Uno: ప్రపంచంలోనే అత్యంత సంతోషకర దేశం ఫిన్‌లాండ్.. మరి మనమెక్కడ..?

ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్‌మెంట్ సొల్యూషన్ నెట్‌వర్క్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్‌ను ప్రకటించింది. అందులో ఫిన్‌లాండ్ అగ్రభాగాన నిలిచింది. మరి మన ర్యాంక్ ఎంతో తెలుసా..? 126. మొత్తం 150 దేశాల్లో మన స్థానం అది. మరి ఫిన్‌లాండ్‌లో ఉన్నదేంటి.. మన దగ్గర లేనిదేంటి..?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 21, 2023 | 03:03 PMLast Updated on: Mar 21, 2023 | 3:03 PM

Uno Finelad Best Rank In World

ప్రపంచంలోనే అత్యంత సంతోషకర దేశాల జాబితాలో తొలి స్థానంలో నిలవడం ఫిన్‌లాండ్‌కు ఇది వరుసగా ఆరోసారి. ఆయా దేశాల్లోని పరిస్థితులను, ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఈ జాబితా రూపొందిస్తారు. తలసరి జీడీపీ, సామాజిక మద్దతు, జీవన విధానం, ఆరోగ్యం, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి వంటి అంశాలను పరిశీలించి ర్యాంకులు ఇస్తారు. ఈ జాబితాలో డెన్మార్క్ రెండో స్థానంలో నిలవగా, ఐస్‌లాండ్ మూడోస్థానంలో నిలిచింది. ఇక ప్రపంచంలోనే అత్యంత దారుణ పరిస్థితులున్న ఆప్ఘనిస్తాన్, లెబనాన్‌లు ఈ జాబితాలో అట్టడుగున నిలిచాయి.

మన పొరుగున ఉన్న నేపాల్, చైనా, బంగ్లాదేశ్ కంటే మనం దిగువన నిలిచాం. అంతెందుకు ఆర్థిక సంక్షోభంతో అల్లాడిపోయిన శ్రీలంక కూడా మనకంటే పైనే ఉంది. యుద్ధోన్మాదంతో ఉన్న రష్యా, యుద్ధంతో సర్వనాశనమైన యుక్రెయిన్‌లు 72, 92 స్థానాల్లో నిలిచాయి. ప్రస్తుతానికి 126వ స్థానంలో మనం నిలిచినా గుడ్డిలో మెల్లలాగా గతం కంటే మనం తొమ్మిది స్థానాలు మెరుగయ్యాం. యుద్ధంతో అల్లాడిపోతున్నా యుక్రేనియన్లు మనకంటే సంతోషంగా ఉన్నారంటే మన పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు.

ఫిన్‌లాండ్ లాంటి నార్డిక్ దేశాలు ఎందుకింత ఆనందంగా ఉన్నాయంటే దానికి ప్రధాన కారణం ఆ దేశ పౌరులు వ్యక్తిగతంగా ఆనందంగా ఉండటంతో పాటు వ్యవస్థపై నమ్మకం కలిగి ఉన్నారు. ప్రభుత్వాలపై వారికి విశ్వాసం ఎక్కువగా ఉంది. రాజకీయాలు ఉన్నప్పటికీ అవి కేవలం దేశ ప్రగతికి దోహదం చేసేలా ఉన్నాయి. పదవులు అధికారం కోసం కాదు..కేవలం ప్రజాసేవకోసమే అన్నది వారి ప్రజాప్రతినిధుల నమ్మకం. అవినీతి చాలా తక్కువ. చక్కని వైద్య, విద్యా సౌకర్యాలున్నాయి. ఉద్యోగులకు బాధ్యతలు ఎలా ఉంటాయో వారికి హక్కులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. స్వేచ్ఛకు పరిమితుల్లేవు. సామాజిక బాధ్యతను భారంగా భావించరు. ఖర్చులకు తగినట్లు ఆదాయం ఉంటుంది. ఇక కుటుంబాలతో గడిపే సమయం ఎక్కువ. సామాజికంగా కూడా ఒకరితో ఒకరు కలవడం ఎక్కువ. ఇలా మానసిక ప్రశాంతత కలిగించే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. దీంతో వారిలో సంతోషం వెల్లివిరుస్తోంది.

ఫిన్‌లాండ్‌ పౌరుల్లో గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ఉదారత్వం మరింత పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇతరుల పట్ల సామాజిక బాధ్యత కలిగి ఉండటం, కొత్తవారికి సాయం చేయడం వంటి అంశాల్లో వారి ర్యాంకు మరింత పెరిగింది. కరోనా వంటి సమయాల్లో కూడా ఈ దేశాల్లో నెగెటివ్ ఎమోషన్స్ కంటే పాజిటివ్ ఎమోషన్స్ రెండింతలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ కారణాలతోనే ఈ దేశాల్లో కరోనా మరణాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. యూరోప్ మొత్తంలో ప్రతి లక్షమందికి 80మంది బలైపోతే.. ఇక్కడ మాత్రం 29మంది మాత్రమే చనిపోవడానికి కారణం మంచి ఆరోగ్య పరిస్థితులే కాదు ప్రజల పాజిటివ్ థింకింగ్.

ఫిన్‌లాండ్‌తో మన దేశ పరిస్థితుల్ని పోల్చి చూస్తే మనం ఆ జాబితాలో అంత దిగువన ఎందుకున్నామో అర్థమవుతుంది. మన దేశంలో ప్రభుత్వాలపై నమ్మకం లేదు, అవినీతికి ఆకలెక్కువ, అందరికీ విద్య, వైద్యం , ఉపాధి అనేవి కలలే.. సామాజిక బాధ్యత ఎంత తక్కువో ఓ ఐదు నిమిషాలు రోడ్లపై తిరిగితే అర్థమవుతుంది. ఇక మన రాజకీయం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇన్ని అవలక్షణాలు ఇంకా మనల్ని పట్టుకుని పీడిస్తున్నాయి కాబట్టే మనం ఎక్కడో ఉన్నాం. మనతో పోల్చితే అతి చిన్న దేశాలైన ఫిన్‌లాండ్, డెన్మార్క్ వంటి దేశాల్లో ప్రజలు సంతోషకర జీవితాన్ని గడుపుతున్నారు. సంతోషం అంటే డబ్బు కాదు అదో జీవన విధానం.. మానసిక ప్రశాంతత.. ఎప్పుడైతే అవి పెరుగుతాయో మనం కూడా ఆ జాబితాలో పైకి ఎగబాకుతాం.