Shri Krishna: శ్రీకృష్ణుడి గురించి మీకు తెలియని రహస్యాలు..

శ్రీకృష్ణుడి జీవితం చదివినా, తెలుసుకున్నా.. ఆయన జీవితాన్ని అర్థం చేసుకున్నా.. మన బతుకులను దారిలో పెట్టుకున్నట్లే..! 5వేల 252 ఏళ్ల కింద.. అంటే క్రీస్తు పూర్వం 3228వ సంవత్సరం ఏడో నెల 18వ తేదీన శ్రీకృష్ణుడు జన్మించాడు. శ్రావణ మాసం, అష్టమి తిధి, రోహిణీ నక్షత్రం, బుధవారం.. సరిగ్గా అర్ధరాత్రి 12గంటలకు కన్నయ్య జన్మించాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 7, 2023 | 04:08 PMLast Updated on: Sep 07, 2023 | 4:09 PM

Unknown Facts About Lord Shri Krishna And His Life

Shri Krishna: శ్రీకృష్ణుడు.. బతుకు నేర్పిన దేవుడు. కృష్ణయ్య కొండంత దేవుడు. కొండనే ఎత్తిన దేవుడు. దేవుడైనా యుద్ధం ఆపలేడు అంటారు. కానీ, ఈ దేవుడు చేయించిన యుద్ధం మానవాళికి పాఠాలు నేర్పింది. కృష్ణయ్య ప్రతీ కదలిక.. లీలలో భాగం. బతుకడం.. బతికించడం నేర్పాడు. ఒక యుద్ధం నుంచి మ‌రో యుద్ధం వ‌ర‌కూ మ‌నుషులు తెలుసుకోవాల్సిన పాఠాలు ఎన్నో నేర్పాడు కృష్ణయ్య. ఏ ఓటమి అంతిమం కానప్పుడు.. గెలుపు ఎలా అంతిమం అని గీతాసారంతో ప్రశ్నించాడు. ఆయన చెప్పిన ధర్మం మతం కాదు.. మన జీవితం..! అలాంటి శ్రీకృష్ణుడి జీవితం చదివినా, తెలుసుకున్నా.. ఆయన జీవితాన్ని అర్థం చేసుకున్నా.. మన బతుకులను దారిలో పెట్టుకున్నట్లే..!

5వేల 252 ఏళ్ల కింద.. అంటే క్రీస్తు పూర్వం 3228వ సంవత్సరం ఏడో నెల 18వ తేదీన శ్రీకృష్ణుడు జన్మించాడు. శ్రావణ మాసం, అష్టమి తిధి, రోహిణీ నక్షత్రం, బుధవారం.. సరిగ్గా అర్ధరాత్రి 12గంటలకు కన్నయ్య జన్మించాడు. 125 సంవత్సరాల 8 నెలల 7 రోజులు భూమిపై తన అవతారం కొనసాగించిన కృష్ణయ్య.. క్రీస్తు పూర్వం 3వేల 102వ సంవత్సరం, రెండవ నెల 18వ తేదీన నిర్యాణం చెందారు. అంటే అవతారం చాలించారు. శ్రీకృష్ణుని 89వ ఏట కురుక్షేత్రం జరిగింది. కురుక్షేత్ర యుద్ధం జరిగిన 36 ఏళ్ల తర్వాత కృష్ణుడు నిర్యాణం చెందాడు. శ్రీకృష్ణుడిని వివిధ ప్రాంతాల్లో రకరకాల పేర్లతో పూజిస్తారు. మధురలో కన్నయ్య అంటారు. ఒడిశాలో జగన్నాథుడిగా పూజిస్తారు. మహారాష్ట్రలో విఠలుడిగా.. రాజస్తాన్‌లో శ్రీనాథుడిగా.. గుజరాత్‌లో ద్వారకాదీసుడిగా, కర్ణాటక, తెలుగు రాష్ట్రాల్లో కృష్ణుడిగా పూజిస్తారు. కన్నయ్యకు జన్మనిచ్చిన తల్లి దేవకి, తండ్రి వసుదేవుడు. పెంచిన తండ్రి నందుడు, పెంచిన తల్లి యశోద. సోదరుడు బలరాముడు, సోదరి సుభద్ర. శ్రీకృష్ణుడి జన్మస్థలం మధుర. నల్లనయ్యకు 8మంది భార్యలు. రుక్మిణీ, సత్యభామ, జాంబవతీ, కాళింది, మిత్రవింద, నగ్నజితి, భద్ర, లక్ష్మణతో జీవితం పంచుకున్నాడు.

తన జీవితంలో కృష్ణుడు కేవలం నలుగురిని మాత్రమే హతమార్చాడు. కుస్తీగదారు అయిన చాణురను, మేనమామ అయిన కంసుడిని, అత్తకొడుకులు శిశుపాలుడు, దంతవక్రను శ్రీకృష్ణుడు హతమార్చాడు. శ్రీకృష్ణుని జీవితం కష్టాలమయం. తల్లి ఉగ్ర వంశమునకు, తండ్రి యాదవ వంశమునకు చెందిన వారు. దట్టమైన నీలపు రంగు కలిగిన శరీరంతో శ్రీకృష్ణుడు జన్మించాడు. గోకులమంతా నల్లనయ్య, కన్నయ్య అని పిలిచేవారు. నల్లగా పొట్టిగా ఉన్నాడని, పెంచుకున్నారని శ్రీకృష్ణుడిని అందరూ ఆటపట్టిస్తూ, అవమానిస్తూ ఉండేవారు. కన్నయ్య బాల్యం అంతా జీవన్మరణ పోరాటాలతో సాగింది. కరువు, ఇంకా అడవి తోడేళ్ల ముప్పు కారణంగా.. 9ఏళ్ల వయసులో గోకులం నుంచి బృందావనంకి మారాడు. 16 ఏళ్ల వయసు వరకు బృందావనంలో ఉన్నాడు. 16 ఏళ్ల వయసులో మధురలో మేనమామ కంసుడిని చంపి.. కన్న తల్లిదండ్రులకు చెరసాల నుంచి విముక్తి కలిగించాడు. ఇక ఆ తర్వాత ఎప్పుడూ మళ్లీ బృందావనం తిరిగి రాలేదు.

ఆ తర్వాత కాలయవన అను సింధు రాజు నుంచి ముప్పు పొంచి ఉండడంతో.. మధుర నుంచి ద్వారక వలస వెళ్లాల్సి వచ్చింది. వైనతేయ తెగకు చెందిన ఆటవికుల సాయంతో గోమంతక కొండ దగ్గర.. ఇప్పటి గోవాలో జరాసందుడిని ఓడించాడు. గుజరాత్‌లో ప్రభాస అనే సముద్ర తీరం దగ్గర ఆఫ్రికా సముద్రపు దొంగలతో యుద్ధం చేసి.. అపహరణకు గురైన తన ఆచార్యుడి కుమారుడిని కాపాడాడు. తన విద్యాభ్యాసం తర్వాత.. పాండవుల వనవాసం గురించి తెలుసుకొని.. వారిని లక్క ఇంటి నుంచి కాపాడి.. తర్వాత తన సోదరి అయిన ద్రౌపదిని పాండవులకు ఇచ్చి పెండ్లి చేశాడు. పాండవులు ఇంద్రప్రస్థ నగరం ఏర్పాటు చేసి రాజ్యం స్థాపించారు. ఐతే ఆ తర్వాత ద్రౌపదిని వస్త్రాపహరణం నుంచి కాపాడాడు. పాచిక ఆటలో ఓడి రాజ్యము నుంచి పాండవులను పంపించినప్పుడు.. కృష్ణుడు వారికి తోడుగా నిలిచాడు. పాండవుల వైపు ఉండి కురుక్షేత్ర యుద్ధంలో వారికి విజయం చేకూరేలా పావులు కదిపాడు.

కురుక్షేత్ర యుద్ధం తర్వాత కూడా శ్రీకృష్ణుడు చాలా కష్టాలు పడ్డాడు. తాను ఎంతో ఇష్టంగా నిర్మించుకున్న ద్వారకా నగరము నీట మునిగిపోవడం స్వయంగా చూశాడు. ఆ తర్వాత అడవిలో వేణుగానం చేస్తున్న సమయంలో.. జర అనే వేటగాడి బాణం తగిలి అవతారం చాలించాడు. శ్రీకృష్ణుడు జీవితం విజయవంతం అయిందేమీ కాదు. జీవితములో ఒక్క క్షణం కూడా ఎటువంటి సంఘర్షణ లేకుండా ప్రశాంతంగా గడిపింది లేదు. జీవితపు ప్రతీ మలుపులో అనేక సమస్యలు ఎదుర్కొన్నాడు. చాలా సంఘర్షణలు పడ్డాడు. గతాన్ని, భవిష్యత్‌ను తెలుసుకోగల సమర్థుడు ఐనా.. ఎప్పుడూ వర్తమానంలోనే బతికాడు. ఏ బంధానికి బానిస కాలేదు. యుద్ధంతోనే శాంతి అని చెప్పాడు.. యుద్ధం లేని జీవితం లేదు అన్నాడు.. అనురాగ ప్రీతి వదులుకోమని బోధించాడు. అందుకే శ్రీకృష్ణుడి జీవితము మానవాళికి నిజమైన ఉదాహరణ.