ్డూ తయారీకోసం దిట్టం పేరిట ఒక వంటశాలను ఏర్పాటు చేశారు. పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దీనిని కాలక్రమేణ విస్తరించారు. పూర్వం తిరుమల లడ్డూ పరిమాణంలో పెద్దగా ఉండేది. అప్పట్లో ఒక లడ్డూ ధర రెండు రూపాయలు. కేవలం లడ్డూ ప్రసాదాల తయారీకి టీటీడీ ఏటా 250కోట్లకు పైగా ఖర్చు చేస్తుంది. నేటికి ఈ లడ్డూను వినియోగంలోకి తెచ్చి 83 సంవత్సరాలు అయ్యింది. ప్రస్తుత మానవుని ఆరోగ్య పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని తియ్యదనాన్ని తగ్గించింది. పరిమాణం కూడా తగ్గించింది. ప్రస్తుత నిత్యవసర ధరలకు తగ్గట్టుగా లడ్డూ రేటును కూడా పెంచింది. దీంతో రుచి తగ్గిందని, ధర పెంచిందనే వాదనలు తరచూ వినిపిస్తూ ఉంటాయి.
500 మందితో లడ్డూ తయారీ..
లడ్డూను కేవలం వైష్ణవ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారే తయారు చేస్తారు. వీరికి కాకుండా వేరెవరికీ ఇందులో ప్రవేశానికి అవకాశం ఉండదు. అలాంటి నిష్టను గరిష్టంగా అవలంభిస్తూ రిలయన్స్ సంస్థ చేపడుతుందా అనేది మరో ప్రశ్న. సాధారణంగా ప్రతిరోజూ వచ్చే భక్తులకు సరిపడా లడ్డూలను అందించడానికి దాదాపు లడ్డూ పోటులో 500 మంది శ్రమిస్తూ ఉంటారు. ఆలయం వెలుపల ఉన్న పోటులో శనగపిండితో నేతి బూందీని తయారు చేస్తారు. ఇలా తయారైన బూందీని తన్నయార్ బెల్ట్‌తో ఆలయం లోపలికి పంపుతారు. అక్కడ ఉన్న సిబ్బంది చెక్కరపాకంలో ఈ బూందీ మిశ్రమాన్ని కలిపి స్వయంగా చేతులతో లడ్డూలను చేస్తారు. ఇలా తయారైన లడ్డూలను విక్రయ కేంద్రాలకు పంపుతారు. అక్కడి నుంచి భక్తులకు అందిస్తారు. ఇది ఎన్నో ఏళ్లుగా వస్తున్న లడ్డూ తయారీ విధానం.
నేటికీ పాత పద్దతిలోనే స్వామివారి ప్రసాదాలు..
తరతరాలుగా శ్రీవారి బూందీ పోర్ట్ లో మార్పును చేపడుతూనే వస్తుంది టీటీడీ. ఒకప్పుడు కట్టెలతో తయారు చేసే ప్రక్రియ నుంచి నేడు వినియోగిస్తున్న థర్మల్ ఫ్లీట్ స్ట్రీమింగ్ స్టౌల వరకూ ఎన్నో రకాల మార్పులు తీసుకువచ్చారు. 1984కు పూర్వం శ్రీవారి లడ్డూలకు కట్టెల పోయి వెలిగించి లడ్డూలను స్వామి వారికి నివేదించే ప్రసాదాలను తయారు చేసేవారు. నేటికీ స్వామి వారి ప్రత్యేక ప్రసాదాలకు పాతపద్దతినే ఉపయోగిస్తున్నారు. 1984లో LPC అందుబాటులోకి వచ్చింది. క్రమేపి శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ పెరగడంతో బూందీ పోటులో LPCని అమర్చింది టీటీడీ. ఈ బూందీపోటులో అత్యధికంగా నెయ్యిని వినియోగిస్తారు. దీనివల్ల వచ్చే ఆవిరికి నెయ్యి గోడలకు అంటుకొని ఎగ్జాస్టర్ ఫ్యాన్ లకు పేరుకొని పోతుంది. ఇలా ఆవిరి ఎక్కవైనప్పుడు మంటలు వ్యాపించేవి. ఇలా అంటుకున్న జిడ్డును నెలకు రెండుసార్లు శుభ్రం చేసినా తరచూ మంటలు చెలరేగి ప్రమాదాలు తప్పేవికాదు.
రూ.50కోట్ల తో రిలయన్స్ కొత్త ప్రాజెక్ట్..
తాజాగా బూందీపోటుకు ఆనుకొని ధర్మల్ ప్లేట్ స్ట్రీమింగ్ స్టౌ లను అమర్చి మరో బూందీ తయారు కేంద్రాన్ని అత్యంత అధునాతనంగా 21.75 కోట్ల రూపాయలను వెచ్చించి నిర్మించారు. థర్మో ప్లూయిడ్ హీటర్స్ మంటలు లేకుండానే ఉష్ణాన్ని పుట్టించగలవు. హీటర్లో ఉత్పత్తి అయ్యే ఉష్ణం సన్నని పైపుల ద్వారా స్టౌకు చేరుతుంది. దీంతో స్టౌ చుట్టూ ఉండే పైపులు వేడెక్కి దీనిపై ఉంచిన కడాయి వేడెక్కుతుంది. గంటకు 15 కిలో కేలరీల ఉష్ణాన్ని విడుదల చేస్తుంది. దీనితో పాటూ ఉష్ణ బదిలీల ద్వారా వేడి ఎక్కే 45 ప్రత్యేక కడాయిలను ఏర్పాటుచేశారు.ఈ అధునాతన స్టౌల వల్ల పోటులో పనిచేసే కార్మికులకు కాస్త ఉపసమనం అభిస్తుందని టీటీడీ చెప్పేమాట. కలప, బొగ్గు, గ్యాస్‌ను వినియోగించి వండటం వల్ల వచ్చే మంటలు జ్వాలల ధాటికి ఆ పరిసరాల్లో పనిచేయడం కష్టం అవుతుంది. దీనికి ప్రత్యమ్నాయంగా ఈ అత్యాధునిక థర్మో ఫ్లూయిడ్ హీటర్లను వినియోగించడం వల్ల కార్మికులకు అంత ఇబ్బందిగా ఉండదని చెబుతోంది దేవస్థానం. మనుషులు అవసరం లేకుండానే రోజుకు 5లక్షల లడ్డూలను తయారు చేయడం దీని ప్రత్యేకతగా చెబుతున్నారు అధికారులు. లడ్డూల తయారీ పూర్తిగా ఆటోమిషన్ చేయడానికి సుమారు 50కోట్ల రూపాయలతో నూతన ప్రాజెక్ట్ చేపట్టబోతుందని ఈవో ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ కు రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ పూర్తి సహకారం అందించనున్నట్లు తెలిపారు.
ఆధునాతన లడ్డూ తయారీ విధానం..
ఈసరికొత్త విధానంతో బూందీ పోటులో మనుషులు లేకుండానే బూందీ లడ్డూ తయారవుతుంది. ముందుగా శనగపిండితోపాటూ ఇతర ముడిపదార్థాలు ఆటోమిషన్ బూందీపోటులోకి పంపుతారు. శనగపిండి మిశ్రమాన్ని బొట్టు బొట్టుగా కాగుతున్న నెయ్యి కడాయిలో వేస్తుంది మిషన్. బాగా వేగి బూందీగా మారిన శనగపిండిని.. ఈ మిషన్ కాగుతున్న నెయ్యి నుంచి వేరుచేస్తుంది. ఈ వేరు చేసిన మిశ్రమానికి జీడిపప్పు, కిస్మిస్, బాదాంపప్పులను వేరొక మిషన్ కలుపుతుంది. ఇలా బాగా కలిపిన తరువాత లడ్డూలు కట్టేందుకు బూందీపోటులోకి పంపుతుంది. తగినంత మోతాదులో ఈ మిశ్రమాన్ని కలపడంతో పోటులో పనిచేసే సిబ్బందికి మరింత సులువుగా లడ్డూలను తయారు చేసే వీలుంటుంది. ప్రస్తుతం సిబ్బంది ద్వారా 3-4లక్షల లడ్డూలను మాత్రమే చేస్తుంది టీటీడీ. అదే ఈ ఆటోమేటిక్ మిషన్ అందుబాటులోకి వస్తే ప్రత్యేక పర్వదినాల్లో కూడా ఎంతమంది భక్తులు వచ్చినా అందరికీ లడ్డూలను ఇచ్చేందుకు వీలుగా ఉంటుందన్న ఉద్దేశ్యంతో ఈ ప్రణాళికలకు శ్రీకారం చుట్టినట్లు బయటకు చెబుతున్నప్పటికీ దీనివెనుక ఉన్న మరో కోణం ఉందంటున్నారు కొందరు.
చాలా ప్రశ్నలు-సందేహాలు..
ఇలా అన్నింటినీ క్రమక్రమంగా ప్రైవేట్ సంస్ధలకు అప్పజెప్పడం వల్ల టీటీడీకి ఎంత ఉపయోగకరమో తెలియదుగానీ.. ఇప్పుడే లడ్డూ పరిమాణం తగ్గిందని, రుచి ఉండటం లేదని అంటున్న వారికి తీవ్ర నిరాశ తప్పదు. పైగా లడ్డూ పవిత్రత దెబ్బతింటుందనే భక్తులు ఉన్నారు.అన్నింటికన్నా ముఖ్యమైన అంశం యంత్రాల ద్వారా లడ్డూలు చేస్తే ఇక లడ్డూలను చేసే కార్మికుల ఉద్యోగాల సంగతేంటి.? వీరికి ఉపాధి ఉండనుందా.? ఊడనుందా.? భవిష్యత్తులో లడ్డూ ధర స్థిరంగా కొనసాగుతుందా.? లేక విరివిగా పెంచేస్తుందా.? ఇలా పెంచకుండా ఎలాంటి చర్యలు చేపట్టనున్నారు ఉన్నతాధికారులు.? వీటన్నింటికీ తిరుమల తిరుపతి దేవస్థానం సమాధానం ఇస్తుందా.? లేక తాను సంకల్పించిన పనిని చేసుకుంటూ ముందుకు వెళుతుందా అనేది ఆసక్తికరమైన అంశం.
T.V.SRIKAR