Twitter Logo: బుల్లిపిట్ట ఎగిరిపోయే.. బొచ్చుకూన వచ్చి చేరే..!
ట్విట్టర్ ఐడెంటిటీ మారిపోయింది. ఇన్నాళ్లూ బ్లూ కలర్ బుల్లిపిట్ట ట్విట్టర్ లోగోగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ బుల్లి పిట్టను తరిమేసి బొచ్చు కుక్కపిల్ల ఆ స్థానంలోకి వచ్చి చేరింది. క్రిప్టో కరెన్సీ డాగ్‌కాయిన్ సింబల్‌గా ఉన్న కుక్క పిల్లను కొత్త లోగోగా తీసుకొచ్చేశారు ట్విట్టర్..
ఉదయాన్నే లేచి ట్విట్టర్ (Twitter) ఎకౌంట్ ఓపెన్ చేసిన వారికి బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk).. ఎప్పుడూ కనిపించే బుల్లిపిట్ట లోగో కనిపించలేదు. ఆ స్థానంలో చిన్న కుక్కపిల్ల (Dog) హాయ్ అంటూ పలకరిస్తోంది. అసలు తాము ట్విట్టరే ఓపెన్ చేశామా అని ఓ క్షణం కన్ఫ్యూజన్‌కు గురవుతున్నారు. ట్విట్టర్ ప్రారంభం నుంచి ఉన్న ఈ బుల్లి పిట్ట మస్క్ చేతిలోకి వచ్చాక ఇమడలేక ఎగిరిపోయినట్లుంది. జపనీస్ డాగ్ బ్రీడ్ షిబా ఇనుగాను (Shiba Inuga) పోలి ఉన్న కుక్కపిల్ల ప్రస్తుతం ట్విట్టర్ లోగోగా దర్శనం ఇస్తోంది. అయితే మొబైల్ యాప్‌లో మాత్రం ఇంకా బ్లూ బర్డ్ (Blue Bird) మాత్రమే కనిపిస్తోంది. కేవలం డెస్క్‌టాప్ వర్షన్‌లో మాత్రమే కుక్కపిల్ల కనిపిస్తోంది. నిజానికి ఈ కుక్కపిల్ల డాగ్ కాయిన్ సింబల్‌గా ఉండేది. 2013లో బిట్‌కాయిన్ (Bitcoin) సహా ఇతర క్రిప్టో కరెన్సీలను (Crypto Currency) వెక్కిరిస్తూ దీన్ని తీసుకువచ్చారు. ఓ జోక్‌గా వచ్చిన ఈ డాగ్‌కాయిన్ తర్వాత అదే క్రిప్టో కరెన్సీగా స్థిరపడిపోయింది.
లోగో మార్పుపై మస్క్ ట్వీట్ కూడా చేశారు. గతేడాది మార్చి 26న ఓ ట్విట్టర్ యూజర్ మస్క్‌కు ట్వీట్ చేస్తూ… వెంటనే ట్విట్టర్‌ను కొని వెంటనే దాని బ్లూబర్డ్ లోగోను డాగ్ సింబల్‌తో మార్చేయాలని సూచించారు. దానిపై అప్పుడు కాస్త సరదాగా స్పందించిన మస్క్ ఇప్పుడు దాన్ని నిజం చేశారు. ఆ ట్విట్టర్ సంభాషణ స్క్రీన్ షాట్‌ను ఇప్పుడు షేర్ చేశారు. యాజ్ ప్రామిస్డ్ (As promised) అంటూ కామెంట్ పెట్టారు. అంతేకాదు మరో ఫోటోను కూడా షేర్ చేశారు. కారు డ్రైవింగ్ సీటులో కూర్చున్న కుక్కపిల్ల తన ట్రాఫిక్ లైసెన్స్‌ను పోలీసుకు చూపిస్తున్నట్లుగా ఆ ఫోటో ఉంది. అందులో బుల్లిపిట్ట ఫోటోను చూస్తున్న అధికారితో అది నా పాత పోటో అంటూ సమాధానం ఇస్తున్నట్లుగా ఉంది. దీంతో ట్విట్టర్ లోగో మారిపోయినట్లు స్పష్టమైంది. ఇటీవలే ఓ కుక్క సీఈఓ షర్ట్ వేసుకుని కుర్చీలో కూర్చున్న ఫోటోను పోస్ట్ చేసిన ఆయన… ట్విట్టర్ కొత్త సీఈఓ అమేజింగ్ అంటూ కామెంట్ పెట్టారు. అయితే దాన్నే లోగోగా చేస్తారని ఎవరూ ఊహించలేదు.
నిజానికి డాగ్ మీమ్‌కు మస్క్ సూపర్ ఫ్యాన్. డాగ్ కాయిన్‌ను ఆయన బాగా ప్రమోట్ చేశారు. మస్క్ ఎప్పుడైతే డాగ్ కాయిన్ సింబల్‌ను ట్విట్టర్ లోగోగా మార్చేశారో వెంటనే డాగ్ కాయిన్ విలువ పెరిగిపోయింది. ఏకంగా ఒక్క రాత్రిలో 30శాతానికి పైగా పెరిగిపోయింది. అయితే డాగ్‌కాయిన్ విషయంలో మస్క్‌పై ఓ కేసు కూడా నడుస్తోంది. డాగ్ కాయిన్‌ను సపోర్ట్ చేస్తూ పిరమిడ్ స్కీమ్ తీసుకొచ్చారన్న ఆరోపణలున్నాయి. రెండేళ్లలో దాని విలువ ఏకంగా 36వేల రెట్లు పెంచి ఆ తర్వాత అది పతనమయ్యేలా చేసారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.
గతేడాది ట్విట్టర్‌ను తీవ్ర ఉత్కంఠ పరిణామాల మధ్య మస్క్ కొనుగోలు చేశారు. ఆ తర్వాత పలు కీలక మార్పులు చేపట్టారు. వేల మంది ఉద్యోగులను తొలగించారు. కొత్తగా వెరిఫికేషన్ టిక్‌లకు సబ్‌క్రిప్షన్ తీసుకొచ్చారు. నెలనెలా డబ్బులు చెల్లిస్తేనే వెరిఫికేషన్ టిక్ అన్నారు. ఇప్పుడు ఏకంగా లోగోనే మార్చేశారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. లోగో మార్పును సూచిస్తూ రకరకాల ఫోటోలు ట్వీట్ చేస్తున్నారు. మొత్తానికి మస్క్ దెబ్బకు ట్విట్టర్ స్వరూపమే మారిపోతోంది.