Top Stories: న్యూ ఇయర్ రిజల్యూషన్స్…! అమలు చేస్తారా… అటకెక్కిస్తారా…?
కొత్త ఏడాదిలోకి వచ్చేశాం కదా... మీ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి...? మరి సరికొత్త ఏడాదిలో మీరు తీసుకున్న సరికొత్త నిర్ణయాలు ఎంతకాలం పాటిస్తారు...? నిజంగా కొత్త నిర్ణయాలు తీసుకున్నారా లేక గతేడాది వాటికే కొత్తరంగు పూసి ఇకనుంచైనా అంటూ మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారా...?

కొత్త ఏడాదిలోకి వచ్చేశాం కదా… మీ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి…? మరి సరికొత్త ఏడాదిలో మీరు తీసుకున్న సరికొత్త నిర్ణయాలు ఎంతకాలం పాటిస్తారు…? నిజంగా కొత్త నిర్ణయాలు తీసుకున్నారా లేక గతేడాది వాటికే కొత్తరంగు పూసి ఇకనుంచైనా అంటూ మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారా…?
2025లో సరికొత్త నన్ను చూడబోతున్నావ్… ఈ ఏడాది డ్రింక్ మానేస్తున్నా మామా..! ఇదే లాస్ట్ సిగరెట్ బావా…! ఇక చూడు నా ఫిట్‌నెస్ ఎలా పెంచుతానో….! రోజూ వాకింగ్ వెళ్లాలని డెసిషన్ తీసుకున్నా…రేపట్నుంచే నడిచేస్తా… ఈ ఏడాది వృథాఖర్చులు తగ్గిస్తా… కొత్త ఏడాదిలో పుస్తకం పట్టుకుని ఇరగదీయాల్సిందే… ఆఫీస్‌కు ఒక్కరోజు కూడా ఆలస్యంగా రాను… ఇవండీ మనవాళ్ల సరికొత్త రిజల్యూషన్స్… మీ ఫ్రెండ్స్‌లో చాలామంది మీకు ఇలా చెప్పే ఉంటారు. అఫ్‌కోర్స్ మీలో చాలామంది కూడా ఇలాంటి శపథాలే మీ ఫ్రెండ్స్ ముందో లేకపోతే మీలో మీరో చేసేసుకునో ఉంటారు. నిజమే ఎందుకంటే మనల్ని మనం మార్చుకోవాలని చాలామందిమి అనుకుంటాం. కొత్త ఏడాది తొలిరోజు నుంచే ఆ దిశగా అడుగులు వేస్తాం. కానీ విచిత్రమేమిటంటే ఓ వారం వరకు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాం… తర్వాత నిగ్రహం సడలిపోతుంది. నెలదాటేసరికి రిజల్యూషన్స్ కంచికి…. బద్దకం మళ్లీ మన ఒంటికి…మళ్లీ అంతా మామూలే…
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది తీసుకునే టాప్10న్యూఇయర్ రెజల్యూషన్స్ ఏంటో తెలుసా….
1). రోజూ ఉదయం 5గంటలకే లేవడం
2). ఆరోగ్యకరమైన ఆహారం తినడం..నాన్‌వెజ్‌ను తగ్గించడం
3). బరువు తగ్గడం
4). డబ్బు ఆదా చేయడం
5). సిగరెట్లు మానేయడం
6). మందు మానేయడం లేదా తగ్గించడం
7). కొత్త స్కిల్ నేర్చుకోవడం
8). కుటుంబంతో ఎక్కువ టైమ్ గడపడం
9). ఫోన్ చూసే టైమ్ తగ్గించడం
10). పుస్తకాలు చదవడం
వీటిలో మీ రిజల్యూషన్స్‌లో ఎన్నున్నాయో చూసుకోండి… ఒకటో రెండో ఉంటాయి కదా.. ఎక్కువున్నా ఆశ్చర్యం లేదు… కానీ 2024 జనవరి1కి ముందు మీరు తీసుకున్న రిజల్యూషన్స్ గుర్తుకు తెచ్చుకోండి. అవీ ఇవే కదా…. నిజమే మనలో 99శాతం మంది తాము తీసుకున్న కొత్త ఏడాది కమిట్ మెంట్స్‌కు కట్టుబడి ఉండరని సర్వేలు చెబుతున్నాయి. ఇది మేం చెబుతున్నది కాదు… సర్వేలు చెప్పిన చిత్రాలు ఇవి. మీకు ఇంకో విచిత్రం తెలుసా డిసెంబర్ 31రోజు రాత్రి వరకు పీతల్లా తాగేసి పడిపోతాం. ఎందుకంటే 1నుంచి అసలు గ్లాసు పట్టుకోకూడదని అనుకుంటాం. అందుకని ఇదే చివరిది ఇదే చివరిది అంటూ తెగ తాగేస్తాం… ఈ న్యూఇయర్ రిజల్యూషన్స్ వల్లే జనవరిలో మందు సేల్స్ తగ్గుతాయట. మన దగ్గర మాత్రమే కాదు ప్రపంచమంతా ఇదే ట్రెండ్, గత కొన్నేళ్లుగా లెక్కలు తీస్తే ప్రతి ఏటా జనవరిలో మందు అమ్మకాలు భారీగా పడిపోతాయి. మళ్లీ ఫిబ్రవరి నుంచి మామూలే. అంటే జనవరి డ్రై మంత్ అన్నమాట. దీనికి కారణం కొత్త ఏడాదిలో మందు తగ్గించాలని మన ట్యాక్స్ పేయర్స్ అదేనండి మందుబాబులు మంగమ్మ శపథాలు చేయడమేనన్న మాట. మొదటి వారం రోజులు కాస్త గట్టిగానే ఉంటారట. ఆ తర్వాత మళ్లీ మందు గ్లాసు మన చేతికి వచ్చేస్తుంది. ఈ ఒక్కసారికే అనుకుంటారు. మళ్లీ రెండు మూడు రోజులు దాని జోలికి వెళ్లరు. కానీ అది మందు కదా… రా రా రమ్మని పిలుస్తుంటే ఆగలేరు. నెల గడిచేసరికి మనలో మనం చేసుకున్న శపథాలు, ఇంట్లో వాళ్లకి చేసిన ప్రామిస్‌లు అన్నీ గట్టెక్కేస్తాయి. ఆ తర్వాతి నెల నుంచి మందు మళ్లీ ముందుకొస్తుంది.
రీసెర్చ్ ప్రకారం మనల్ని మనం చేసుకునే మరో మోసం బరువు తగ్గడం. కొత్త ఏడాదిలో మనల్ని మనం ఫిట్‌గా ఉంచుకోవాలని ప్రతి వందమందిలో దాదాపు 80మంది అనుకుంటారట. అందుకే వర్కౌట్ ప్లాన్ ఛార్ట్‌లు రెడీ అయిపోతాయి. ఇంట్లోకి మిల్లెట్స్ వచ్చేస్తాయి. ఎక్సర్‌సైజ్ కోసం కొత్త డ్రస్సులు, బ్యాండ్స్, షూస్‌తో రెడీ అయిపోతారు. ప్రతి ఏటా జనవరిలో ఫిట్‌నెస్ సెంటర్లకు సబ్‌స్క్రిప్షన్స్ భారీగా పెరుగుతాయట. చలిని కూడా లెక్కచేయకుండా రోడ్డెక్కేసి చెమటలు కక్కేస్తారు. ఫిబ్రవరిలోనూ కాస్త పర్లేదు. మళ్లీ మార్చి నుంచి మామూలే. కొత్త ఏడాది మొదటి నెలలో జిమ్ ఎక్విప్‌మెంట్ అమ్మకాలు కూడా కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఇక యూత్ తీసుకునే మరో నిర్ణయం కొత్త భాష నేర్చుకోవడం, ఇంగ్లీష్‌లో ఫ్లూయన్సీ సాధించడం. అందుకే డ్యూలింగో లాంటి లాంగ్వేజ్ యాప్స్‌కు జనవరిలోనే మంచి డిమాండ్ ఉంటుంది. ఇక పర్సనల్ ఫైనాన్స్ యాప్స్‌కు కూడా ఈ మంత్‌లోనే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనోళ్లు ఈ ఏడాది పక్కాగా మన సేవింగ్స్ ప్లాన్ చేయాలనుకుంటారు. తర్వాత అవన్నీ అటకెక్కాల్సిందే. కొత్త ఏడాది వరకు అవేమీ గుర్తురావు.
కొత్త ఏడాది తీర్మానాలు మనకు కొత్త కాదు… మార్పుతో పనిచేయాలన్న మన మాటలు నీటిమీద మూటలే. కానీ కాస్త గట్టిగా ప్రయత్నిస్తే ఈ నిర్ణయాలు మన జీవితాన్ని మార్చేస్తాయన్నది మానసిక నిపుణులు చెబుతున్న మాట. రెండు నెలల పాటు ఏదైనా ఓ రిజల్యూషన్‌ను ఎన్ని కష్టాలు ఎదురైనా పాటిస్తే ఇక అది మనకు అలవాటైపోతుందని అంటున్నారు. మనం విన్నరా లేక లూజరా అన్నది ఇదే డిసైడ్ చేస్తుంది. అనుకున్న 10 అమలు చేయాల్సిన పనిలేదు. కానీ ఒకటిరెండైనా పర్‌ఫెక్ట్‌గా ప్లాన్ చేస్తే లైఫ్ అదిరిపోతుంది. ఒక్కటి ఇప్పుడు అమలు చేస్తే రానున్న రోజుల్లో నాలుగింటిని అమలు చేయవచ్చు. అలా కాదని బద్దకిస్తే జీవితం అక్కడే ఆగిపోతుంది.