Grooming Gangs: గ్రూమింగ్ గ్యాంగ్స్ అంటే ఏంటి? ఎందుకు ఉక్కుపాదం మోపాలి?

బ్రిటన్‌ వాసుల్ని వణికించే గ్రూమింగ్ గ్యాంగ్స్‌పై అక్కడి ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతోంది. వీటిని అణచివేసేందుకు రిషి సునాక్ ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఇకపై దేశంలో గ్రూమింగ్ గ్యాంగ్స్ ఆకృత్యాలు సాగబోవు అంటూ రిషి సునాక్ హెచ్చరించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 5, 2023 | 08:08 PMLast Updated on: Apr 06, 2023 | 12:17 PM

Uk Government Vows Action Against Grooming Gangs Rishi Sunak Orders To Form Taskforce

Grooming Gangs: బ్రిటన్‌లో ఆడపిల్లల తల్లిదండ్రుల్లో వణుకు పుట్టించేవి గ్రూమింగ్ గ్యాంగ్స్. తమ పిల్లలు ఈ గ్యాంగ్స్ బారిన ఎక్కడ పడతారో అని వాళ్ల ఆందోళన. ఎందుకంటే ఈ గ్యాంగ్స్ బారిన పడ్డ ఆడపిల్లల జీవితాలు చాలా వరకు నాశనమవుతాయి. ముఖ్యంగా టీనేజ్, యుక్త వయసు అమ్మాయిలు ఈ గ్యాంగ్స్ బారిన పడుతున్నారు. ఇలాంటి గ్రూమింగ్ గ్యాంగ్స్‌పై ఇప్పుడు బ్రిటన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపబోతుంది. వీటిని అణచివేసేందుకు రిషి సునాక్ ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఇకపై దేశంలో గ్రూమింగ్ గ్యాంగ్స్ ఆకృత్యాలు సాగబోవు అంటూ రిషి సునాక్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్‌ అంశం ఇప్పుడు చర్చకు దారి తీసింది. అయితే.. ఇంతకీ ఏంటా గ్రూమింగ్ గ్యాంగ్స్‌.

ఆకృత్యాలకు కేరాఫ్ అడ్రస్
టీనేజ్ పిల్లలు, యుక్త వయసు వారితో తెలిసిన వాళ్లు లేదా తెలియని వాళ్లు వ్యక్తిగత సంబంధాలు కలిగి ఉండటం, వారి భావోద్వేగాలను వాడుకుంటూ ఇతర అవసరాలకు వినియోగించుకోవడం, లైంగిక అవసరాలకు వాడుకోవడం, వేధింపులకు పాల్పడటాన్ని గ్రూమింగ్ అంటారు. ఈ చర్యలకు పాల్పడే వ్యక్తుల సమూహాన్ని గ్రూమింగ్ గ్యాంగ్స్ అంటారు. బ్రిటన్‌లో కొన్ని దశాబ్దాలుగా గ్రూమింగ్ గ్యాంగ్స్ అరాచకాలు సాగిస్తున్నాయి. ముఖ్యంగా టీనేజ్, యుక్త వయసు ఆడ పిల్లలపై వీరి ఆకృత్యాలు అధికం. ఎవరైనా అమ్మాయి ఈ గ్యాంగ్ వలలో పడిందంటే దాదాపు వారి జీవితం నాశనమైనట్లే. అంతగా వారి జీవితాల్ని ఈ గ్యాంగ్ మార్చేస్తుంది.

ఈ గ్యాంగ్ ఆడ పిల్లల్ని తమ లైంగిక అవసరాల కోసం వాడుకుంటాయి. డ్రగ్స్, చెడు వ్యసనాలకు అలవాటు చేస్తాయి. ఇంకొన్నిసార్లు ఆడ పిల్లల్ని అక్రమ రవాణా కూడా చేస్తాయి. తమ చేతిలో ఉన్న అమ్మాయిల్ని వేరే వాళ్లకు అప్పగిస్తాయి. అందుకే ఈ గ్యాంగ్స్ అంటేనే బ్రిటన్ వాసులు వణికిపోతారు. అమ్మాయిలతో వ్యక్తిగతంగా పరిచయాలు పెంచుకోవడం, ఆన్‌లైన్ ద్వారా తమ వలలో పడేలా చేయడంలో ఈ గ్యాంగ్ మెంబర్స్ సిద్ధహస్తులు. గ్రూమింగ్ గ్యాంగ్స్‌ వలలో పడ్డ అమ్మాయిలు అంత త్వరగా ఈ గ్యాంగ్స్ ప్రభావం నుంచి బయటపడలేరు. ఇప్పటివరకు వేల మంది అమ్మాయిలు ఈ గ్యాంగ్స్ బారిన పడ్డారు.

Grooming Gangs
ఎవరీ గ్యాంగ్ మెంబర్స్
గ్రూమింగ్ గ్యాంగ్ మెంబర్స్ విషయంలో ఇటీవలే బ్రిటన్ మంత్రి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్ పాకిస్తానీలే ఎక్కువగా గ్రూమింగ్ గ్యాంగ్స్‌లో ఉన్నారని మంత్రి ఆరోపించారు. వీళ్లు బ్రిటన్ అమ్మాయిల్ని మచ్చిక చేసుకుని, వారిపై లైంగిక దాడులకు దిగుతున్నారని ఆమె ఆరోపించారు. అందుకే వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బ్రిటన్‌కు చెందిన నేషనల్ సొసైటీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ క్రుయెల్టీ టు చిల్ట్రన్ (ఎన్ఎస్‌పీసీసీ) ప్రకారం గ్రూమింగ్ గ్యాంగ్స్‌లో ఎక్కువగా ఆసియా వాసులే ఉన్నారు. బ్రిటన్ పాకిస్తానీలతోపాటు, ఇతర ఆసియా వాసులే ఎక్కువగా ఉన్నారు. అలాగే కొందరు బ్రిటన్ వాసులు కూడా ఈ చర్యలకు పాల్పడుతున్నారు. అనేక మంది వ్యక్తులు ఇలా ముఠాలుగా ఏర్పడి అమ్మాయిల్ని వలవేసి తమ ముగ్గులోకి దించుతారు.

9170 నుంచి ఉన్నా చర్యలు ఎందుకు లేవు?
ఈ గ్యాంగ్స్ విషయం ఇప్పటిది కాదు. 1970 నాటి నుంచి గ్రూమింగ్ గ్యాంగ్స్‌ ఉన్నాయనేది విశ్లేషకుల మాట. అయితే, అప్పటి నుంచి కూడా ప్రభుత్వాలు ఈ గ్యాంగ్స్ విషయంలో సరిగ్గా స్పందించలేదు. పైగా గ్యాంగ్స్ బారినపడ్డ అమ్మాయిల విషయంలోనే కఠినంగా వ్యవహరించాయి. అమ్మాయిలపై వేశ్యలు అనే ముద్రవేయడం, వారి లైఫ్‌స్టైల్‌ను నిందించడం వంటివి చేశాయి. పైగా గ్రూమింగ్ గ్యాంగ్స్‌ సభ్యులు ఆసియాకు చెందిన వాళ్లు కావడంతో చర్యలు తీసుకుంటే, జాతి ద్వేషానికి కారణమవుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వాలు చూసీచూడనట్లుగా వ్యవహరించాయి. ఈ అంశంలో సరైన దర్యాప్తు జరపలేదు. కొన్ని సందర్భాల్లో బాధిత బాలికల తరఫున ఫిర్యాదులు చేయడానికి కుటుంబ సభ్యులు, సంబంధిత వ్యక్తులు ఆసక్తి చూపలేదు.

దీంతో గ్రూమింగ్ గ్యాంగ్స్‌ ఆకృత్యాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. ఈ గ్యాంగ్స్ మరింతగా రెచ్చిపోయాయి. నిందితుల్లో కొందరు పాకిస్తానీలు ఉండటం.. వారిపై ఫిర్యాదు చేస్తే ఆ దేశానికి సంబంధించిన వారిలో ఆగ్రహానికి కారణమవుతుందనే ఉద్దేశంతో కూడా సరైన చర్యలు తీసుకోలేదు. గ్రూమింగ్ గ్యాంగ్స్‌ విషయంలో చర్యలు తీసుకోకపోవడానికి ప్రధానంగా రాజకీయ అంశాలే కారణం. గ్రూమింగ్ గ్యాంగ్స్‌ ఆకృత్యాల్ని, యువత సంక్షేమాన్ని నాటి ప్రభుత్వాలు విస్మరించాయని అక్కడి నివేదికలు తేల్చాయి. అయితే, 2019 నుంచి ఈ గ్యాంగ్స్ ఆకృత్యాలపై పూర్తి స్థాయి దర్యాప్తు మొదలైంది.

Grooming Gangs
కఠిన చర్యలకు రిషి సునాక్ ఆదేశం
గ్రూమింగ్ గ్యాంగ్స్‌ విషయంలో ఇన్నాళ్లకు రిషి సునాక్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం సరైన రీతిలో స్పందించింది. గ్రూమింగ్ గ్యాంగ్స్‌ను అణచివేసేందుకు ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ టాస్క్‌ఫోర్స్ కోసం ప్రత్యేక అధికారులను నియమిస్తారు. నేషనల్ క్రైమ్ ఏజెన్సీ కూడా టాస్క్‌ఫోర్స్‌తో కలిసి పని చేస్తుంది. ఇకపై అంతా కలిసి గ్రూమింగ్ గ్యాంగ్స్ సభ్యుల వివరాలు సేకరించి, వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. అయితే, నిందితులు సాంస్కృతిక, సున్నితమైన అంశాలను సాకుగా చూపి తప్పించుకోకుండా కఠినంగా వ్యవహరించబోతున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. దీంతో ఇకనైనా గ్రూమింగ్ గ్యాంగ్స్ ఆగడాలు ఆగిపోతాయని బ్రిటన్ వాసులు భావిస్తున్నారు.