Nitin Gadkari: డీజిల్ వాహనాలకు పన్ను పోటు.. పది శాతం పొల్యూషన్ ట్యాక్స్..!
పది శాతం పొల్యూషన్ ట్యాక్స్ విధించిన తర్వాత డీజిల్ వాహనాల అమ్మకాలు తగ్గుతాయి. వీటిని విక్రయించడం తయారీ దారులకు కూడా కష్టమవుతుందని ఆయన తెలిపారు. ఇప్పటికే విధిస్తున్న పన్నుపై అదనంగా ఈ పొల్యూషన్ ట్యాక్స్ ఉండనుంది.
Nitin Gadkari: కాలుష్యాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. డీజిల్ వాహనాలపై త్వరలో పది శాతం కాలుష్య పన్ను విధించబోతున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడంచారు. డీజిల్ కార్లు, వాహనాలతోపాటు, జనరేటర్లపై కూడా పది శాతం పొల్యూషన్ ట్యాక్స్ విధించబోతున్నట్లు చెప్పారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. వాయు కాలుష్యాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
పది శాతం పొల్యూషన్ ట్యాక్స్ విధించిన తర్వాత డీజిల్ వాహనాల అమ్మకాలు తగ్గుతాయి. వీటిని విక్రయించడం తయారీ దారులకు కూడా కష్టమవుతుందని ఆయన తెలిపారు. ఇప్పటికే విధిస్తున్న పన్నుపై అదనంగా ఈ పొల్యూషన్ ట్యాక్స్ ఉండనుంది. అంటే పన్నుల భారం మరింత పెరుగుతుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు దీనిపై ప్రతిపాదన పంపనున్నట్లు గడ్కరీ చెప్పారు. డీజిల్ వాహన తయారీదారులకే గడ్కరీ కీలక సూచనలు చేశారు. డీజిల్ వాహనాల తయారీని ఆటోమొబైల్ సంస్థలు తగ్గించాలని కోరారు. వాహన తయారీ సంస్థలు డీజిల్ వాహనాల తయారీని తగ్గించకుంటే, తాము పన్నులు పెంచుతామని హెచ్చరించారు. అప్పుడు ఆ వాహనాల ధరలు పెరిగి, విక్రయాలు చేయడం కష్టమవుతుందన్నారు. పెట్రోల్, ఇతర ఇంధన వాహనాలతో పోలిస్తే డీజిల్ వాహనాలతో కాలుష్యం ఎక్కువగా వెలువడుతుంది. డీజిల్ వాడకం పర్యావరణానికి హాని కలిగిస్తుంది. అందువల్ల డీజిల్ వాహనాల తయారీని సంస్థలు ఆపేయాలని, ఇప్పటికే చాలా కంపెనీలు వీటి తయారీని తగ్గించాయని గడ్కరీ వెల్లడించారు. డీజిల్ వాహనాల దిగుమతులు కూడా కొంతకాలంగా తగ్గాయన్నారు. వాహన తయారీ సంస్థలు పర్యావరణ హితమైన వాహనాలపై దృష్టి పెట్టాలని సూచించారు. వాహనాలతోపాటు డీజిల్‌తో నడిచే జనరేటర్లపై కూడా అదనపు సుంకం విధించబోతున్నట్లు తెలిపారు.
గడ్కరీ ప్రతిపాదనలతో వాహన తయారీ సంస్థల షేర్లు తగ్గుముఖం పట్టాయి. మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, అశోక్ లేలాండ్ సంస్థల షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 2.5 నుంచి 4 శాతం షేర్లు పడిపోయాయి. నిజానికి చాలా కంపెనీలు ఎప్పటినుంచో డీజిల్ వాహనాల తగ్గింపు చర్యలు ప్రారంభించాయి. మారుతి సుజుకీ, హోండా వంటి కంపెనీలు ప్రయాణికులకు సంబంధించి వినియోగించే డీజిల్ వాహనాల ఉత్పత్తిని ఎప్పుడో ఆపేశాయి. సరుకు రవాణాకు వినియోగించే కమర్షియల్ వాహనాల్ని మాత్రమే డీజిల్ వెర్షన్‌లో తయారు చేస్తున్నాయి. కార్లు వంటి వాటిని పెట్రోల్ వెర్షన్‌లోనే రూపొందిస్తున్నాయి. ప్రస్తుతం డీజిల్ వాహనాలపై 28 శాతం వరకు జీఎస్టీ విధిస్తున్నారు. వీటికి అదనంగా సెస్ కూడా విధిస్తున్నారు. వాహనం రకాన్నిబట్టి 1 శాతం నుంచి 22 శాతం వరకు సెస్ విధిస్తున్నారు. ఎస్‌యూవీలకు అత్యధికంగా 28 శాతం జీఎస్టీ, 22 శాతం సెస్ అమలవుతోంది. అందుకే వీటి ధరలు ఎక్కువగా ఉంటాయి.