TTD: చిరుత దాడి ఘటనతో తిరుమలలో కొత్త రూల్స్.. భక్తులకు అలర్ట్..!

భక్తుల నడక విషయంలో ఆంక్షలు విధించింది. అలిపిరి నడకమార్గంలో మధ్యాహ్నం రెండు గంటల తర్వాత నుంచి పదిహేనేళ్లలోపు పిల్లలను అనుమతించరు. అలాగే సాయంత్రం తర్వాత కూడా నడకమార్గంలో వెళ్లేవారిపై ఆంక్షలు విధించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 13, 2023 | 03:57 PMLast Updated on: Sep 01, 2023 | 12:27 PM

Ttd Restriction On Children In Aipiri Nadaka Dhari

TTD: తిరుమల నడకదారిలో బాలికను చిరుత చంపిన ఘటనతో టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) బోర్డు అప్రమత్తమైంది. నడకదారిలో వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయాలు తీసుకుంది. అలిపిరి నడకమార్గంలో వెళ్లే భక్తుల రక్షణ కోసం తాజా నిర్ణయాలు తీసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది. భక్తుల నడక విషయంలో ఆంక్షలు విధించింది. అలిపిరి నడకమార్గంలో మధ్యాహ్నం రెండు గంటల తర్వాత నుంచి పదిహేనేళ్లలోపు పిల్లలను అనుమతించరు.

అలాగే సాయంత్రం తర్వాత కూడా నడకమార్గంలో వెళ్లేవారిపై ఆంక్షలు విధించింది. ఏడో మైలు నుంచి శ్రీ నృసింహాలయం వరకూ హై అలర్ట్ జోన్‌గా ప్రకటించింది. భక్తులకు ముందు, వెనుక వైపు తాళ్లు ఏర్పాటు చేస్తారు. హై అలర్ట్ ప్రకటించిన మార్గంలో సాయంత్రం ఆరు గంటల తర్వాత నుంచి 100 మంది భక్తులు ఉంటేనే అనుమతిస్తారు. అది కూడా గుంపులుగానే వెళ్లాల్సి ఉంటుంది. వంద మంది భక్తులు కలిపి 7వ మైలు నుంచి శ్రీ నృసింహ స్వామి వారి ఆలయం వరకు పంపుతారు. అలాగే భక్తలకు పూర్తి రక్షణ ఉండేలా.. భక్తుల ముందు, భక్తుల వెనుక భాగంలో పోలీసులు భద్రతగా వస్తారు. భక్తులు వారి భద్రతదృష్ట్యా ఈ రూల్స్ కచ్చితంగా ఫాలో అవ్వాలి. అలాగే తల్లిదండ్రులు కూడా నడకదారిలో వచ్చే తమ పిల్లల విష‍యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏడో మైలు వద్ద 15 ఏళ్లలోపు చిన్నారులకు పోలీసులు ట్యాగ్స్ ఇస్తారు.

ఈ ట్యాగ్స్ చిన్నారులు చేతికి ధరించాలి. ఇవి చేతికి ఉండటం వల్ల చిన్నారులు తప్పిపోతే వారిని వెంటనే గుర్తించే అవకాశం ఉంది. ఈ ట్యాగ్స్‌పై చిన్నారుల తల్లిదండ్రుల పేర్లు, ఫోన్ నెంబర్లు, టోల్ ఫ్రీ నెంబర్లు వంటివి ఉంటాయి. భద్రతగా పోలీసులు కూడా ఉంటారు. మరోవైపు చిన్నారి మృతికి కారణమైన చిరుతను బంధించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. చిరుత సంచరించే ప్రాంతంలో బోనులు ఏర్పాటు చేసింది. భక్తులకు భద్రత కల్పించేందకు టీటీడీ ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. నడక దారిలో ప్రతి పది మీటర్లకు ఒక సెక్యూరిటీ గార్డును నియమించాలని భావిస్తోంది. అడవి జంతువులు సంచరించే ప్రాంతంలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. పగటిపూట డ్రోన్ కెమెరాలతో భద్రత పర్యవేక్షించబోతున్నారు.